This page has not been fully proofread.

అందరికీ సంధ్యావందనము
 
అవస్థల్లోనివారైనా సంధ్యాక్రియపట్ల ఆకర్షణ కలిగించే మంచి ప్రయత్నం
చేశారు. పదిమందినీ మంచివైపు నడిపించే అక్షరకదంబం ఇది.
 
xi
 
నిస్సందేహంగా ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేని సుకృత్యం ఇది. ఇందులో
శ్రీ శర్మగారు కొన్ని విశేషాలుకూడ అందించి, భళీ అనేలా చేశారు.
 
లోకబాంధవుడైన సూర్యుడు ప్రతి ఒక్కరికీ తన తేజస్సుతో హితాన్ని
అందిస్తున్నాడు కదా! అటువంటప్పుడు ఏ కొందరో ఉపనయనదీక్ష ఉన్నవారే
సూర్యుణ్ణి నమస్కరింపదగినవారుగా భావించడం పరిపూర్ణత కానేరదు.
అట్టివారికి ఒక రకమైన పద్ధతి ఉంటే మిగిలినవారందరికీ ఈ
సంధ్యానమస్క్రియ సులభ ఆచరణీయమే అన్న సందేశాన్ని ఈ పుస్తకం ద్వారా
అందించే అవతారశర్మగారి లోకబాంధవరూపమైన ఈ కృత్యానికి
హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
 
మా చిన్నప్పుడు పల్లెల్లో కొందరు రైతులు కాళ్లు చేతులు ముఖాలు కడుక్కొని,
బోదికాలువలో నిలబడి, రెండుచేతులు జోడిస్తూ వదులుతూ, వందల
నమస్కారాలు చేసే దృశ్యం ఇప్పటికీ నాకు స్ఫురణకు వస్తూ ఉంటుంది.
'నమస్కారప్రియో భానుః' అన్నది వారి ఉపాసన. మరికొందరైతే నీటిలో నిలబడి
దోసిళ్లతో నీళ్లు పోస్తున్నట్లు కెలుకుతూ బుడగలు సృష్టిస్తూ ఉండేవారు. అది
వారికి అర్ఘ్యదానాలతో చేసే సూర్యోపాసనే!
 
కాకినాడ పశువులాస్పత్రి వీధిలో ఒకధూళిధూసరిత సాధువు బోగన్విల్లా
పువ్వులను ప్రొద్దుటినుండి మధ్యాహ్నం వరకు ఎండ మండిపోతూ ఉన్నా
సుర్యునికి చూపిస్తూ, నోట్లో ఏవో గొణుగుకుంటూనే ఉండేవాడు. అది అతనికి
పుష్పాలు సమర్పించే సూర్యోపాసనే! ఏదైనా చిత్తశుద్ధి ముఖ్యం. సూర్యునికి
మనం ప్రతి ఒక్కరము ఋణగ్రస్తులమే. కృతజ్ఞతతో కనీసం సూర్యస్మరణ
చేయకపోవడం కృతఘ్నతే అవుతుంది.
 
హైందవేతరమతాలవారిలో కూడా మూడుపూటలా నిర్విఘ్నంగా
వందనసమర్పణ చేయడం ఉండనే ఉంది. మనవారు కూడా ఇలా ఈ శర్మగారి
ప్రచోదనవల్లనైనా త్రిసంధ్యా సముపాసకులు కావాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ
ఈ పుస్తకం చదివి, విజ్ఞులు కావాలని సూచిస్తూ -స్వస్తి.
 
సం. ధూళిపాళ మహదేవమణి.