This page has not been fully proofread.

2
 
భావం
 
దేవీఅశ్వధాటి
 
దేవతా లోకంలోని స్త్రీలందరూ ఆ జగన్మాతకు చెలికత్తెలే ! ఆ దేవికి వారితోడి
నిత్యవిహారం కదంబవనంలోనే! సర్వదేవతలూ శిరసులు వంచి ఆమెకు పాదాభివందనం
చేస్తుంటారు. అప్పుడు వారి కిరీటాలలోని వివిధమణికాంతులు ప్రసరించి ఆమె పాదపద్మాలు
రాగరంజితమైతాయి. తన వక్షోజాలకు అనులేపనమైన హరిచందనంతో తడిసి ఆమె స్తనవల్కలం
సువాసనలు గుబాళిస్తుంది. ఆమె సర్వగుణ సంపన్న. ఆమె సేవించిన తాంబూలంతో పరిసరాలు
పరిమళిస్తాయి. ఆ తాంబూల రసం అశ్వధాటిని మించిన ఆశుకవితాశక్తిని ప్రసాదిస్తుంది.
అటువంటి మహిమోపేతమైన ఆ తాంబూల రసాన్ని సేవించే ఆ పార్వతీదేవి నాకు ఉత్తమ
కవితా శక్తిని ప్రసాదించు గాక !
 
విశేష పద వ్యాఖ్య
చేటీభవ న్నిఖిల భేటీ
 
శ్రీదేవి దాసీభూత సమస్త దేవవనిత, సచామర రమావాణీ సవ్యదక్షిణసేవిత, రంభాది
వందిత, సమానాధిక వర్జిత, సుర నాయిక. దేవతలందరూ ఆమెకు చెలికత్తెలే! ఆమె పరిచారికలే!
వారి సర్వశక్తులూ ఆమెలో అంతర్లీనమే! సర్వసంపదలూ ఆమె అధీనమే! అందుచేతనే కవి
కాళిదాసు తన కవితా పరిపాటికి ఆ దేవిని ప్రార్ధించాడు.
 
కదంబ వన వాటీ
 
ఆ దేవి కదంబవనవాసిని. ఎర్రటి చిగుళ్లతో అందంగా కనిపించే కడిమి తోపులో
నివసిస్తుంది. ఆ కడిమి పూలు మకరందంతో నిండి సువాసనలతో మత్తు గొల్పుతుంటాయి.
అలా విలాసభరితమైన కదంబవనం ఆ దేవికి అత్యంత ప్రీతికరం.
నాకిపటలీ........కరంబిత పదా
 
నాకః= కం సుఖం త న్నభతీ త్యకం. తన్నాస్త్యత్రేతి నాకః - కం అంటే సుఖం. అది
కానిది అకం. అంటే దుఃఖం. దుఃఖం ఇక్కడ లేదు కనుక నాకం. అంటే స్వర్గం.
 
మణిగణ ఖచిత కిరీటాలను ధరించిన బ్రహ్మేంద్రాది దేవత లందరూ ఆ దేవికి
నిత్యం పాదాభివందనం చేసి తరిస్తారు. ఇక సర్వ జగత్తు ఆమెకు పాదాక్రాంతమే ! పార్వతీదేవి
పాదాలు వారి కిరీట మణి కాంతులతో ప్రకాశించి నట్లుగానే తన స్తుతిగతమైన శ్లోకపాదాలు
సర్వ సారస్వత విశేషాలతో విరాజిల్లాలని కాళిదాసు కామన కిరీట రత్నకాంతులు ప్రసరించిన
ఆమె పాదాల వెలుగులు కవితా చైతన్య జ్యోతులు.
 
పాటీర గంధి కుచశాటీ
 
పార్వతీదేవి చందన ద్రవ దిగ్ధాంగి. హృదయాహ్లాద కరమైన హరిచందనాది పరిమళ
ద్రవ్యాలను వక్షోజాలకు ధట్టిస్తుంది. ఈ విధి శృంగార ప్రియులకు పరిపాటి. వాటి గుబాళింపులు