This page has not been fully proofread.

24
 
దేవీ అశ్వధాటి
 
జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా
రంభా కరీంద్ర కర దంభాపహోరుగతి డింభానురంజిత పదా ।
శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా
 
శం భాసురాభరణ గుంఫా సదా దిశతు శుంభాసుర ప్రహరణా ॥ 8
ప్రతిపదార్ధం
 
జంభారి = జంభాసురుడిని సంహరించిన ఇంద్రుడి, కుంభి = ఏనుగైన ఐరావతం
యొక్క, పృథు-కుంభ = మిక్కిలి గొప్పవైన కుంభ స్థలాల్ని, అపహాసి = అపహసిస్తున్న,
కుచ = స్తనాల మీద, సంభావ్య = మిక్కిలిగా అందగించే, హార లతికా = ముత్యాలహారం
కలదీ, రంభా = అరటి బోదెలయొక్క, కరీంద్ర కర = శ్రేష్ఠమైన ఏనుగు తొండం యొక్క,
దంభ = గర్వాన్ని, అపహా = పోగొట్టే, ఊరు = తొడలు కలిగి, గతి = నడక చేత, డింభ =
పిల్లలకు వలె, అనురంజిత = ఎర్రబడిన, పదా = పాదాలు కలదీ, శంభౌ= శివుని తోడి,
ఉదార పరిరంభా = గాఢమైన ఆలింగనం వల్ల, అంకురత్ = మోసులెత్తుతున్న, పులక =
గగుర్పాటు, దంభ = అధికమైన, అనురాగ = ప్రేమకు, పిశునా= సూచన అయినదీ,
భాసుర = ప్రకాశిస్తున్న, ఆభరణ = సొమ్ముల, గుంఫా = కూర్పు గలదీ, శుంభాసుర =
శుంభుడనే రాక్షసుడిని, ప్రహరణా = శిక్షించినదీ, అయిన పార్వతీదేవి, (నాకు), శం = శుభాన్ని,
సదా = ఎల్లప్పుడు, దిశతు = ఇచ్చుగాక !
 
భావం
 
దేవేంద్రుడి ఐరావతం యొక్క కుంభ స్థలాల్ని సైతం ఎకసక్కెం చేసే చక్కనైనది
ఆమె కుచ సీమ. ఆ స్తన సీమ అందాన్ని మరీ అతిశయింప చేస్తుంది ఆమె మెడలోని మంచి
ముత్యాల హారం. ఏనుగు తొండాల కంటే అరటి బోదెలకంటే ఉదాత్తమైనవి ఆమె ఊరువులు.
ఎర్రగా పసిపాపల పాదాల లాగా ముచ్చట గొలుపుతాయి ఆమె పాదాలు. శంకరుడితోడి
గాఢాలింగనంతో ఆమెకు కలిగిన పులకలు, అతడిపట్ల ఆమెకు గల అనురాగానికి సూచికలు .
ఆ అందాల ధగధగలకు కారణం ఆమె ధరించిన ఆభరణాలు. శుభాంగి అయిన ఆ
మహాదేవి నాకు ఎల్లప్పుడూ శుభాన్ని సమకూర్చుగాక!
 
విశేష పద వ్యాఖ్య
 
కుచ సంభావ్య హార లతికా
 
హార = నూటఎనిమిది పేటలు గల ముత్యాల హారం-స్త్రీణాం ప్రియా లోక ఫలో హి
వేషః తమతమ ప్రియులు చూచి సంతోషించటమే హారధారణకు పరమ ప్రయోజనం.
 
దేవీ కంఠాభరణాలు ప్రధానంగా మూడు. అవి నవరత్న ఖచితమైన కంఠమాల, స్వర్ణ
మయమైన చింతాకం, ముత్యాల హారం. వీటిని ధరించి ఆమె రత్నగ్రైవేయ చింతాక లోల
ముక్తా ఫలాన్వితగా వాసి కెక్కింది. ఇవి శివుడికి సంబంధించినవి. అతడికి ప్రీతికరమైనవి.