దేవీ అశ్వధాటి (కాళిదాస కృతి) వ్యాఖ్యాత డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు దేవీ అశ్వధాటి (కాళిదాస కృతం) వ్యాఖ్యాత డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు M.A., M.Phil., Ph.D. రీడర్, తెలుగు విభాగం ఎస్.ఎస్. & ఎన్. కళాశాల నరసరావుపేట - 522601 LUGA This book is published with the Financial Assistance of TIRUMALA TIRUPATHI DEVASTHANAMS under their scheme Aid to Publish Religious Books ప్రథమ ముద్రణ ఈశ్వర, సంక్రాంతి జనవరి, 1998 ప్రతులు 750 వెల: రూ.25/సర్వస్వామ్య సంకలితం ముద్రణ మురళీ ఆఫ్సెట్ ప్రింటర్స్ నరసరావుపేట ప్రతులకు: శ్రీమతి మేళ్లచెర్వు లక్ష్మీకుమారి 'భరద్వాజ' 4-2-6, బండల బజారు మునిసిపల్ హైస్కూల్ వెనుక, వరసరావుపేట-522601 ఫోన్: 08647 24802 సమర్పణ Palle CHE పార్వతీదేవి గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం పాతూరు, నరసరావుపేట శా॥ అమ్మా ! పార్వతి! భీమలింగ సతి ! బ్రహ్మానంద సంధాత్రి ! నీ విమ్ముం గూర్చగ గూర్చ గల్గితిని దేవీ అశ్వధాటిన్ కవీ టమ్మాన్యుండగు కాళిదాసునకు భాష్యం బిద్ది గైకోగదే! సమ్మోదమ్ము నొసంగి సర్వులకు మోక్షశ్రీని వర్షింపవే !! -భాను డా॥ మేళ్లచెర్వు భానుప్రసాద రావు లక్ష్మీకుమారి డా॥ చేరెడ్డి మస్తాన్రెడ్డి ఎం.ఏ., పిహెచ్.డి ప్రిన్సిపాల్ ఎస్.కె.ఆర్.బి.ఆర్. కళాశాల నరసరావుపేట -522601. డా॥ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి. లెక్చరర్, తెలుగు విభాగం ఎస్.కె.ఆర్.బి.ఆర్. కళాశాల నరసరావుపేట - 522601. మదాలస కవికుల గురువు కాళిదాసు కాళీమాత అనుగ్రహం వల్ల కవన శక్తిని పొంది రఘువంశాది కావ్యాలను, అభిజ్ఞాన శాకుంతలాది నాటకాలను రచించాడు. భక్తినిర్భరమైన అనేక స్తుతులను కూడా రచించాడు. వాటిలో ఈ దేవీ అశ్వధాటి ఒకటి. కాళిదాసు దృష్టిలో జగతఃపితరులైన పార్వతీపరమేశ్వరులు వాగర్థాల లాంటివారు. అందుచేతనే కాళిదాసు శబ్దస్థానీయురాలైన పార్వతీదేవిని శబ్ద ప్రధానమైన అశ్వధాటీ వృత్తాలలో ప్రస్తుతించాడు. అశ్వధాటి పాదానికి 22 అక్షరాలు కలిగిన ఆకృతిచ్ఛందోజాతం. ఇందులో 4 పాదాలుంటై. ప్రతిపాదంలోను త భ య జ స ర స గ అనే గణాలుంటై. 7-14 అక్షరాలు యతి స్థానాలు. కనుక 8-15 అక్షరాలలో ప్రాసయతి ఉంటుంది. అంటే ప్రతి పాదంలోను 2- 9- 16 అక్షరాలు సమంగా ఉండాలి. ఆ ప్రాసయతిలో హల్సామ్యంతోబాటు అచ్సామ్యం గూడా ఉంటే గమనం అందగిస్తుంది. కేవలం హల్సామ్యం మాత్రమే ఉండటం దోషంకాదుగాని ఆ సౌందర్యం మందగిస్తుంది. సంస్కృత కవులలో కొంతమంది ఏ పాదానికి ఆ పాదాన్నే ప్రత్యేకంగా పరిగణించి వివిధ హల్లులతో ప్రాసయతిని ప్రయోగించారు. కాని అది శోభావహంగా లేదు. మన తెలుగు వృత్తాలలో ప్రాస నియమం నిత్యం కనుక, నాలుగు పాదాలలో రకరకాల హల్లులను ప్రాసయతిగా ప్రయోగించే అవకాశంలేదు. కాళిదాసు దేవీ అశ్వధాటిలో నాలుగు పాదాలను ఒకే భాగంగా గ్రహించి ఒకే అచ్చుతో కూడిన హల్లును ప్రయోగించాడు. కానీ, దాక్షాయణీ దనుజ శిక్షా విధౌ అనే 9వ శ్లోకంలోని నాలుగవ పాదం మాత్రం దీనికి అపవాదం. ఈ అశ్వధాటీ వృత్తానికి సితస్తబక, మదాలస, మత్తేభాది నామాంతరా లున్నప్పటికీ గమన కామనీయకాన్నిబట్టి అశ్వధాటి అనే పేరే సార్థకం. కాళిదాస కృతమైన ఈ 13 శ్లోకాలను దేవీప్రణవశ్లోకి, అంబాస్తుతి, కాళీస్తుతి - ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో వ్యవహరిస్తున్నారు. కొంతమంది వీటిలో నుండి 8 శ్లోకాలను మాత్రమే తీసుకొని అంబాష్టకం అని, పదిశ్లోకాలు తీసుకొని దేవీదశశ్లోకి అని గూడా వ్యవహరిస్తున్నారు. దేవీ తత్త్వాన్ని అతివేలంగా వివరిస్తున్న ఈ 13 శ్లోకాలు అశ్వధాటీ 25 వృత్తంలోనే ఉన్నందువలన మా మిత్రుడు డాక్టర్ మేళ్లచెర్వు భానుప్రసాదరావు వీటికి దేవీ అశ్వధాటి అని సార్థకమైన నామకరణం చేసి, చక్కని వ్యాఖ్యను రచించాడు. ఇంతకు ముందు మా భాను పోతన భాగవతాన్ని శృంగార రసకోణం నుండి పరిశోధించి, పోతన భాగవతం - శృంగారం అనే సిద్ధాంత వ్యాసాన్ని రచించాడు. 'శృంగారాన్ని ఇంత సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ అంశల్లో శాస్త్ర సమ్మతంగా పరిశీలించిన ధిషణోజ్జ్వల సాహిత్యవిపశ్చిద్వర్యుడు నేనెరిగినంతలో మరొకరు కనిపించలేదు' అని మహాకవి గుంటూరు శేషేంద్రశర్మ గారు భానును ప్రశంసించారు. ఇది ప్రత్యక్ష, ప్రత్యక్షర సత్యం. ఈ దేవీ అశ్వధాటి శృంగార భక్తి రసాల సువర్ణపేటి. శృంగార కోణంతో బాటుగా భక్తికోణాన్ని గూడా నిశితంగా పరిశీలించి కాళిదాసహృదయాన్ని సహృదయ హృదయరంజకంగా మా భాను ఆవిష్కరించాడు. ఈ శ్లోకాలలో అనేక పాఠాంతరాలున్నై. వాటిలో చాలభాగం సముచితాలే! సరసాలే! భాను వాటిని గూడా గ్రహించి, వాటి తత్త్వాన్ని, వాటివల్ల ఈ స్తుతికి కలుగుతున్న నూతన సౌందర్యాన్ని విశదీకరించాడు. దేవీ అశ్వధాటిలో పరమేశ్వరి మనకు శృంగార రసాధిదేవత, జ్ఞానామృతవర్షిణి, సర్వమంగళ, సంతానప్రద, సంగీతరసిక, ఇంద్రాద్యమర వందిత, భక్తజన తాపాపనోదిని, దయాంబురాశి, రాక్షసఘ్ని, మాతృమూర్తిగా దివ్యదర్శనమిస్తుంది. ఈమె నుపాసించినవారికి, ఈ దేవీ అశ్వధాటిని భక్తి ప్రపత్తులతో పఠించిన వారికి దేవి సంసార భీతిని పోగొట్టి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, సర్వశుభాల ననుగ్రహిస్తుంది. సోహం భావాన్ని ప్రసాదిస్తుంది. ఉపరి మనోహర గుణకలిత అయిన, సత్యశివనుందర స్వరూపమైన, గంగాఝరీ సదృశమైన, నవరస భరితమైన కవితాధారను ప్రసాదిస్తుంది. ఈ భావాలన్నీ ఈ స్తుతిఖనిలో మణులలాగా దాగి ఉన్నై. మా భాను తన మేధాబలంతో ఆ ఖనిలోకి ప్రవేశించి, వాటిని బయటకు తీసి, శాణోల్లీఢనం చేశాడు. సముచిత స్థానస్థగితం చేశాడు. కొన్ని తావుల్లో స్థూలదృష్టికి దూరాన్వయమనిపించినప్పటికీ సార్థకమైన సమన్వయమిది. ఈ కృషినంతటినీ భాను ఒక తపస్సులాగా చేశాడు. కృతకృత్యుడైనాడు. శ్రీ మేళ్లచెర్వు కుల సోమా! బుధాగ్రసర! ధీమాన్య! సద్గుణఖనీ! సామీరి భక్తవర! రామాయణాధ్యయనధామాయితాస్య జలజా! హైమాద్రి నందన కథా మాధురీగత మనోమార్గ! 