This page has not been fully proofread.

వృత్తంలోనే ఉన్నందువలన మా మిత్రుడు డాక్టర్ మేళ్లచెర్వు భానుప్రసాదరావు వీటికి దేవీ
అశ్వధాటి అని సార్థకమైన నామకరణం చేసి, చక్కని వ్యాఖ్యను రచించాడు.
 
ఇంతకు ముందు మా భాను పోతన భాగవతాన్ని శృంగార రసకోణం నుండి
పరిశోధించి, పోతన భాగవతం - శృంగారం అనే సిద్ధాంత వ్యాసాన్ని రచించాడు. 'శృంగారాన్ని
ఇంత సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ అంశల్లో శాస్త్ర సమ్మతంగా పరిశీలించిన ధిషణోజ్జ్వల
సాహిత్యవిపశ్చిద్వర్యుడు నేనెరిగినంతలో మరొకరు కనిపించలేదు' అని మహాకవి గుంటూరు
శేషేంద్రశర్మ గారు భానును ప్రశంసించారు. ఇది ప్రత్యక్ష, ప్రత్యక్షర సత్యం.
 
ఈ దేవీ అశ్వధాటి శృంగార భక్తి రసాల సువర్ణపేటి. శృంగార కోణంతో బాటుగా
భక్తికోణాన్ని గూడా నిశితంగా పరిశీలించి కాళిదాసహృదయాన్ని సహృదయ
హృదయరంజకంగా మా భాను ఆవిష్కరించాడు. ఈ శ్లోకాలలో అనేక పాఠాంతరాలున్నై.
వాటిలో చాలభాగం సముచితాలే! సరసాలే! భాను వాటిని గూడా గ్రహించి, వాటి తత్త్వాన్ని,
వాటివల్ల ఈ స్తుతికి కలుగుతున్న నూతన సౌందర్యాన్ని విశదీకరించాడు.
 
దేవీ అశ్వధాటిలో పరమేశ్వరి మనకు శృంగార రసాధిదేవత, జ్ఞానామృతవర్షిణి,
సర్వమంగళ, సంతానప్రద, సంగీతరసిక, ఇంద్రాద్యమర వందిత, భక్తజన తాపాపనోదిని,
దయాంబురాశి, రాక్షసఘ్ని, మాతృమూర్తిగా దివ్యదర్శనమిస్తుంది. ఈమె నుపాసించినవారికి,
ఈ దేవీ అశ్వధాటిని భక్తి ప్రపత్తులతో పఠించిన వారికి దేవి సంసార భీతిని పోగొట్టి
అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, సర్వశుభాల ననుగ్రహిస్తుంది. సోహం భావాన్ని
ప్రసాదిస్తుంది. ఉపరి మనోహర గుణకలిత అయిన, సత్యశివనుందర స్వరూపమైన,
గంగాఝరీ సదృశమైన, నవరస భరితమైన కవితాధారను ప్రసాదిస్తుంది. ఈ భావాలన్నీ ఈ
స్తుతిఖనిలో మణులలాగా దాగి ఉన్నై. మా భాను తన మేధాబలంతో ఆ ఖనిలోకి ప్రవేశించి,
వాటిని బయటకు తీసి, శాణోల్లీఢనం చేశాడు. సముచిత స్థానస్థగితం చేశాడు. కొన్ని తావుల్లో
స్థూలదృష్టికి దూరాన్వయమనిపించినప్పటికీ సార్థకమైన సమన్వయమిది. ఈ కృషినంతటినీ
భాను ఒక తపస్సులాగా చేశాడు. కృతకృత్యుడైనాడు.
 
శ్రీ మేళ్లచెర్వు కుల సోమా! బుధాగ్రసర! ధీమాన్య! సద్గుణఖనీ!
సామీరి భక్తవర! రామాయణాధ్యయనధామాయితాస్య జలజా!
హైమాద్రి నందన కథా మాధురీగత మనోమార్గ! 'భాను ధరణిన్
శ్రీమంతమై చెలగు నీ మంజుభాష్యమిది మేమెల్లసంతసిలగన్.
 
నరసరావుపేట
ఆంగ్ల సంవత్సరాది
 
1-1-1998, గురువారం
 
చేరెడ్డి మస్తాన్రెడ్డి
పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి