We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
29
 
దనుజ శిక్షా విధౌవితత దీక్షా(పాఠాంతరం)
 
వితత = కొనసాగించిన, ఆచరించిన సతు దీర్ఘకాల నైరంతర్యసత్కారాసేవితో దృఢ
భూమిః అని పతంజలి యోగసూత్రం. దీర్ఘకాల పర్యంతం నిరంతరంగా సదాశయంతో దేవి
శత్రుసంహార దీక్షనూ భక్త సంరక్షణ దీక్షనూ వహిస్తుంది.
 
మనోహర గుణా
 
ఆమె సత్వ రజ స్తమో గుణాలకు స్థాన భూతమైంది. వాటికి అతీత మైంది కూడా.
ఆమె త్రిగుణాతీత. అలాగే ఆమె షాడ్గుణ్య పరిపూరిత. విష్ణు పురాణంలో పేర్కొన్న ఐశ్వర్య
వీర్య యశః జ్ఞాన వైరాగ్యాలనే ఆరుగుణాలూ సంధి విగ్రహ యాన ఆసన ద్వైధీభావ
సంశ్రయాలు అనే షడ్గుణాలూ ఆమె సొత్తు. ఆపై సత్వాది గుణాలను అతిక్రమించిన శాంత,
శాంతమే ఆమెకు ప్రధానమైనా ఆమె నిర్గుణ శోభిత, గుణనిధి. మధుర స్వభావం గల
మనస్విని. సంయమన శీల, నిరుపమ, ఉత్తమ గుణ శీలవతి. ఇలా సర్వగుణ సంపదలూ
కలిగి ఉంటుంది. పరమశివుడి మనస్సును రంజింప చేస్తుంది. ఆపై తన మనోహరమైన
లక్షణాలతో భక్తుల మనస్సులను, అహంకారాన్ని నశింపచేసి వారికి ముక్తిని ప్రసాదిస్తుంది.
భిక్షాశినో నటన వీక్షా వినోద ముఖి
 
దేవీ దృష్టులు నవ విధాలు. అవి ఉత్తమ స్త్రీలకు సహజమైనవే! ఈ దృష్టిభేదాలతో
ఆమె సందర్భోచితంగా పలు ప్రయోజనాలు సాధించింది. రసభరితాలైన దేవీ లక్షణాలను ఆది
శంకరుడు సౌందర్యలహరిలో వర్ణించిన తీరు మనోహరంగా ఉంది.
 
సౌందర్యలహరి
 
శివే శృంగారార్దా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతీ :
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జయినీ
సభీషు స్మేరా తే మయి జనని దృష్టిః సకరుణా ॥
ఓ తల్లీ! నీ భర్త అయిన శివుని పట్ల అనురాగాన్నీ శత్రువుల పట్ల బీభత్సాన్నీ సపత్ని అయిన
గంగపట్ల రౌద్రాన్నీ శివ మాహాత్మ్య కథా శ్రవణం పట్ల అద్భుతాన్ని శివుడి హారాలైన సర్పాలను
చూచి భయానకాన్నీ పద్మాల సౌందర్యాన్ని జయించటంలో వీరాన్నీ చెలుల పట్ల పరిహాస
భాషణంతో హాస్యాన్నీ ప్రదర్శించే నీ దృక్కులు నా పట్ల కరుణను ప్రదర్శించును గాక! ఇలా
దేవీ దృక్కులను అష్టరసాత్మకంగా ఆదిశంకరులు అభివర్ణించారు. దృష్టులలోనే నాట్యం
ప్రతిష్ఠితమైతుందనీ భావాలన్నింటినీ రసాలన్నింటినీ ప్రదర్శించే శక్తి నేత్ర దృష్టికి ఉన్నదనీ
"భరత మహర్షి నాట్య శాస్త్రంలో అభివర్ణించాడు.
 
దేవీ సాన్నిధ్యంలో ప్రతిరోజూ ప్రదోష సమయంలో ఆమె ముఖ సౌందర్య భిక్ష కోసం,
భిక్షాశనుడు ఆదిభిక్షువు అయిన శివుడు చిదానందంతో తాండవం చేస్తాడు. నటేశ్వరిగా ఉండి
ఆ తాండవాన్ని చిద్విలాసంగా చూస్తూ వినోదిస్తుంది పార్వతి. ఆమె మహేశ్వర మహాకల్ప
మహా తాండవ సాక్షిణి.