'భాను ధరణిన్ శ్రీమంతమై చెలగు నీ మంజుభాష్యమిది మేమెల్లసంతసిలగన్. నరసరావుపేట ఆంగ్ల సంవత్సరాది 1-1-1998, గురువారం చేరెడ్డి మస్తాన్రెడ్డి పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి DONEPUDI VENKAYYA Poet & Critic 11-2-22, Colony Road Narasaraopet - 522 601 THE WORSHIP OF BEAUTY This is a creative and critical commentary on the beautiful Sanskrit hymn to KALI, The Universal Mother, written by Kalidasa, the greatest of the Sanskrit poets in a select metre Aswa - dhati, named after the brisk pace of a horse at a gallop. The hymn is a scintillating work bristling with a bewildering yet beautiful variety of word pictures, interlaced with the symbols of mythological characters and unknown, unfamiliar and startlingly new images that come one over the other like a cascade. In this hymn we catch a glimpse of the beauty of the Universal Mother, the attractive qualities of Her Head and Heart, the grace and grandeur of Her movements, the charm of Her physical appearance - all combined in a perfect harmony. We get spontaneously and completely absorbed in and identified with that Universal Beauty, the beauty of Brahman, the divine beauty in its full manifestation. In presenting and interpreting the contents of this marvellously beautiful work of Kalidasa, Dr. Mellachervu Bhanu Prasada Rao, a well-informed scholar of conspicuous ability, has produced a masterpiece in literary criticism, a brilliant work of critical understanding. With his vast erudition and dazzling skill and with the sweep and depth of his consummate scholarship coupled with a rare insight, Dr. Bhanu Prasada Rao could successfully unearth the hidden meanings of many a mindboggling metaphors of Kalidasa and could thus kindle the flame of poetry in capsules. Mr. Bhanu's keen sense of research is evident through out the book which is thought-provoking, being an original attempt at a re-interpretation of the poem in a new light. The commentary is exquisite and exhaustive. The style is irresistible and vibrating. The text together with the commentary shakes, jolts and moves the reader to the core of his heart and makes him sing and incites him to dance with joy. It is a real treat for the reader who wants to become aesthetically and socially aware as a poet. Dr. Bhanű has already become popular with his fascinating thesis, Potana Bhagavatam - Sringaram and now this charming commentary, "Devi Aswadhati," is quite another feather in his cap. Donepudi Venkayya Narasaraopet 3-1-1998 డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు -ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి. రీడర్, తెలుగు విభాగం ఎస్.ఎస్. & ఎన్. కళాశాల నరసరావుపేట - 522601 అభివందనాలు మహాకవి కాళిదాసు తాను రచించిన దేవీస్తుతి శ్లోక త్రయోదశిలో దేవీ స్వరూప స్వభావ సౌందర్య వర్ణనంతో పాటు కవితా కన్యాస్వరూప స్వభావాలను కూడా ఆవిష్కరించాడు. వాటిని భక్తులకూ కవితాసక్తులకు వివరించాలనే భావంతో ఈ వ్యాఖ్యా గ్రంథాన్ని వెలువరిస్తున్నాను. ఈ స్తుతి రకరకాల పేర్లతో ఎనిమిది నుండి పదమూడు అశ్వధాటీ వృత్తాలతో పాఠభేదాలతో ప్రచారంలో ఉంది. వాటిలో రసోచితమైన పాఠాలనే స్వీకరించాను. కొన్ని తావుల్లో పాఠభేదాలను కూడా వ్యాఖ్యానించాను. అది దేవీ తత్త్వాన్నీ కవితా విశేషాల్నీ పరిపూర్ణంగా నిరూపించాలన్న ధ్యేయంతో చేసిన పని. ఈ వ్యాఖ్యలో దేవీ సప్తశతి, లలితాసహస్ర నామావళి, సౌందర్యలహరి ఉపనిషత్తులు గురుబాల ప్రబోధిక వంటివి ఎంతగానో ఉపకరించాయి. ఆయా గ్రంథకర్తలకు నా నమోవాకాలు. మా మేనమామ, దేవీతత్త్వజ్ఞులు శ్రీ దోనెపూడి వెంకయ్యగారు ఈ గ్రంథ రచనకు ప్రథమతః నన్ను ప్రోత్సహించి THE WORSHIP OF BEAUTY అనే శీర్షికతో తమ అభిప్రాయాన్ని అందించి ఆశీర్వదించారు. ప్రియమిత్రులు, నిత్యసాహిత్యవ్రతులు డా॥చేరెడ్డి మస్తాన్రెడ్డి, డా॥ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి ఆద్యంతం చేదోడువాదోడుగా చెంతనిలిచి మదాలస పేరుతో తమ అభిప్రాయాన్ని వెలువరించారు. డా॥ వేదాన్తం సత్య శ్రీనివాస అయ్యంగార్, శ్రీ కంచర్ల కామేశ్వరరావు తగుసలహాలతో సహకరించారు. ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఆర్థిక సాహాయ్యం చేశారు. మురళీ ఆఫ్ సెట్ ప్రింటర్స్ వారు ఈ గ్రంథాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. - ఇలా ఈ దేవీ అశ్వధాటీ కృతినిర్మితిలో సహకరించిన అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు.. Poort నరసరావుపేట. ఈశ్వర, భోగి 13-1-1998 భాను. దేవీ అశ్వధాటి శ్లో॥ చేటీ భవ న్నిఖిల భేటీ కదంబ వన వాటీషు నాకి పటలీ కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా ! పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖవీటీరసేన తనుతామ్ ॥ 