శివశతకము రచన : శ్రీపాదుక ఆచార్య కొల్లూరు అవతారశర్మ కం. శివనామ జపము చేయుచు శివరాత్రిని గడుప నేను శివశతకంబున్ శివ సంకల్పము తోడుత కవనార్చనమనగ నీకు గావింతు శివా! ॥ కం. ముందుగ గణపతిఁ గొలిచియు అందంబగు నమ్మ చరణమంటియుఁ దలతో కందములే కుందములన పొందిక పద్యములఁగూర్చి పొగడెదను శివా! ॥ కం. చిన్మయమగు చైతన్యము ఉన్మనియౌ కళగ లోన నుద్దీప్తంబై మన్మనమున భాసింపగ తన్మయతను నిన్ను నేను తలచెదను శివా! । 1 పంచాక్షరీ పద్యపంచకము ఓంకారము నీ రూపము హ్రీంకారము నీదు శక్తి హ్రీంబీజముతో ఓంకారముచ్చరింపగ ఓంకారము మిగుల శక్తియుత మౌను శివా! ॥ 01 నగజాపతి నాతండ్రన నగజాతనయుండె యన్న నగజే యమ్మౌ నగములకధిపతి మేరువు నగమై నాయింట నిలచు నగశాయి! శివా! ॥ 02॥ మనసున నమకము చమకము తనువందు విభూతిపూత తనరారంగా ఘనతర రుద్రాక్షలనే ననవరతముఁ దాల్చునట్లు ననుఁజూడు శివా! ॥ 03 శిరమున దోషాకరునే మరి భూషగ దాల్చినావు మన్నన తోడన్ కరుణావరుణాలయ! నీ కరుణను నాయెడనుఁగూడఁగనఁ బరచు శివా! ॥04॥ వామాంగంబున భామను సీమలనే మీరునట్టి చీరల తోడన్ వ్యోమావృత కేశంబుల భూమంబగు రూపుఁజూపు భూతేశ! శివా! ॥ 05॥ కం. యమునిన్ దన్నిన నిన్నును యమనియమములాచరించి యర్చింపంగా యముఁడేమి చేయగలఁడిల యమపాశాభీతినిమ్ము యమయముడ! శివా! ॥ 06 మానసషోడశోపచారపూజ భూతేశ! నిన్నుఁ జేరగ నా తరమా నాకివంద్య! నాకౌకసులున్ భేతాళ భూతగణములు నీతావుకుఁ జేరకుండ నిలిచెదరు శివా! ॥ 07 ॥ కావున మానసమందున నావానిగ నిన్ను నిలిపి నగజానాథా! దేవా! నినుఁ బూజించెద . భావనలో నిలువుమయ్య భవహారి! శివా! ॥॥08 3 హర! హర! శంభో! యనుచును స్మరహర! నినుఁ బిలుచుచుంటి శంకర! రమ్మా! చరణన్యాసముఁ జేయుము త్వరగా నా చిత్తపీఠి దయఁజేసి శివా! ॥ 09 ॥ ఇదె పాదపీఠిఁ జూడుము. పదపడి హేమాద్రి తానె పదమై నిలచెన్ పదముంచుమయ్య దానను మదనాంతక! మౌనివంద్య! మాతండ్రి! శివా! ॥ 10 ఇదె సింహాసనమిదిగో! మది తలపగ నిలిపినాడు మాహేశ్వరుడౌ ముదమున ధనదుడు నీకై విదితాశయ! వేదవేద్య! వేంచేయు శివా! ॥ 11 ॥ బంగారు పాత్రలోపల గంగోదకమిచ్చుచుంటి ఘన పాద్యముగా జంగమదేవర! పాదము సంగీకృతి నీయవయ్య అవినాశ! శివా! ॥ 12 మిన్నేటి జలములర్ఘ్యము పన్నీటనుఁ గలిపి నీకు పరిమళయుతమౌ పున్నాగములనుఁ జేర్చియు త్వన్నామార్పితమొనర్తు తరుణాభ! శివా! ॥ 13॥ కం. కం. మేచక పాత్రంబందున శౌచంబగు విధిని నీకు సారంగధరా! ఆచమన జలములుంచితి ఆచమనముఁ గొనుము ప్రీతినర్చనను శివా! ॥ 14 కం. స్నానముఁ జేయించుటకై మానసమున తలఁపగానె మాన్యాపగలే తానవమునంది వచ్చెను స్నానంబొనరింపుమయ్య సర్వేశ! శివా! ॥ 15 ॥ కం. శతరుద్రీయపు మంత్రము నుతియించుచు నేనుఁ జేయ నుదకాదులతో జతనంబభిషేకంబిది సతతము కొనసాగనిమ్ము సర్వేశ! శివా! ॥ 16 । కం. సీమల్మీరిన తనువుకు సేమంబుగ వస్త్రమీయ సేవను నేనే భూమాకృతి నీతనువది నా మాటకు నణుతరంబు నైపోయె శివా! । 17 । ఉపవీతమొసగుచుంటిని ఉపవాసము గోరి నీదు నుపకంఠంబున్ ఉపవీతమిదియ తొలఁగఁగ నువదేశము నీయవయ్య ఉమతోడ శివా! ॥ 18 5 అక్షతలను పూజింపగ నక్షయ సంపదలనిచ్చి యండగ నిలుమా అక్షముడైనను నీకృప దక్షుండగు ధరణిలోన ధరచాప! శివా! । 19 ॥ శంకర! నీవే చెప్పితి శంకల బాయంగ మాకు చాలా సుళువుల్ శంకాలవాల చిత్తము నంకితమతి నంబుజముగ నర్పింతు శివా! ॥ 20 ధూపమునంబరకేశా! ఏపగిదిని నీకు నేను యిచ్చెదనయ్యా నాపాలి కల్పభూజమ! దీపముతో గొనుము దాని దివిజేశ! శివా! ॥ 21 ॥ సాజ్యమ్మగు నైవేద్యము భోజ్యము గావించినాడ భోక్తవు నీవే పూజ్యా! గొనుమాదరమున త్యాజ్యమ్ముగ తలవకుండ దయఁగొనుము శివా! ॥22॥ ఏలా లవంగచూర్ణము మేలగు కప్పురముతోడ మిళితముఁ దీనిన్ చాలా తములపుటాకుల వీలుగ చుట్టితిని గొనుము విడెమిదియ శివా!॥23 'యోకపాం పుష్పం' బంచును దీపంబారతిగ నిడెద దీవింపుమయా! పాపంబులు వైదొలగగ నేపారెడి మంత్రపుష్ప మిదియేను శివా! ॥ 24 ॥ నీ దేహము దిశలన్నిటిఁ దా దాటియు నిండియుండఁ దరమా నాకున్ ప్రాదక్షిణ్యపు నతులను ఈ దాసుడు చేయుటెట్టు లీశాన! శివా! ॥25 ॥ కం. వేలకొలఁది యపరాధము లేలాగున బాపుకొందు నీశా! నీవే నాలాటివారి దిక్కయి లీలల మరిచేసి పాప లెమ్మోయి శివా! ॥ 26 । ఉపవాసము జాగరణము జపహెూమములేవిఁజేయఁ జాలను బేలన్ నెపమెన్నక నాచేతల తవములుగా దలఁవుమయ్య దయతోడ శివా! ॥27 ॥ పంచలింగార్చన రామేశ్వరమది మేనున నా మూలాధారమయ్యె నందున నీవే రామేశ్వర! భూమ్యంశను రామార్చిత! నిలువుమయ్య రాజిల్లి శివా! ॥ 28 ॥ జంబూకేశ్వరలింగము నంబుజమణిపూరమందు నస్తత్వముతో నంబకము లోనఁదెరచియు నంబాపతి! చూపుమయ్య అద్భుతము శివా! ॥29 ॥ అరుణాచలమాగ్నేయము సరితూగగ దానికగును స్వాధిష్ఠానాం బురుహము, వహ్ని తనువుగ కరుణను నద్దాన నిలుపు కామేశ! శివా! ॥ 30 ॥ శ్రీకాళహస్తి యందుఁబి నాకధరా! మారుతంబనాహతసంజ్ఞన్ నీకోసమమరియున్నది నీ కాంతనుఁ గూడి యచట నిండారు శివా! ॥31॥ ముదమున నిన్నే తలఁచెద చిదంబరేశ! గగనసర సిజమధ్యమునన్ పదముంచి నన్నుఁ గావగ యెదఁజేరగ రాగదయ్య యేమరక! శివా! ॥ 32 । ఆంతరదర్శనము ఆంతర దర్శనమీయగ స్వాంతము సంతర్పితమ్ము సంతుష్టమగున్ అంతరమపుడే తొలగును అంతిమ కాంక్షితముఁ దాని నందిమ్ము శివా! ।॥33 మూలాధారమునందున బాలుని గణపతినిఁగొల్వ పాపములుడుగన్ లీలావతి భైరవి తా కేలంగొని నాకు నిమ్ము కేలూత శివా! ॥34 ॥ కం. స్వాధిష్ఠమగ్ని చక్రము శోధించియు ప్రజ్వలింప శూలిని నిన్నున్ బాధింపనీక యంబిక సౌధంబగువృష్టిఁ గాచు సుందరిగ శివా! ॥॥35 ॥ జలచక్రము మణిపూరము జలదునిగా నాక్రమింప జాలిన నీతో చలమగు విద్యుల్లతగా తలపగఁ గన్పట్టునమ్మ తనరారి శివా! ॥36 ॥ హంసల నే బంధింపగ హంసలకాధారమైన యానాహతమున్ హంసల మిథునము రూపున హంసనుగా నన్ను జేయ నలరారు శివా! ॥ 37 నాకంఠపద్మమందున నాకాశపు తత్త్వమరసి యా మీ కవనే నా కన్నుఁగవకుఁ జూపుము లోకము నే మరతునయ్య లోకేశ! శివా! ॥38॥ భ్రూమధ్యమందు నాజ్ఞను సేమంబుగఁ జూపుమయ్య చిత్కళనిపుడే భూమానందము నందెద ఈ మాత్రపు కృపనుఁ జూపుమీశాన శివా! ॥ 39। తలపూవు నందు నిలువుము తలఁదలపులవెల పోయి తనరెద నేనే ఫలముగ పండిన జీవన వలమిది నాకీయుమయ్య పాలాక్ష! శివా! ॥ 40 ॥ వేడికోలు కం. గ్రహదోషంబుల బాపుచు నిహపరముల సుఖమునిచ్చు నీదగు నామం బహరహమున జపియించుచు నిహముననే ముక్తి గాంతు నీశాన! శివా॥ 41 ॥ కం. అడుగను మడిమాన్యంబుల నడుగను సంపదల నిన్ను నరేందుధరా! అడుగను నిన్నిలనేమియు అడిగిన సాయుజ్యమిమ్ముమార్ధాంగ! శివా!॥ 42॥ కం. అక్షరలక్షలమించిన యక్షరములనిచ్చితయ్య యక్షయ్యముగా. అక్షత భాగ్యము నాకవి దక్షములై నిన్నుఁ జేర్చు దక్షేశ! శివా! ॥ 43 ॥ కం. భోగంబుల నాశింపను యాగంబుల సేయనయ్య యర్చావిధులన్ త్యాగంబుగ నే చేసెద రాగాంబుధి ముంచకయ్య రతిసేవ్య శివా! | 44 । భువి భోగంబులు క్షణికము లవి బుద్భుదములకరణిని నంతంబందున్ అవి నాకెందులకయ్యా ! ధవళంబగు ముక్తి నాకు దయచేయు శివా! ॥ 45 ॥ హర! హర! శంభో! యనగను హరియింతువు పాతకముల నంతకహన్తా హరనామ మంత్రజపమే మరువక నే జేయునట్లు మతినిమ్ము శివా! ॥ 46 ॥ నేనే జన్మమునెత్తిన నా నీదగు పాదభక్తి నందీయుమయా దానను ముక్తిని పొందెద నేనేమియుఁ గోరనయ్య నిజమిదియ శివా! ॥47 ॥ నిన్నెప్పుడుఁ గనునట్లుగ కన్నీయుము తండ్రి నాకుఁ గారుణ్యముతో కన్నది నిజమైనదిగా మిన్నగ నేనెంతునయ్య మేనునను శివా! ॥ 48 ॥ ఎంగిలి మాంసము నీకే భంగిని రుచియించెఁ జెప్పు భవ! పరమేశా! వంగిన భక్తుల కీవే వంగుదు వౌరౌర కరుణ వరదాఢ్య శివా! ॥ 49 తినుమని యెంగిలి పెట్టను తనువిమ్మని యడుగనయ్య తమకము తోడన్ కనరమ్మని నిన్నడుగను మనమున విశ్రాంతి గొనుము మాలింగ! శివా! ॥50 ఱాలను రువ్వఁ జాలను జాలను నే మొత్త నిన్ను జడమగు వింటన్ బేలగ నేమియునడుగను హేలగ నాదం నీకు నిచ్చెదను శివా! ॥51॥ చన్నుగ నిన్నొకడెన్నెను మిన్నగ తలపైన కొప్పు మీదట నొకడున్ నిన్నెన్నజాలరైరిగ వెన్నుండును బ్రహ్మకూడ వేసారి శివా! ॥ 52 ॥ కూటికి నీచుల సేవల నేటికి నియమించెదయ్య ఈశా! నీదా చాటున బ్రతుకగనిమ్మా దీటుగ పాదమ్మునిమ్ము తిరముగను శివా! ॥ 53॥ ఆదిమ భిక్షుడవీవుగ నాదగు బిచ్చమ్ము గొనుము నామానసమున్ మీదుగఁ గట్టితి నీకై నాదేమియుఁగానరాక నగధన్వ! శివా! ॥54 ॥ ఇచ్చెను కన్నుల నొక్కం డిచ్చెను తలకాయలన్ని ఈశుడవంచున్ ఇచ్చెద చిత్తము నేనును మెచ్చుము నన్వారి సాటి మేలగును శివా! ॥ 55 ॥ భవునిగ సృష్టినిఁ జేయుదు వవనము మృడనామధేయమందియు నహహా భవమును హర నామంబున చివరకు మరి సంహరింతు సిద్ధమిది శివా! ॥ 56 బంధువులందరుఁ గూడను బంధంబులు జగతిలోన భావింపంగా బంధములు నావి త్రైళ్లగ బంధింపుము భక్తితోడ భయహారి! శివా! ॥57 । నావని యనుచునుఁ బిమ్మట నావారలు ననుచు జగతి నా నా యనుచున్ నావాడవనక నిన్నును నే విడిచిన విడువఁబోకు నీతోడు శివా! ॥58 ॥ ఘోరంబగు నీజగమున యారాటంబందుచున్న యర్బకు నన్నున్ జేరంగ దీసికొనుమా రారా నీకేల భయము రమ్మనుచు శివా! ॥59॥ నిన్నడుగను నీ భుక్తిని నిన్నడుగను వాహనంబు నీవగు భూషల్ నిన్నడుగను నీ వృత్తిని నిన్నడిగెదనయ్య తోడు నీవుండ శివా! ॥60 ॥ సాలీడు పామునేనుఁగు నీ లీలన పొందెఁ గాదె నీ సాయుజ్యం బాలాగు నన్నుఁ గావుము హేలాగతి మోక్షమీయనీశుడవు శివా! ॥ 61 ॥ మాకోరికలనుఁ దీర్పగ మా కెందుకు కల్పవృక్ష మట్లె సురభియున్ మాకొద్దుర చింతామణి మాకన్నియు నీవె కాదె మహిలోన శివా! ॥ 62 । నీ నామ మడఁచు లేమిని నీ నామము పారద్రోలు నిఖిలాఘములన్ నీ నామమవని జనులను తానై తరియింపఁజేయు తరణమ్ము శివా! ॥63॥ ఆపదలు కలిగినప్పుడు నేపుగ సంపదలయందు నీడ్యత నిన్నున్ బ్రాపుగఁ దలతునొ తలవనొ నీపాలన మరువకయ్య నీవాఁడ శివా! ॥ 