This page has not been fully proofread.

36
 
దేవీ అశ్వధాటి
 
కుత్రాస హన్మణి విచిత్రాకృతి స్ఫురిత పుత్రాదిదాన నిపుణా (పాఠాంతరం)
 
స్ఫురిత ఒకతీరుముద్దు, మెఱుపు. చిత్రమైన జన్మలు, విచిత్రమైన స్వభావాలు,
ముద్దులు మూటగట్టే అతి విచిత్రమైన ఆకారాలతో ప్రకాశించే షణ్ముఖ గజముఖు లిద్దరూ ఆ
దేవికి ముద్దుబిడ్డలే. ఆ యిద్దరూ సద్యఃస్ఫురన్మూర్తులే. వారిలో ప్రత్యేకించి స్కందుడు
అవక్రవిక్రమానికీ గజాననుడు అనంత విజ్ఞానానికీ ప్రతినిధులు. అలా వారిని తీర్చిదిద్దిన ఆ
మాతృమూర్తి పార్వతీదేవి తనకు అత్యుత్తమ సంతానాన్నీ సర్వ సంపదలను ప్రసాదించాలని
కవి అభ్యర్థన.
విశేషాలు
 
-
 
భక్తుడు తన మదిలో అగజా ధ్యానం చేసినట్లే, కవి తన హృదయంలో కవితామూర్తిని
భావిస్తాడు. రచనా సమయంలో కవికి అదే భావయిత్రి. కారయిత్రికి ముందు గాఢ భావనలో
కవి నిశ్చల తపస్సమాధి స్థితిని పొందుతాడు. ఆ స్థితిని పొందిన కవికి మాత్రమే కవితామతల్లి
దర్శన మిస్తుంది. ఉత్తమ కవితా శక్తిని ప్రసాదిస్తుంది.
 
కవి రచన సమాజానికి కేవలం దర్పణంలాగా మాత్రమేకాక మణిదర్పణంలాగా
వెలుగొందాలి. కనుకనే దేవీ కృపగల కవి రసస్థితిని కలిగించే, అంటే తన్మయ స్థితిని గూర్చే
ఉత్తమ కావ్యరచన చేస్తాడు. దానితోపాటు అందం ఆనందం అపూర్వత ఆదర్శం చైతన్యం
అభ్యుదయం సత్యం శివం సుందరం వంటి లక్షణాలు కలదానినిగా తీర్చిదిద్ది సామాజిక
ప్రయోజనాలను కూడా సాధిస్తాడు. అటువంటి కావ్యాలే కవికి ఉత్తమ సంతానాలు, అవే సర్వ
 
సంపదలు.