This page has not been fully proofread.

దేవీ అశ్వధాటి
 
ఆస్వాదిస్తూ మత్తుగా పడి ఉంటాయి. అప్పుడు వాటి పాదాల కంటుకొన్న పూల పుప్పొళ్లు
సోకి పార్వతీదేవి శిరోజాలు పీతవర్ణంగా మారిపోతాయి. సహజంగా పచ్చని శరీరకాంతితో ఆమె
పీతవర్ణగా ప్రకాశిస్తుంది.ఇప్పుడు పీతకచగా కూడ మారింది. ఈ పీతవర్ణం ఆమె సర్వ
వ్యాపకత్వానికి సూచనం.
 
42
 
ధామ భాను మపి రుంధానం
 
భా తీతి భాను ప్రకాశించేవాడు సూర్యుడు. దేవి భానుమండల మధ్యస్థ -
సూర్యమండల మధ్యభాగంలో ఉంటుంది. ఆ సూర్యమండలం సాక్షాత్తు బ్రహ్మ స్వరూపం.
అది చంద్రాగ్ని సమ్మేళన స్వరూపం. అటువంటి సూర్యమండలం ఆమె నివాసం. అంటే
అందులోకి ప్రవేశించగల శక్తి ఆమెకుంది. అంతేకాదు ఆమె ఉద్యద్భాను సహస్రాభ -
ఉదయిస్తున్న వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది. తేజోవతి. ఆమె తేజస్సు ముందు
సూర్యమండలం కూడ వెలవెల బోతుంది. ఆమె జ్ఞానవిగ్రహ, జ్ఞాన దాయిని, విజ్ఞానఘనరూపిణి.
సూర్యుణ్ణి మించిన ప్రతిభా పాండిత్యాలను చైతన్యాన్నిగూడ ఆమె తన భక్తులకు ప్రసాదిస్తుంది.
ఆశుపదసంధాన మప్యనుగతా
 
ఆమె వాగధీశ్వరి, కళాలాప, కవిత్వ పటుత్వ మహత్వ శక్తి ప్రదాత్రి. ఆశుపద కవితా
ప్రాప్తికి భక్తులు ఆమెను సేవిస్తారు. ఆమె తేజోవంతమైన తన పద సంచారంతో సూర్య
మండలాన్ని సైతం అడ్డగిస్తుంది. దాన్ని నిస్తేజం చేస్తుంది. సూర్య చంద్రులకు స్వయం
ప్రకాశక శక్తి లేదు. కానీ దేవీపాదాల నుండి వెలువడే కొద్దిపాటి కాంతికిరణాలతోనే వారు
తేజోమూర్తులై లోకాలను ప్రకాశింపచేస్తారు. అదీ ఆమె అనుజ్ఞతోనే.
 
విజ్ఞాననిధి అయిన సూర్యుణ్ణి నోరెత్తనివ్వని (వాక్హాంభనం కలిగించే వేగవంతమైన
మాటలు కలది అని అర్థాంతరం.
 
విశేషాలు
 
ఇంధానకీరహృదయబంధు అతీవరసిక అమృతసింధు శబ్దాలు, కవిత మనోహరంగా
హృదయావర్ణకంగా ధర్మశృంగార ప్రధానంగా ఆపాత మధురంగా ఉండాలని సూచిస్తాయి.
ముహురంధాళి శబ్దం సహృదయ ఆనంద లక్షణాన్నీ పీతశబ్దం దేవీ సర్వ వ్యాపకత్వాన్నీ
శృంగారాధిపత్యాన్నీ కచ శబ్దం అజ్ఞాన నిర్మూలనలో ఆమెకు గల శక్తినీ తెలియ చేస్తున్నాయి.
 
ప్రతి మంత్రానికీ ఒక అధిష్ఠాన దేవత - ధ్యానదేవత - ఉంటుంది. ఆ ధ్యానదేవతకు
ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ శ్లోకంలోని ధ్యానదేవత విజ్ఞానదాయిని. ఆశుకవితా ప్రదాయిని.
ఆదిశంకరుడు కవితా ధారకోసం ప్రార్ధించిన సారస్వతమూర్తి కూడ తత్తుల్యమైనదే!
శరజ్జ్యోత్స్నా శుభ్రం శశియుత జటాజూట మకుటాం
వర త్రాస త్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం ।
సకృన్నత్వా న త్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షామధురిమ ధురీణాః ఫణితయః ॥
 
- సౌందర్యలహరి