64॥ మనసున నిన్నే నిలిపియు తనువిది నీ సేవలోనఁ దరియింపంగా ధనమును నీ పూజలలో ఘనముగ వెచ్చింపఁ జేయు కామారి! శివా! ॥ 65 శివయను రెండక్షరములు భవతారక మంత్రమగుచు భద్రత గూర్చున్ శివయనునక్షరయుగ్మమె భువి జనులకునయ్యె కల్పభూజమ్ము శివా! ॥66 ॥ హర హర యని కీర్తించిన హరియింతువు పాతకముల నాక్షణముననే హర! నీకు సాటి దైవము ధరలో మరి కానరారు తథ్యమ్ము శివా! ॥ 67 ॥ పత్తిరిని పూజసేయగ నత్తరి నీవిత్తువయ్య యణిమాదులనే మత్తుడనై నీనామము చిత్తములోఁదలఁచునన్ను ఁ జేకొనుము శివా! ॥ 68 గజముఖ షణ్ముఖ తనయుల నిజపంచముఖత్వమెంచి నీరసపడకే త్రిజగద్భూతంబులకును నిజభోజనమెట్టులిత్తు నిఖిలేశ! శివా! ॥ 69॥ హాలాహల భక్షణమును ఏలాగున చేసినావొ! ఏమా మర్మం- బాలాఘవంబు నీకే హేలాగతిఁ జెల్లెనయ్య హే నాథ! శివా! ॥ 70 ॥ సురలందరు సుధ గ్రోలియు మరి మరి మరణించుచుంద్రు మరు కల్పములో గరళము ద్రావియు నీవే మరణింపక యుందువార! మారారి! శివా! ॥ 71 ॥ హర! హర! శంభో! యనఁగను హరియింతువు పాతకముల నంతకహన్తా హరనామ మంత్రజపమే మరువక నేఁ జేయునట్లు మతినిమ్ము శివా! ॥ 72 ॥ బిట్టరచి నిన్నుఁ బిలువగ. ఎట్టులనో అమ్మ వచ్చె యెంతటి చోద్యం బిట్టులనబ్బుర పరచుచుఁ దట్టుచు వామాంకమిడుము తల్లివిగ శివా! ॥73॥ సుందరము మణిద్వీపము నందున్నది రత్నగృహము నందలి మంచం బందున సుందర శివుఁడుగ నందముగా నమ్మతోడ నగువడుము శివా! ।74॥ నాకీయనశనమడుగను నాకొద్దుర నీదు భూష నాగాభరణా! నా కిడుమా నీ పాదము నాకదె పదివేలు చాలు నందీశ! శివా! ॥ 75 ॥ పాపాంబుధిలో మునిగిన ఈ పాపినిఁ దేల్పనెంచి యీమాత్రముగా నీపాద భక్తి నిచ్చితి నాపాలికినిదియె చాలు నతినిడెద శివా! ॥ 76 ॥ నామది నీదగు పాదము క్షేమంకరమైనదయ్య చిత్తము తోడన్ నీమంబుగ నీయర్చన నేమరకను జేయనిమ్మ యిలలోన శివా! ॥ 77 జీతము నాతము గొనకయే చేతముతో నీదు సేవ సేయుదునెపుడున్ ఆతతమగు నీ సన్నిధి వేతనమదె పదులు నూర్లు వేలందు శివా! ॥ 78 ॥ నిత్యంబభిషేకంబును భత్యంబుగ సేయనిమ్ము భవహరణపరా భృత్యుని కోరిక దీనిని సత్యమ్మొనరింపుమయ్య సర్వేశ! శివా! ॥ 79 ॥ ఏపూజల సాలీడును ఆపామును నేన్గునిన్ను నర్చించినవో ఆపూజ నాకు తెలిపియు నాపాటిది కరుణచూపు మఘనాశ! శివా! ॥ 80 ॥ ఇష్టము నీకొనరింపగ కష్టము లేదయ్య నాకుఁ గనగా జన్మం బిష్టంబైనది చెప్పుము ఇష్టంబగు నదియె నాకు నీశాన! శివా! ॥ 81 ॥ ఎంతోమందికి బంధము లంతంబొందించి ముక్తి నందిచ్చితివే వంతల నావియుఁ గూడను అంతంబొందించి ముక్తి నందిమ్ము శివా! ॥ 82 ॥ భ్రాంతంబగు చిత్తముతో భ్రాంతింగడు చెంది నేను భ్రమియింపంగా శ్రాంతిని బాపఁగ నీవే శాంతిని నాకీయుమయ్య సర్వేశ! శివా! ॥ 83 ॥ అంతా మిథ్యే యైనను సుంతైనను జగతి గంటి సుఖమును నీదె చింతలు బాపెడి చింతన అంతమునందించునదియె యముములను శివా! ||84|| నీ పాదసేవ నీయగ నీపాదము బట్టి నేను నిత్యము వేడన్ ఈ పాటి కరుణ లేదా నాపాలిటి కల్పభూజ! నన్ గనుము శివా! ॥ 85॥ ఎచ్చట నా మది నిలచునొ యచ్చట నీ రూపు నిలుపు మగజానాథా! ఎచ్చట నే శిరముంచెద నచ్చట నీ పాదముంచు మచలేశ! శివా! ॥ 86॥ కామనలు నిండె మనసున ఆ మనసది తిరుగుచుండె నర్థాతురమై ఏమని చెప్పను వెతలను ఆమని నీ చూపు నాకు నందిమ్ము శివా! ॥87 ॥ తనువియ్యది యస్థిరమని మనమున భావింపకుండ మనుచునె యుంటిన్ తనవానిగ ననుఁ దలచియుఁ దనయత నను గావుమయ్య! తండ్రీశ! శివా! ॥ 88 నీపాద సేవనీయుము నాపాలిటికదియె యగును నాకు వాసం బాపాటి దయను జూపుము ఈ పాపడు సంతసించునెంతేని శివా! ॥89 ॥ నీదగు పంచను జేరిన మోదము చేకూరునయ్య ముద్దుగ నన్నున్ నీదగు పుత్రుల సరసన కాదనకయె జేర్చుకొనుము కాళేశ! శివా! ॥ 90 ॥ ఎన్నాళ్లని నీకోసము కన్నార్పక జూతునయ్య కరుణాంబునిధీ! చిన్నారిగ మదినెన్నుచు నన్నును నీవాదరింపు నగజేశ! శివా! ॥ 91 ॥ నిక్కము చావని తెలిసియు నక్కజముగ వెజ్జుకొరకు నరిగెదరహహా నిక్కపు వెజ్జవు నీవను నిక్కంబిది తెలియలేరు నిఖిలేశ! శివా! ॥ 92 ॥ ఇనసాహస్రిని మించియు ఘన శోభను దనరుచుండి కనబడవేలా? అనఘునిగా నను జేసియు మనమున నీవెలుగు జూపు మహనీయ! శివా! ॥93 హర! హర! పురహర! శంభో! స్మరహర! ఫాలాక్ష! ఈశ! సర్పాభరణా! గిరిశాయి! గగనకేశా! గిరిజేశా! యనుచు నిన్నుఁ గీర్తింతు శివా! ॥ 94 ॥ సినిమాలోవలె పిలువగ వెనువెంటనె పలుకవేమి విశ్వేశ! విభో! సినిమా వంటి జీవిత మనిదలఁచియు బలుకవేమి? యగజేశ! శివా! ॥ 95॥ నిన్నుంగానక గడచిన వెన్నెన్నో యేండ్లు నాకు నిట్టిట్టె యనన్ కొన్నే మిగిలినవయ్యా నిన్నునికఁ జూపుమయ్య నిత్యమ్ము శివా! ॥ 96 । కాలము గడచుచునున్నది కాలుండే మరి వైద్యుఁడనగ కనఁబడుచుండెన్ కాలము మూడకమునుపే కాలాంతక! నీవు నాకు కనఁబడుము శివా! ॥ 97॥ నాదగు వాసము కాశిగ నాదగు మాటంత నీదు నామంబనఁగా నాదగు దర్శనమందున నీదేయగు రూపు నిండనిమ్మోయి శివా! ॥98 ॥ చావన భయమే లేదుర కావఁగ నీవుండ నాకు గాలాంతకుఁడా చావన నీలో లయమను భావన నాకిచ్చితీవె భావింతు శివా! ॥ 99 ॥ కం. పుట్టువులెన్నో గడచెను పుట్టిన యీ పుట్టువైన పుట్టువు ద్రుంపన్ పట్టగనిమ్మా పాదము ఒట్టుర నన్నేలకున్న నొరిగెదను శివా! ॥ 100 కాలుని యెదపైఁ దన్నగ కాలాంతకుఁడనుచు నిన్నుఁ గడుఁ గీర్తింపన్ ఆలీల యమ్మదనుచును యేలా మరి చెప్పకుంటివీశాన! శివా! ॥101 ॥ భూతంబులైదు నైనవి నాతనువున సంఖ్యలోన నైదగు చక్రా లాతరణిచంద్రులక్షులు ఆతతముగ నీవె ఈశుఁడనియెదను శివా! ॥ 102 ॥ కం. భూతములు సూర్యచంద్రులు నాతనువున నమరనిట్లు నాథుడవీవే ఈ తీరున నేఁ బొందెద నీ తనువుల సామ్యమిలను నీ దయను శివా! ॥103 తనువుండునంత దనుకను గనుమా రోగంబులేను గనకుండనిలన్ తనువిది శిథిలంబగుచో గొనుమా నీలోకి నన్ను గురుమూర్తి! శివా! । 104 పలుకుల నుతులుగఁ దలపుము పలు తిరుగులఁ దలచుమయ్య ప్రొదక్షిణముల్ గోలెడి జలమభిషేకము తలపుము నా చేతలిట్లు తపమనఁగ శివా! ॥105 సంపదలు కలిగినప్పుడు ఇంపుగ పదిమంది పొగడ నీడ్యుండనుచున్ పెంపున యౌవనముండగ సొంపుగ నిను పాడనిమ్ము సోమేశ! శివా! ॥106 । వేదంబుల వల్లింపక పాదములే మరి పట్టలేక పాపాత్ముడనై మోదంబున మనుచుంటిని ఈ దాసుని కరుణ జూడుమీశాన! శివా! ॥ 107 ॥ అందమ్మగు కందమ్ముల నందముగా కూర్చగానె యమరెను నీకీ నందము శతకంబయ్యెను దమ్ములు నావి త్రైళ్లై భవముడిగె శివా! ॥108 । ఉపకారస్మృతి - ఫలశ్రుతి కం. సుంతయు భేదము లేకయె యింతటి మోదమ్ము గూర్ప నీకేమిత్తున్ అంతయు పోగా చిత్తము సొంతము కాదనుచు నిత్తు సోమేశ! శివా! ॥ అష్టోత్తరశతపద్యము లిష్టములుగ గొనుము నీవు ఈశుడవగుచున్ పుష్టిని పొందియు శతకం బిష్టము జదువరులకిచ్చునిలలోన శివా! ॥ శివ శివ శివ అనరాదా! వనామస్మ తుందుకు జీవించాలి? వనామ జపం చెయ్యాలని ఉందా? రచాక్షరీ జపించడం ఎలాగ అని చింతిస్తున్నారా? సుభులిమినాలను దర్పంచకవాళి passa Biottrings: విధానంలో శివుణ్ణి దర్శించి శివయోగి కావాలనుకుంటున్నారా? ముణ్ణి కీర్తించి, మెప్పించి సకలైశ్వర్యములు చివరగా శివైక్యము చెందాలనుకుంటున్నారా? అన్నింటికీ ఒకే సమాధానం! శ్రీరశతకాన్ని శ్రద్ధగా పఠించండి 'శ్రీపాదుక' ఆచార్య కొల్లూరు అవతారశర్మ శివ శతకము 'శ్రీపాదుక' ఆచార్య కొల్లూరు అవతారశర్మ