1 ప్రతిపదార్థం కదంబ = కడిమి చెట్ల యొక్క, వనవాటీషు ఉద్యానవనాలలో, బేటీభవత్ = చెలికత్తెలుగా చేయబడిన, నిఖిలభేటీ = సమస్త దేవతా వనితలు గలదీ, నాకిపటలీ = స్వర్గవాసులైన దేవతాసమూహాల, కోటీర = కిరీటాలకు చెందిన, చారుతర = మిక్కిలి మనోజ్ఞమైన, కోటీ = శిఖరాగ్రభాగాలలో ఉన్న, మణీకిరణ = రత్నకాంతుల యొక్క, కోటీ = సమూహాలు, కరంబిత = వ్యాపించిన, పదా = పాదాలు గలదీ, పాటీర - చందనపు, గంధి గంధంగల, కుచశాటీ = స్తనవల్కలం గలదీ అయిన, అగాధిపసుతా పార్వతీదేవి, ఉదార = అధికమైన మహిమగల, ముఖ = నోటిలోని, వీటీరసేన = తాంబూల రసంతో, ఘోటీఖురాత్ = ఆడ గుర్రాల గిట్టల కంటె, అధికధాటీం = ఎక్కువ వడి గల, కవిత్వ పరిపాటీం = కవితా రీతిని, తనుతాం = వృద్ధి చేయును గాక ! = = 2 భావం దేవీఅశ్వధాటి దేవతా లోకంలోని స్త్రీలందరూ ఆ జగన్మాతకు చెలికత్తెలే ! ఆ దేవికి వారితోడి నిత్యవిహారం కదంబవనంలోనే! సర్వదేవతలూ శిరసులు వంచి ఆమెకు పాదాభివందనం చేస్తుంటారు. అప్పుడు వారి కిరీటాలలోని వివిధమణికాంతులు ప్రసరించి ఆమె పాదపద్మాలు రాగరంజితమైతాయి. తన వక్షోజాలకు అనులేపనమైన హరిచందనంతో తడిసి ఆమె స్తనవల్కలం సువాసనలు గుబాళిస్తుంది. ఆమె సర్వగుణ సంపన్న. ఆమె సేవించిన తాంబూలంతో పరిసరాలు పరిమళిస్తాయి. ఆ తాంబూల రసం అశ్వధాటిని మించిన ఆశుకవితాశక్తిని ప్రసాదిస్తుంది. అటువంటి మహిమోపేతమైన ఆ తాంబూల రసాన్ని సేవించే ఆ పార్వతీదేవి నాకు ఉత్తమ కవితా శక్తిని ప్రసాదించు గాక ! విశేష పద వ్యాఖ్య చేటీభవ న్నిఖిల భేటీ శ్రీదేవి దాసీభూత సమస్త దేవవనిత, సచామర రమావాణీ సవ్యదక్షిణసేవిత, రంభాది వందిత, సమానాధిక వర్జిత, సుర నాయిక. దేవతలందరూ ఆమెకు చెలికత్తెలే! ఆమె పరిచారికలే! వారి సర్వశక్తులూ ఆమెలో అంతర్లీనమే! సర్వసంపదలూ ఆమె అధీనమే! అందుచేతనే కవి కాళిదాసు తన కవితా పరిపాటికి ఆ దేవిని ప్రార్ధించాడు. కదంబ వన వాటీ ఆ దేవి కదంబవనవాసిని. ఎర్రటి చిగుళ్లతో అందంగా కనిపించే కడిమి తోపులో నివసిస్తుంది. ఆ కడిమి పూలు మకరందంతో నిండి సువాసనలతో మత్తు గొల్పుతుంటాయి. అలా విలాసభరితమైన కదంబవనం ఆ దేవికి అత్యంత ప్రీతికరం. నాకిపటలీ........కరంబిత పదా నాకః= కం సుఖం త న్నభతీ త్యకం. తన్నాస్త్యత్రేతి నాకః - కం అంటే సుఖం. అది కానిది అకం. అంటే దుఃఖం. దుఃఖం ఇక్కడ లేదు కనుక నాకం. అంటే స్వర్గం. మణిగణ ఖచిత కిరీటాలను ధరించిన బ్రహ్మేంద్రాది దేవత లందరూ ఆ దేవికి నిత్యం పాదాభివందనం చేసి తరిస్తారు. ఇక సర్వ జగత్తు ఆమెకు పాదాక్రాంతమే ! పార్వతీదేవి పాదాలు వారి కిరీట మణి కాంతులతో ప్రకాశించి నట్లుగానే తన స్తుతిగతమైన శ్లోకపాదాలు సర్వ సారస్వత విశేషాలతో విరాజిల్లాలని కాళిదాసు కామన కిరీట రత్నకాంతులు ప్రసరించిన ఆమె పాదాల వెలుగులు కవితా చైతన్య జ్యోతులు. పాటీర గంధి కుచశాటీ పార్వతీదేవి చందన ద్రవ దిగ్ధాంగి. హృదయాహ్లాద కరమైన హరిచందనాది పరిమళ ద్రవ్యాలను వక్షోజాలకు ధట్టిస్తుంది. ఈ విధి శృంగార ప్రియులకు పరిపాటి. వాటి గుబాళింపులు 3 డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు స్తన వల్కలానికి గుస్తరించి ఆమె హృదయం శృంగార రస కోశంగా పరిణమిస్తుంది. అలాటి గుబాళింపులు తన కవితా రూపంలో వెలువడాలని కవి భావన. కవిత్వ పరిపాటీ పార్వతీదేవి ఛందస్సార, శాస్త్రసార, కవితా వ్యుత్పత్తికి కాణాచి, కావ్యకళ. కావ్యోత్పాదక ప్రతిభ ఆమెలో కళా స్వరూపంగా ఉంది. అందువల్ల ఆమె కావ్యరచనా సమర్ధురాలు. ఆమె ప్రతిభాస్వరూపిణి. కోరిన వారికి కవితాధారను ప్రసాదిస్తుంది. మాసమేకం ప్రతిదినం, త్రివారం యః పఠేన్నరః ॥ భారతీ తస్య జిహ్వాగ్రే, రంగే నృత్యతి నిత్యశః ॥ రోజుకు మూడు పూటల వంతున ఒక్క నెల రోజుల పాటు లలితా సహస్రనామ పారాయణం చేసినట్లయితే భారతీదేవి వారి జిహ్వాగ్రాల మీద నర్తిస్తుంది. కనుకనే కాళిదాసకవి ఆ తల్లిని కమ్మని కవితా క్రమాన్ని ఇమ్మని అర్థించాడు, సాధించాడు గూడా. అగాధిప సుతా లలితాసహస్రనామస్తోత్రం పర్వతాలకు అధిపతి హిమగిరి. అది సకల సౌభాగ్య నిలయం. వజ్ర వైడూర్య మరకత మాణిక్యాది నవరత్న నిధి. సంజీవిని వంటి ఔషధాలకూ సిందూర గైరికాది ధాతువులకూ భోగ పదార్థ సంపదలకూ ఆటపట్టు. ప్రేమైక జీవులకూ ఆనందోపాసకులకూ విద్యాధర కిన్నర కింపురుష గరుడ గంధర్వ మిథునాలకూ విహార భూమి. పలు రకాల పశువులకూ పక్షులకు క్రీడావని. రూప విద్యా వినయ సౌజన్యాలకూ ఉత్సాహం పౌరుషం మొదలైన ఉత్తమ గుణాలకూ కుల శీల సౌందర్య సద్భావాలకూ నిలయం. అంతటి మహనీయుడైన హిమవంతుడికి ప్రియ పుత్రిక పార్వతీదేవి. ఆమె తండ్రి గుణగణాలను పుణికి పుచ్చు కొన్నది. ఘోటీ ఖురాదధిక ధాటీ ధాటి విషయంలో ఆడజాతి గుర్రాలు మగజాతి కన్న కడు మిన్న. ఒడుపైన వాటి గిట్టల ధ్వని వేగం లయ బద్ధంగా శ్రుతి పేయంగా ఉంటుంది. అంతకంటే కమనీయమైన ఆశు కవితా ధారను ప్రసాదించమని కవి కాళిదాస కామన. ముఖవీటీ రసేన రసః= రస్యతే ఆస్వాద్యత ఇతిరసః రస ఆస్వాదనే. ఆస్వాదింపబడేది. పార్వతీ దేవి నిత్య తాంబూల పూరిత ముఖ, కర్పూర వీటికామోద సమాకర్ష దిగంత. ఆమె నోటిలోని తాంబూలపు పరిమళాలు దశదిశలా వ్యాపిస్తాయి. సర్వ దేవతలనూ ఆ పరిమళాలు ఆకర్షిస్తాయి. ఆ తాంబూలం విలాసానికీ రసికతకూ ఆనందాతిశయానికీ సంకేతం. ఆమె సేవించిన తాంబూల రసంతోనే అనురాగంతో తనకు రసవత్తరమైన కవితాధారను ప్రసాదించమని కవి కోరిక. వీటికామోదం లాగానే తన కవిత సర్వ జనామోదం కావాలని మహాకవి కాళిదాసు వాంఛ. 4 విశేషాలు దేవీఅశ్వధాటి కడిమిపూలూ మణి గణ ఖచితమైన మకుటమూ మణి కాంతులూ వాటి చేత ప్రకాశించే ఆమె పానాలూ పాటీర గంధంతో కూడిన కుచశాటి ముఖవీటి వంటివి అన్నీ అరుణ వర్ణ విశేషాలే. అందుచేతనే ఆమె సర్వారుణగా సుప్రసిద్ధ. అరుణ వర్ణం అభివృద్ధికీ అనురాగానికీ కరుణకూ సంకేతం. కడిమిపూలూ కాంతాజనం పాటీరగంధం ముఖవీటి కుచశాటి మొదలైనవన్నీ ఆమె సుఖాభిలాషకూ శృంగార భావనకూ రసనిష్ఠకూ ప్రతీకలు. అవి సర్వప్రాణులకు సంతోష కారకమైన శృంగార ప్రశస్తికి సూచికలు. ఉదార శబ్దంవల్ల ఉత్తమ కావ్యలక్షణమైన ఉదారత స్ఫురిస్తుంది. పదాలు నర్తించినట్లుండటం ఉదారత. దీని వల్ల పద్యగతి నృత్య లీలా స్ఫోరకంగా ఉంటుంది. ఇటువంటి పద ప్రయోగశక్తి ఆమె ముఖతః మాత్రమే సంక్రమిస్తుంది. తన కోరిక కనుగుణంగానే కాళిదాసు అశ్వధాటీ వృత్తంలో దాన్ని సాధించినట్లు స్పష్టమైతున్నది. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు శ్లో॥ ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణా పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా। నీపాలయా సురభి ధూపాలకా దురితకూపా దుదంచయతు మాం రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ॥ 2 ప్రతిపదార్థం 5 ద్వైపాయన ప్రభృతి ద్వీపమే ఉత్పత్తి స్థానంగా గల వేదవ్యాసుడు మొదలైన శాపాయుధ = శాపమే ఆయుధంగా గల తపస్సంపన్నులైన మహర్షులకు, త్రిదివ = స్వర్గానికి, సోపాన = నిచ్చెనలైన, ధూళి చరణా = పాదరేణువులు గలదీ, పాప + అపహ = పాపాలను పోగొట్టే, స్వ మను = తన యొక్క మంత్రాన్ని, జప = జపించటంలో, అనులీన జన = తన్మయులైన భక్తుల యొక్క, తాప = తాప త్రయాలను, అపనోద = తొలగించటంలో, నిపుణా = నేర్పరితనం కలదీ, నీప+ఆలయా= కడిమి వనంలో నివసించేది, సురభి = ముర అనే సుగంధ ద్రవ్యాన్ని, ధూప = సువాసన కోసం పొగ వేసిన, అలకా = నెఱి వెండ్రుకలు కలదీ, రూపాధికా = మిక్కిలి అందమైనది, శిఖరి భూపాల వంశ = పర్వత రాజయిన హిమవంతుడి వంశానికి, మణిదీపాయితా = రత్నదీపం వంటిదీ అయిన, భగవతీ = సమసైశ్వర్యవంతురాలయిన పార్వతీ దేవి, మాం= నన్ను, దురిత కూపాత్ = పాపకూపం నుండి, ఉదంచయతు= ఉద్ధరించునుగాక! భావ = పార్వతీ దేవి పాదరేణువులు పరమ పవిత్రమైనవి. శాపాయుధులైన వ్యాసాది మహర్షులకు సైతం అవి ముక్తి సోపానాలు. మహత్తరమైనది ఆమె మంత్ర జపం. పరవశంతో తన మంత్రాన్ని జపించే భక్తుల పాపాలను ఆమె పటాపంచలు చేస్తుంది. వారికి శుభ పరంపరలను ప్రసాదిస్తుంది. కడిమి వనం ఆమెకు నిత్యనివాస ప్రదేశం. అనునిత్యం తన శిరోజాలను ధూప ధూమాలతో పరిమళింపచేస్తుంది. ఆమె సుగుణశీల, మహోన్నతుడైన తన తండ్రి హిమవంతుడి ఇంటికి మణిదీపంలా వెలుగుతూ పెరిగింది. ఆ పార్వతీ దేవి నన్ను ఈ సంసార కూపం నుండి వెలువరించుగాక! విశేష పద వ్యాఖ్య త్రిదివ సోపాన ధూళి చరణా i త్రిదివం = హరి హర బ్రహ్మాఖ్యా ప్రయో దీవ్యంతి క్రీడంత్య త్రేతి త్రిదివః. విష్ణు శివ బ్రహ్మలు క్రీడించే ప్రదేశం త్రిదివం. శ్రీదేవీ చరణ రేణువులు స్వర్గానికి సోపానాలు. వాటిని శిరసా వహిస్తే పరబ్రహ్మ తత్త్వం పట్ల ఆత్మను ఆమె సంయోగ పరుస్తుంది. అంటే స్వర్గం కరతలామలక మైతుంది. అందువల్లనే ఆమెను దేవీం భుక్తి ముక్తి ప్రదాయినీం అని దేవ్యుపనిషత్తు ప్రస్తుతిస్తున్నది. సత్త్వ రజస్తమో 6 గుణ ప్రతిరూప మైన ఆమె చరణ ధూళి భక్తులను సృష్టి స్థితిలయకారులు నివసించే త్రిదివానికి చేరుస్తుంది. మహాత్ముల పాదధూళి పవిత్రమైనది కదా! త్వత్పాద పంకజ రజః ప్రణిపాత పూర్వైః పుణ్యై రనల్ప మతిభిః కృతిభిః కవీంద్రః । - దేవీ చర్చాస్తుతి ఆమెకు నమస్కరించి, ఆమె పాదపంకజ రజస్సును శిరస్సున ధరిస్తే కవీశ్వరులు అనల్ప కల్పనా ప్రతిభు లైతారు. పాపాపహ స్వ మను ..... నిపుణా । పాప= పాపం, అజ్ఞానం, అవిద్య; మను = మననాత్రాయతే ఇతి మన్హః. మననం చేయటం వల్ల రక్షించేది లేదా విశ్వాసం వల్ల రక్షించేది మంత్రం. తాపం = ఆధ్యాత్మిక, ఆధి భౌతిక ఆధి దైవిక మనేవి తాప త్రయాలు. ఆధ్యాత్మికం = తనకూ తనవారికీ కలిగిన వ్యాధుల వలన మనిషికి కలిగే బాధ. ఆధి భౌతికం= సర్ప వృశ్చికాదుల వల్ల కలిగే బాధ. అధి దైవికం = దైవికంగా సంభవించే అగ్నిప్రమాదాలూ భూకంపాలు మొదలైన వాటి వలన కలిగే బాధ. ఆ దేవి మంత్రోపాసనతోనూ పూజా పురస్కారాలతోనూ తనను భజించే భక్తుల పాపాలను పోగొడుతుంది. - దేవీ భాగవతం మేరు పర్వత మాత్రోపి, రాశిః పాపస్య కర్మణః। కాత్యాయనీం సమాసాద్య, నశ్యతి క్షణ మాత్రతః॥ ఛిత్వా భిత్వా చ భూతాని, హత్వా సర్వ మిదం జగత్ । ప్రణమ్య శిరసా దేవీం, న స పాపై ర్విలిప్యతే॥ - బ్రహ్మాండ పురాణం భక్తుల అవిద్యను అజ్ఞానాన్నీ అంతం చేస్తుంది పరమ శక్తిమంత మైన ఈ భగవతీ మంత్రజపం. సర్వ మంత్రాలకూ ఆ దేవి కాణాచి కావటం చేతనే ఆమెను మంత్రాణాం మాతృకాదేవీ అని శ్రీదేవ్యుపనిషత్తు కీర్తిస్తున్నది. ఆమె మంత్రసార, మంత్ర స్వరూపిణి, మంత్రవీర్య ప్రకాశ. తన మంత్ర జపంలో నిమగ్నులైన భక్తుల్ని ఆమే స్వయంగా రక్షించి శుభాన్ని కలిగిస్తుంది. మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నీపాలయా నీపః నయతి ప్రాణినస్సుఖం నీపః ప్రాణులకు సుఖాన్ని కలిగించేది నీపం. అమ్మవారికి అటువంటి నీప వనం నివాసం. అందుచేత ఆమె సుఖలాలస. సురభి ధూపాలకా సురభి = ణానికి ఇష్టమైన గంధం. కమ్మని తావి. కళాప్రియులైన అతివలు అభ్యంగన స్నాన మాచరించి పరిమళ ద్రవ్యాలతో కురులకు పొగ వేసుకొంటారు. సహజ సురభిళమైంది పార్వతీ కేశ పాశం. దాన్ని మరీ పరిమళ భరితం చేసుకోవాలని సురభి ధూపం వేసుకొంటుంది ఆమె. ఇది స్త్రీలందరకూ ఉపాదేయం. సహజ సువాసనాభరితమైన శైలజా శిరోజాల మహిమను గూర్చి శంకరులు వివరించారు. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు - సౌందర్య లహరి శ్లో॥ యదీయం సౌరభ్యం సహజ ముపలబ్ధం సుమనసో వసం త్యస్మి న్మన్యే వలమథన వాటీ విటపినాం ॥ పార్వతీదేవి కేశపాశం నునుపు మెరుగు చిక్కన గల్గిన సల్ల కలువల వనంలాగా ప్రకాశిస్తుంది. ఎంతో సహజ సువాసనా భరితంగానూ ఉంటుంది. ఆ పరిమళాల కోసం నందనవనంలోని దేవతాకుసుమాలు వచ్చి అక్కడే నివసిస్తాయి. అటువంటి ఆమె కొప్పు భక్తుల ఆజ్ఞానాన్ని పారద్రోలుతుంది.. రూపాధికా 7 ఆమె శివ రూపంగల పరాశక్తి మహారూప సర్వజగన్మోహిని, కోమలాంగి, బాల్య పొగండ కైశోర యౌవనాది భేదాలు లేని నిత్యయౌవన లోకాలను మోహింప చేసే సుందరమైన రూపం ఆమెది. అందు చేతనే ఆమె రూపాధిక. శిఖరి భూపాల వంశమణి దీపాయితా హిమవంతుడు అత్యున్నత శిఖరాలుగల కుల పర్వతాలలో ఒకడు. అవి ఏడు. మహేంద్రో మలయస్సహ్య, శుక్తిమాన్ గంధ మాదనః । వింధ్యశ్చ పారియాత్రశ్చ, సప్లైతే కుల పర్వతాః ॥ వాటిలో ఉత్తమ వంశ సంజాతుడూ గుణోన్నతుడూ హిమవంతుడు. వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్య నీల ప్రవాళ మౌక్తికాలు అనే నవరత్నాలకూ ఖని. ఇటువంటి హిమవంతుడి వంశాన్ని మణి దీపంలా ప్రకాశింప చేసింది పార్వతీదేవి. భగవతీ మాహాత్మ్యస్య సమగ్రస్య, ధైర్యస్య యశసః శ్రియః । జ్ఞాన వైరాగ్య యోశ్చైవ, షణ్ణం భగ ఇతీరితః ॥ సంపూర్ణమైన మాహాత్మ్యం ధైర్యం కీర్తి సంపద జ్ఞానం వైరాగ్యం అనే ఆరింటికీ కలిపి భగ అని పేరు. ఆ లక్షణాలు కలది భగవతి. ఆమె వాటిని తన భక్తులకు ప్రసాదిస్తుంది. విశేషాలు భగవతీ చరణ ధూళీ మాహాత్మ్యం, మంత్ర మహిమ, నీపావాసం, సుఖాభిలాష, సౌందర్య భావన, నిత్య యౌవనం, ఆర్త త్రాణ పరాయణత్వం భగవతీ లక్షణాలు. పితృగృహంలో మణి దీపంలా వెలిగిన పార్వతీదేవి మాతృమూర్తిగా భక్తులను జ్ఞాన కిరణాలతో చైతన్య మూర్తులను చేసి శుభాన్ని కలిగిస్తుంది. ఆమెను ఆరాధిస్తే ఎటువంటి వారైనా ముక్తిని పొందుతారు. ఈ శ్లోకంలోని పార్వతీ దేవి మోక్షాన్నీ జ్ఞానాన్నీ పుణ్యాన్నీ సద్వర్తనాన్నీ కలిగించగల రూపసంపద గుణసంపద వస్తుసంపద గల్గిన ఉన్నత వంశ సంజాత. దేవీ అశ్వధాటి యాళీభి రాత్మ తనుతా లీనకృత్రియక పాళీషు ఖేలతి భవ వ్యాళీ నకు ల్యసిత చూళీభరా చరణధూళీ లసన్మణిగణా । యాళీ భృతి శ్రవసి తాళీదళం వహతి యా ళీక శోభి తిలకా స్కా ళీ కరోతు మమ కాళీ మన స్స్వపద నాళీక సేవన విధా॥ 3 ప్రతిపదార్థం 8 యా = ఏ కాళికాదేవి, ఆత్మ =తన యొక్క, ఆళీభిః = చెలికత్తెలతో, తనుతా = సుకుమారంగా, ఆలీన కృత్ = కలసి మెలసినదై, ప్రియక పాళీషు = కడిమి తోపులలో, ఖేలతి= క్రీడిస్తున్నదో, భవ వ్యాళీ = సంసారమనే త్రాచు పాముకు, నకులీ = ఆడ ముంగిస వంటిదో, అసిత చూళీ భరా = నల్లటి కేశ పాశంగలదో, చరణ ధూళీ = పాదరేణువుల చేత, లసత్ = ప్రకాశిస్తున్న , మునిగణా = ముని సముదాయంగలదో, యా = ఏ కాళికాదేవి, భృతి = నిండైన, ఆళీ = శుద్ధాంత రంగంతో, శ్రవసి = చెవికి, తాళీ దళం = చెవ్వాకు (చెవికమ్మ)ను, వహతి = ధరించిందో, యా = ఏ కాళికాదేవి, అళీకశోభి = నుదుటి మీద ప్రకాశిస్తున్న, తిలక = బొట్టు కల్గియున్నదో, సా కాళీ = ఆ కాళికాదేవి, స్వ - పద = తన పొదాలు అనే, నాళీక = నల్ల కలువలను, సేవన విధౌ = సేవించటంలో, మమ - మనః = నా మనస్సును, అళీ కరోతు = తుమ్మెదనుగా చేయును గాక! భావం కాళికాదేవి చెలికత్తెలతో కలసి విలాసంగా కడిమి తోటలలో విహరిస్తుంది. సంసారమనే మహా కాల సర్పాన్ని మట్టుబెట్టే భయంకరమైన ఆడు ముంగిస లాంటిది ఆమె. నిగ నిగలాడే నల్లటి ఆమె శోభిస్తుంది. నిత్యం ఆమెకు మునిగణాలు పాదాభివందనాలు చేస్తాయి. ఆమె పాదరజస్సు సోకి ఆ మునులు తేజోమూర్తు లైతారు. భర్త క్షేమాన్ని కాంక్షించి ఆమె మంచి మంచి కర్ణాభరణాలను ధరిస్తుంది. నుదుట దిద్దిన తిలకంతో ఆమె వెలుగొందుతుంది. తన పాద నీలోత్సల సేవా మకరందాన్ని నిత్యం ఆస్వాదించే తుమ్మెదలాగా, ఆమె నా మనస్సును మలచును గాక! విశేష పద వ్యాఖ్య క ప్రీణా తీతి ప్రియకః ప్రీతిని కలిగించేది - కడిమిచెట్టు. సుకుమారంగా చెలులతో కలిసి ఆహ్లాదకరమైన కడిమి తోటలో విహరించటం ఆమెకు మిక్కిలి ప్రీతి. చరణ ధూళీ లసన్ముని గణా మునిః సర్వ ధర్మాణాం మననాన్మునిః సర్వ ధర్మాలు తెలియటం వలన ముని అవుతాడు. కాళికాదేవి తాపసారాధ్య, దేవర్షి సంఘాత సంస్తూయమానాత్మ వైభవ, బ్రహ్మాది దేవతల ప్రార్ధన మేరకు ఆమె చిదగ్ని కుండ సంభూతగా ప్రత్యక్షమైంది. అప్పుడు బ్రహ్మాది డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు దేవతలూ వశిష్ఠాది మహర్షులూ నారదాది ఋషులూ ఆ పరాశక్తి వైభవాన్ని అనంత శక్తినీ సామర్థ్యాన్నీ జయజయ ధ్వానాలతో నుతించారు. దేవికి సాష్టాంగ పడి నమస్కరించారు. అప్పుడు ఆమె పాదరజస్సు వారి శిరస్సులకు సోకి శోభించారు. అలాగే ఎప్పుడూ తనకు నమస్కరించే భక్తులను ఆమె సర్వధర్మ మర్మజ్ఞులను చేస్తుంది. యా 2ళీ భృతి శ్రవసి తాళీదళం వహతి ఆళీ = శుధ్ధాంత రంగం, విశదాశయం, పార్వతీదేవి విశుద్ధమైన మానసం గలది. శుద్ధ సత్యమే ఆ దేవీ మనో రూపం. జగన్మంగళమే ఆ దేవి విశదాశయం. ఆ ఆశయ సిద్ధికి భర్త ఫలాభి వృద్ధి కామన ముఖ్యం. అందుకు తగిన విధంగా మంగళ ప్రదమైన ఆభరణాలు ధరిస్తుంది. ఇది ఆర్ష సంప్రదాయం. తాళీ దళం = చెవికమ్మ, చెవ్వాకు దేవిని తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషగా శ్యామలా దండకం చిత్రించింది. పూర్వకాలంలో పుణ్యస్త్రీలు తాటి ఆకులతో చేసిన కర్ణాభరణాలను ధరించేవారు. అవే తాళీ దళాలు. పార్వతీదేవి తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఆమె చెవి కమ్మలే సూర్య చంద్ర మండలాలుగా ప్రకాశిస్తున్నాయి. ఆ దేవీ తాటంకాలకు గల మృత్యుంజయ శక్తిని గూర్చి ఆదిశంకరులు ప్రస్తుతించారు. 9 సుధా మప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యు హరిణీం విపద్యర్తే విశ్వే విధి శతమఖాద్యా దివిషదః । కరాళం యత్ క్వేళం కబలితవతః కాల కలనా న శంభో స్తన్మూలం తవ జనన్ని తాటంక మహిమా ॥ - సౌందర్యలహరి అమృతాన్ని ఆస్వాదించిన బ్రహ్మేంద్రాది దేవతలైనా సరే ప్రళయ కాలంలో విపత్తికి లోనుగాక తప్పదు. కనుకనే ఓ జననీ! సృష్టి స్థితి కర్తృత్వాలు నీ అధీనాలు. శివుడికి మృత్యుంజయత్వం సిద్ధించింది నీ చెవి కమ్మల మహిమ వల్లనే కదా! ఇక శివుడు నిన్నేమని ఆశీర్వదిస్తాడు? భర్తృ ఫలాభివృద్ధిని కోరే స్త్రీలు ధరించ వలసిన మంగళాభరణాల జాబితాను శ్రీనాథు డిలా వివరించాడు. మ॥ పసుపుం గుంకుమ కజ్జలంబు నును గూర్పాసంబు తాంబూలమున్ గుసుమంబుల్ కబరీ భరంబు చెవి యాకుల్ మంగళాలంకృతుల్ అభీక శోభి తిలకా కాశీఖండం నుదుటి తిలకం సుమంగళీ చిహ్నం. ఆపై ముఖాలంకరణం. అభిమంత్రించిన కాళికాదేవి నుదుటి తిలకం లోకవశీకరణ శక్తి నిస్తుంది. కాళీ కాళ వర్ణత్వాత్ కాళీ = నీల వర్ణం కలది. కాళ వర్ణత్వాత్ కాళికా = నల్లనిది. కాళికా శబ్దం పార్వతీ దేవికీ నలుపు రంగుకు పేరు. కనుక పార్వతి నల్లనిదని స్పష్టమైతుంది. కాలుడి శక్తి కాళి, కాలుడంటే శివుడు, యముడు. కాల శక్తి స్వరూపిణి కనుక కాళి. ఆమె మృత్యువును కూడ నాశనం చేస్తుంది. కనుకనే ఆమె మహాకాళి, ఉజ్జయినీ పీఠాధీశుడైన మహాకాలుడి పట్టమహిషి దేవీ అశ్వధాట అయిన మహాకాళి యొక్క స్వరూపం కనుక మహాకాళి, చండ ముండులను సంహరించటానికి వచ్చిన చండికకు కోపంవచ్చి ముఖం నల్లబడింది. ఖడ్గాన్ని చేతబట్టి పులితోలు ధరించిన దేవి ఆ ముఖంలో నుండి వచ్చి ప్రత్యక్షమైంది. ఆమె పేరే కాళి. రాక్షస సేనలనూ శుంభ నిశుంభులనూ ఆమె సంహరించింది. కాళీ స్తుతి వలన కలిగే సకల సత్ఫలితాలను గూర్చి కాళికా స్తోత్రం వివరించింది. శ్లో॥ 10 జ్ఞాతా వక్తా కవీశో భవతి ధనపతి ర్దానశీలో దయాత్మా నిష్పాపీ నిష్కలంకీ కులపతిః కుశల సృత్య వాగ్ధార్మికశ్చ । నిత్యానందో దయాఢ్యః పశుగణ విముఖః సత్పథాచార శీలః సంసారాబ్ధిం సుఖేన ప్రతరతి గిరిజా పాదయుగ్మావలంబాత్ ॥ - సర్వ సిద్ధులూ సకల సంపదలూ పొంద గోరిన భక్తుడికి కాళికారాధనం సుప్రసిద్ధమైన మార్గం. సాకరోతు తుమ్మెద పద్మంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ పరవశించి కాలాన్ని పరిసరాన్నీ కూడా మరచి పోతుంది. అలాగే భక్తుడు కూడా త్రికరణ శుద్ధిగా దేవీ పదపద్మ సేవలో పరవశించాలి. ఆ చితైకాగ్రతే భక్తుడు శివా స్వరూపుడవటానికి మూలం. తుమ్మెద యొక్క అంకిత భావానికీ ఆస్వాదన కళానైపుణికీ పులకించిన పుష్పం, తుమ్మెదకు తనలోని మకరంద మాధుర్యాన్ని అందిస్తుంది. అలాగే ఉపాసనా కళా పరంగా ఆర్తి ఆసక్తి త్రికరణ శుద్ధి ఉంటే భక్తుడికి దేవి ఫలసిద్ధిని ప్రసాదిస్తుంది. మనః మనసు చంచలమైనది. అది క్షణ కాలం కూడా కుదురుగా వుండలేదు. చంచలం హి మనః కృష్ణ అన్నాడు అర్జునుడు. కనుక దేవీ ఉపాసకు డైనవాడు తన మనసును స్వాధీనం చేసుకోవాలి. అంతర్ముఖుడు కావాలి. అందుకోసం మనసును కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గం నుండి దూరం చేయాలి. హృదయంలో అంగుష్ఠ పరిమిత స్థానంలో ఉన్న ఆ పరమాత్మను ప్రసన్న చిత్తంతో దర్శించి ధన్యుడు కావాలి. అంగుష్ఠ మాత్రః పురుషోన్తరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః హృదా మనీషా మనసాభి క్లప్తో యఏతద్విదు రమృతా స్తే భవంతి - శ్వేతాశ్వతరోపనిషత్ మనస్సుతో తెలియ దగినవాడు భగవంతుడు. అలా తెలిసి కొన్నవారే అమృతాత్ములు. అలాంటి వారిని గూర్చి, మానస వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారెందరో మహాను భావులు ॥ చందురు వర్ణుని అంద చందమును హృదయార విందమున జూచి బ్రహ్మానంద మనుభవించు వారెందరో మహానుభావులు డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు అంటూ శ్రీ త్యాగరాజస్వామి శ్రీరాగంలో గానం చేసి కీర్తించారు. కనుక లక్ష్యసిద్ధికి ఏకాగ్రత చిత్త సంయమనం అవసరం. అవి ఉన్న వారిని కాళికా దేవి అనుగ్రహిస్తుంది. విశేషాలు 11 ఇందులోని దేవీ సౌకుమార్యం, చెలులపట్ల ఆమెకు గల అనురాగం, ప్రియకపాళీ విహారం కబరీ విలాసం శ్రవణా భరణ లలాట తిలకాల శోభ పదకమలధూళి అన్నిటినీ కలిపి ఏక రూపంగా భావిస్తే మోక్ష సిద్ధికి ఆమెను అధిష్టాన దేవత అనవచ్చు. ప్రియక పాళీ వ్యాళీ అసిత చూళీ చరణ ధూళి అళిక శోభి తిలకం (కస్తూరి), అశీ నాళీకం అన్నీ కాళికా దేహచ్ఛాయా సవర్ణాలే. ఈ నల్లనమ్మ పాదసేవ ఆ సల్ల త్రాచులాంటి సంసార బంధాన్ని సర్వనాశనం చేస్తుంది. కనుకనే ఆమెను భవభయ శమని గా కాళికా స్తోత్రం పేర్కొంది. దేవీ అశ్వధాటి 3 శ్లో॥ బాలామృతాంశు నిభ ఫాలా మనా గరుణ చేలా నితంబ ఫలకే కోలాహల క్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః । స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీలా దధాతు హృది శైలాధిరాజ తనయా ॥ 4 ప్రతిపదార్థం 12 బాలామృతాంశు = అమృత కిరణాలుగల బాల చంద్రుడితో, నిభ= సమానమైన, ఫాలా= నుదురు గలది, నితంబఫలకే= పిరుదుల మీద, మనాక్ = (కొంచెం) లేత, అరుణ • చాలా ఎరుపు రంగు చీర గలది, కోలాహల = ఆపదల కలకల ధ్వనులతో, క్షపిత కాల = కాలం గడిపిన, అమర = దేవతల, అకుశల = కష్టాలు అనే, కీలాల = నీళ్లను, శోషణ = ఇనికింప జేయటంలో, రవిః = సూర్యుడి వంటిది, కుచే-స్థూలా = స్తనభారం గలదీ, కచేజలదనీలా = కురులలో మేఘాల నీలిమ గలదీ, కదంబ విపినే కడిమి తోపులో, కలిత = మనోహరమైన, లీలా = విలాసం గలదీ, శూలాయుధ = శూలం ఆయుధంగా గల శివుడికి, ప్రణతి శీలా = నమస్కరించే స్వభావం గలది అయిన, శైలాధిరాజ తనయా = పర్వత రాజ పుత్రిక అయిన పార్వతీదేవి, హృది = (నా) హృదయంలో, దధాతు = అధివసించును గాక! భావం జగదంబ పార్వతీదేవి కదంబ వనంలో చెలులతో కలిసి విలాసంగా విహరిస్తుంది. ఆమె ముఖశోభ లేత చంద్రుడిలాగా ప్రశాంతంగా ఉంటుంది. ఆమె లేత అరుణవర్ణంగల చీరను ధరిస్తుంది. దేవతల కష్టాల కడలిని సూర్యమండలమై ఇనికింప జేస్తుంది. నల్లని కేశ సంపదతో పీనోన్నతమైన స్తన మండలంతో ఆమె శోభిస్తుంది. ఆమెకు భర్త అయిన పరమేశ్వరుడు నిరంతర దుష్ట శిక్షణ తత్పరుడు. ఆయనకు నిత్యం ప్రణమిల్లుతుంది పార్వతి. ఆమె సదాచార సంపన్న. ఆ పార్వతీ దేవి స్థిరంగా నా హృదయంలో నివసించును గాక! విశేష పద వ్యాఖ్య బాలామృతాంశు నిభ ఫాలా పార్వతి చంద్రవదన. బాల చంద్రుడిలాగా ముద్దులొలికే ఫాలభాగం ఆమెది. చంద్ర స్వరూపిణి, చంద్ర కళాత్మిక, అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ఆమె ఫాల ప్రదేశం ప్రకాశిస్తూ భర్తను అలరిస్తుంది. ఆమె సుధా రసస్యందని. తన అమృత కిరణాలతో భక్తులను సుధా మధుర హృదయులను చేస్తుంది. మనా గరుణ చేల కొంచెం ఎరుపు మించిన పసుపు రంగు కలిగిన చీర. పార్వతీ దేవి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటిగా ప్రసిద్ధ. అది ఆమెకు అత్యంత ప్రీతి. అది ఆమె స్థిరమైన కరుణకు సంకేతం. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు 13 నితంబ ఫలకా స్త్రీల శృంగార సంబంధమైన షోడశ కళా స్థానాలలో పిరుదు ఒకటి. దేవి బృహన్నితంబ విలసజ్జఘన. దేవీ నితంబ జఘనాలు పృథ్వీ తేజస్సువలన ఉద్భవించినట్లు దేవీ మాహాత్మ్యం, వామన పురాణం వంటి గ్రంథాలు వివరించాయి. పృథ్వి అనేక వస్తువులు స్వరూపం. దాని తేజస్సు సుచిత్రంగా ఉంటుంది. అందువల్లనే ఆమె జఘన నితంబాలు కూడ సుచిత్రంగా ఉంటాయి. బరువైన ఆమె నితంబభాగం స్థిరత్వానికి సూచన. అది ఆమె స్థిరమైన, గొప్పదైన కరుణను తెలుపుతుంది. కోలాహలక్షపిత ............శోషణ రవిః రవిః = ఎక్కడా నిలువకుండా పోతుండే వాడు, ఇతరుల చేత స్తుతింపబడేవాడు, రక్షించేవాడు. దేవతలు సుఖలాలసులు భోగులు భక్తి పరాయణులు. వారిని హింసించటమే రాక్షసులకు ధ్యేయం. కనుక ఆ దేవి ఎప్పుడూ దేవకార్య సముద్యతగా రాక్షసఘ్నిగా రక్షాకరిగా కన్పిస్తుంది. వివిధావతారాలనెత్తి శుంభ నిశుంభులనూ భండాసుర మహిషాసురాది రాక్షసులనూ పాశుపత సదాశివాది అస్త్రాలతో అంత మొందించింది. ఇలా తన భక్తులైన దేవతల యొక్క కష్టాల కడలిని ఎండగట్టి వారికి నిరతిశయ సుఖాన్ని ప్రసాదిస్తుంది. శరణం త్వాం ప్రపద్యంతే, యే దేవి పరమేశ్వరి । న త్వేషా మాపదః కాశ్చి, జ్ఞయన్తో కోపి సంకటః ॥ ఆ దేవిని ఎవరైతే శరణు కోరుతారో వారికి ఆమె ఏ కష్టాలనూ రానీయదు. స్థూలా కుచే వరాహపురాణం కుచొ = కుచ్యతే కామినా నఖైః కుచౌ - నాయకుడి నఖాల చేత గిల్లబడేది. స్త్రీలు సౌందర్యానికి ప్రతిరూపాలు. వారి స్తనాలు కళాస్థానాలు. సౌందర్య పయః కలశాలు. ఇక దేవీ కుచ స్వరూప గుణ విశేషాలన్నీ ఆమె మూర్తి రహస్యాలు. అవి ఆనంద సముద్రాలు. భక్తుల కోర్కెలు తీరుస్తాయి. దేవి తన స్తన్యాన్ని తన సంతాన మైన ముల్లోక వాసుల చేత త్రావించి వారికి ప్రాణశక్తినీ పోషణశక్తినీ ప్రసాదిస్తుంది. ఎంతమంది బిడ్డలు ఆ తల్లి పాలు తాగినా ఆమె స్తన సౌందర్యం సడలదు. అందుకు కారణం ఆమె నిత్యయౌవన, జగన్మాత, జగతోషిణి. అయిన సాక్షాత్ అన్నపూర్ణాదేవి. జలద నీలాకచే నల్లని తెగబారెడు కురులు సుమంగళీ లక్షణం. అవి సౌందర్య పోషకాలు. ఆ నీల కాచాలను సింగారించటం ఒక కళ. దేవీ కేశ పాశాన్ని కవి కాళిదాసు జలద నీలంగా భావించాడు. జలద నీల కచాలను చూచిన నాయక మయూరం పరవశిస్తుంది. ఆమె నల్లని వెండ్రుకలు భక్తుల అజ్ఞా నాంధకారాన్ని పారద్రోలు తాయని ఆదిశంకరోక్తి. శూలాయుధ ప్రణతి శీలా శూలాయుధుడు శివుడు దుష్ట శిక్షణ వ్యగ్రుడు. పార్వతి కులాంగన కులాంగనలు దేవీఅశ్వధాటి పతికి నమస్కరించటం ఆర్ష సంప్రదాయం. పార్వతి సదాశివ పతివ్రత, శివారాధ్య, శివధర్మ పరాయణ కనుక ఆమె నిత్యమూ అతడికి నమస్కరిస్తుంది. శైలాధి రాజ తనయా హిమవంతుడు కొండలకు రాజు. అతడి కూతురు గిరిజ ఉన్నత వంశ సంజాత. తండ్రికి 14 తగిన తనయ. విశేషాలు సుందర రూపంతో వత్సల భావంతో పార్వతీదేవి తన హృదయంలో అధివసించి, కష్టాలను పోగొట్టి ప్రశాంత చిత్రాన్ని సుమధుర వాక్కునూ సంప్రదాయ గౌరవాన్ని ఔన్నత్యాన్నీ చైతన్యాన్నీ సౌఖ్యాన్నీ ప్రసాదించాలి. ఈ శ్లోకంలో ముఖం చంద్రోపమం, వస్త్రమూ తేజమూ రెండూ సూర్యోపమాలే! (అరుణః = సూర్యుడు) పార్వతీ దేవి చంద్ర సూర్యాగ్ని కళాత్మిక. కనుకనే అరుణోపనిషత్తు అసంఖ్యాకమైన కళలకు ఉత్పత్తి స్థానంగా ఆమెను కీర్తిస్తున్నది. "మరీచయ స్వాయంభువా యే శరీరాణ్యకల్పయత్ । మా చ తేఖ్యాస్మతీ రిషత్ । లోకస్య ద్వార మర్చిమ త్సవిత్రమ్ । జ్యోతిష్మద్రాజమానం మహస్వత్, అమృతస్య ధారా బహుధా దోహమానం చరణం నో లోకే సుధితాం దధాతు" । ఇందులోని అర్చిష్మత్ అనేవి అగ్ని కళలు, జ్యోతిష్మత్ అనేవి చంద్రకళలు, మహస్వత్ అనేవి సూర్యకళలు. అవి ఆమె పాదాల నుండి ఉద్భవిస్తాయి. ఈ శ్లోకంలో అగ్నికళల ప్రస్తావన లేదు. కాని, 'కూలాతిగామి' అనే శ్లోకంలో జ్వలన కీలా శబ్దంతో అగ్నికళ ప్రసక్తమైంది. ఈ విధంగా కాళిదాసు శైలాధిరాజ తనయను సర్వ కళాత్మికగా భావించి స్తుతించాడు. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు శో॥ 3 15 కంబావతీవ సవిడంబా గళేన నవ తుంబాభ వీణ సవిధా బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే । అంబా కురంగ మద జంబాల రోచి రిహ లంబాలకా దిశతు మే శం బాహులేయ శశి బింబాభి రామ ముఖ సంబాధిత స్తనభరా ॥ 5 ప్రతిపదార్థం గళేన = కంఠం యొక్క ఆకారంచేత, కంబౌ = శంఖంతో, అతీవ = మిక్కిలి, సవిడంబా = పోలికగలదీ, నవతుంబ = లేత సొరకాయను, ఆభ = పోలిన, వీణ = వీణతో, సవిధా = కూడి వున్నది, బింబాధరా - దొండ పండు వంటి క్రీ పెదవి గలదీ, కదంబ విపినే = కడిమి తోటలో, వినత = వినమ్రులై నమస్కరిస్తున్న, శంబాయుధ + ఆది = వజ్రం ఆయుధంగాగల ఇంద్రుడు మొదలైన దేవతల యొక్క, నికురుంబా= సమూహంగలదీ, కురంగమ కస్తూరి, జంబాల = పంకం యొక్క, రోచిస్ = కాంతిగల, లంబాలకా = వ్రేలాడుచున్న కురులు గలదీ, బాహులేయ = కుమార స్వామి యొక్క, శశి బింబాభిరామ = చంద్రబింబం లాగా మనోహరమైన, ముఖ = ముఖంతో, సంబాధిత స్తనభరా = పీడింపబడిన కుచభారం కలదీ అయిన, అంబా = మాతృమూర్తి పార్వతీ దేవి, మే = నాకు, శం = శుభాన్ని, సుఖాన్నీ, శాస్త్ర సంపదనూ, ఇహ = ఈ జన్మలో, దిశతు = ప్రసాదించును గాక! భావం శ్రీదేవి కంఠం శంఖంవలె మనోహరం. లేత సొరకాయ లాంటి చక్కని వీణను ఆమె వహిస్తుంది. ఆమె క్రీ పెదవి అచ్చంగా దొండ పండే. నల్లని ముంగురులు ముఖానికి చక్కని శోభ. చంద్రుడిలా మనోహరమైన ముఖ సీమగల బాలుడైన కుమారస్వామి తన ఆరు ముఖాలతో స్తన్యపానం చేస్తుండటం వల్ల ఆమె స్తనసీమ బాగా గాసి పొంది ఉంటుంది. కదంబ వనంలో ఉన్న ఆ దేవిని ఇంద్రాది దేవతలు భక్తి ప్రపత్తులతో ప్రార్ధిస్తుంటారు. అటువంటి అంబ నాకు శుభాన్ని సమకూర్చు గాక ! విశేష పద వ్యాఖ్య కంబావతీవ సవిడంబా గళేన స్త్రీకి శంఖాకారం గల కంఠం ఉండటం అందమే కాకుండా శుభాస్పదం కూడ. శంఖాని లాగా కంఠానికి గూడా మూడు రేఖలున్న స్త్రీ కంబుకంఠి. దేవి కంబుపూగ సమచ్ఛాయా కంథర ఆమె గళసీమ శంఖాకృతిని మించి సుందరంగా ఉంటుంది. నవ తుంబాభ వీణ సవిధా పార్వతి వీణావాదన ప్రియగా, నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపిగా ప్రసిద్ధి వహించింది. లేత సొరకాయ వంటి కాంతిగల వీణ ఆమె చెంతనే ఉంటుంది. దాని స్వర మాత్రమే ఆమె స్వర మాధుర్యానికి సామీప్యంలో ఉంటుంది. కానీ ఆమె గళం నుండి వెలువ దేవీఅశ్వధాటి వాక్యాలలోని వర్ణ విభాగం మాత్రం అంత కంటె సుస్పష్టంగా ఉంటుంది. ఆదిశంకరులు దేవీ కంఠాన్ని స్వర విశేషాలను వివరించారు. శ్లో॥ గలే రేఖా స్త్రిస్రో గతిగమక గీతైక నిపుణే 16 - సౌందర్యలహరి వివాహ వ్యాసద్ధ ప్రగుణ సంఖ్యా ప్రతిభువః । విరాజస్తే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన ఇవతే ॥ ఆమె గతిగమక గీతైక నిపుణ. ఆమె గళరేఖలు మూడూ వివాహ సమయంలో శివుడు తనకు కట్టిన మంగళ సూత్రానికి దగ్గరగా ఉండి పలు పేటలు కలిపి వేసిన మూడు సూత్రాలకు జ్ఞాపికలుగా ఉన్నాయి. అంతేకాక అవి సంగీతంలోని షడ్జ, గాంధార, మధ్యమ గ్రామ త్రయానికి సరిహద్దులు లాగా ఉన్నాయి. వినత శంబాయుధాది నికురుంబా ఇంద్రుడు శంబాయుధుడు. రాక్షస సంహారం చేసి దేవతలకు శుభాన్ని కలిగించే శూరుడు. ఆమె వీరారాధ్య. వీరులందరికీ ఆమె ఆరాధ్యదేవత. వారందరూ ఆమెకు నిత్యం నమస్కరిస్తారు. అంబా పార్వతి త్రిజగన్మాత. సత్త్వ రజస్తమోగుణ స్వరూప, ఆ మూడు గుణాలకూ కారణభూత. ఆమె పృథ్వీ స్వరూపం. రుద్రాణీ స్వరూపం. ఆమె ఇచ్ఛా జ్ఞాన క్రియల సమష్టి రూపం. వాటి త్రిపుటి. ఆమె మూలప్రకృతి. ఇలాగా ఈ అంబా శబ్దం సంపూర్ణ మాతృత్వ సౌందర్యాన్ని ప్రతి బింబిస్తుంది. కురంగమద జంబాల రోచి రహ లంబాలకా (పాఠాంతరం) రహ = వెలువరిస్తున్న పార్వతీదేవి నెఱి వెండ్రుకలు కస్తూరి రంగునూ సువాసననూ వెలువరిస్తూ శోభిస్తూ భక్తుల అజ్ఞానాన్ని నశింప చేస్తాయి. బాహులేయ శశి బింబాభిరామ ముఖ బాహులేయుడు - కుమార స్వామి శశి బింబాలవంటి తన ఆరు ముఖాలతో అంబికా స్తన్య పానం చేసినప్పుడు ఆమె లోని మాతృత్వం ఉప్పొంగింది. ఆనందించింది. సంబాధిత స్తనభరా కుమారస్వామి స్తన్యపానం కావించినప్పుడు ఆమెస్తనాలు మధుర బాధను పొందాయి. ఆదిశంకరుడు పార్వతీ స్తన్య పాన మాహాత్మ్యాన్ని ప్రస్తుతించాడు. శ్లో॥ తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వత మివ । దయావత్యా దత్తం ద్రవిడ శిశు రాస్వాద్య తవయత్ కవీనాం ప్రౌఢానా మజని కమనీయః కవయితా ॥ - సౌందర్యలహరి తల్లీ! పార్వతీ! నీ పాలిండ్ల నుండి వెలువడుతున్న క్షీరధార నిజంగా సారస్వత ప్రవాహమే. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు ఎందుకంటే దయతో నీ విచ్చిన స్తన్యాన్ని త్రావి ద్రవిడ శిశువు మహా కవీశ్వరు డైనాడు- ఇట ఆదిశంకరుడు తన విషయాన్నే భంగ్యంతరంగా చెప్పుకున్నాడు. విశేషాలు 17 అంబా తనూ వర్ణనంలోని ఉపమానాలైన కంబు శంబ శశిబింబ శబ్దాల వల్ల వాటి వర్ణం లాగా స్వచ్ఛమైన జ్ఞానాన్ని కీర్తినీ కోరుకున్నాడు కవి. బింబాధర శబ్దం వల్ల కవితలో మాధుర్య గుణాన్నీ కాంతా సమ్మితత్త్వాన్నీ కాంక్షించాడు. కురంగ మద జంబాల శబ్ద ప్రయోగంతో కవితలో కాంతి పరీమళం అవసరమని సూచించాడు. కవితా ప్రయోజనాలు ఇహపర సుఖాలేనని ఇహ శం శబ్దాల ప్రయోగ స్వారస్యం. సామాన్య శిశువు ఒక్క ముఖంతో పాలు త్రావితేనే తల్లి హృదయం పరవశిస్తుందిగదా! మరి కుమారస్వామి తన ఆరు ముఖాలతోనూ ఒక్కసారే ఆ జగన్మాతవద్ద పయః పానం చేస్తుంటే, ఆమె మాతృ హృదయానందం షడ్గుణం కాకుంటుందా! అని బాహులేయ పదప్రయోగ స్వారస్యం. ఆ ఆనందంతోనే తనను కూడా షణ్ముఖ తుల్యుడిగా భావించి, తనకు మధుర కవితా స్తన్యాన్ని ప్రసాదించమని కవికాళిదాసు అభ్యర్ధన. ఇలా ఈ శ్లోకంలో అంతటా అంబా మాతృహృదయ సౌందర్యం ప్రధానంగా స్ఫురిస్తుంది. దేవీ అశ్వధాటి దాసాయమాన సుమహాసా కదంబవన వాసా కుసుంభ సుమనో వాసా విపంచి కృత రాసా విధూతమధు మాసారవింద మధురా । కాసార సూన తతి భాసాభిరామ తను రాసార శీత కరుణా నాసామణి ప్రవర భాసా శివా తిమిర మాసాదయే దుపరతిమ్ ॥ 6 ప్రతిపదార్థం 18 దాసాయమాన = దాసీజనులుగా అయిన, సుమహాసా = పూల నగవులు కలదీ, కదంబ వనవాసా = కడిమి తోపులో నివసించేదీ, కుసుంభ సుమనో వాసా = కుంకుమ పూల వంటి వస్త్రాన్ని ధరించేదీ, విపంచికృత = వీణమీద మీటిన, రాసా = రసరంజిత మైన నిర్వాణం గలదీ, విధూత = తిరస్కరించిన, మధుమాస = వసంత ఋతువులోని, అరవింద = పద్మాల : యొక్క, మధురా = మనోహరత్వంగలది, కాసార = సరోవరంలోని, సూనతతి = పూల మొత్తాల, భాసా = కాంతిచేత, అభిరామ తనుః = సొగసైన శరీరం గలది, ఆసార = జడివాన వంటి, శీత : కరుణా = చల్లని దయగలదీ, శివా = సౌభాగ్యవతి అయిన పార్వతీదేవి, నాసామణి ప్రవర = (తన) ముక్కర లోని శ్రేష్ఠమైన మణియొక్క, భాసా = కాంతి చేత, తిమిరం = (నా అజ్ఞానమనే) అంధకారాన్ని, ఉపరతం = తొలగునట్లు, ఆసాదయేత్ = చేయునుగాక ! భావం జగజ్జనని సురుచిర దరహాసం కుసుమాలకంటె సుకుమారం. అతి మనోహరం. నీపవనంలోనే ఆమె నిత్యవిహారం. కుసుంబా పుష్పాలలోనే ఆమె నిత్యనివాసం. పూల కాంతుల ప్రసారంతో ఆమె శరీరం సులలితంగా ప్రకాశిస్తుంది. వీణా వాదనం ఆమెకు నిత్యామోద విషయం. ఆమె బహిరంతర సౌందర్యం మకరందం కంటె మధురతరం. దయాగుణానికి నిలయం ఆమె హృదయం. ముక్కరలోని మణికాంతులతో మెరిసే ఆమె సౌందర్యం అగణ్యం. అటువంటి శివ నా అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించును గాక ! విశేష పద వ్యాఖ్య దాసాయమాన సుమహాసా ఆ దేవి నిత్య దరహాసముఖారవింద. చారుహాస. ఆమె దరహాసం పూల కంటే ప్రశాంతంగా మనోజ్ఞంగా వుంటుంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆ పరాశక్తి ఆనంద స్వరూపిణి. సుందర మందహాస సంశోభిత. శ్రీ దేవీ దరహాసం మోహినీ దేవతా స్వరూపం. ఆమె మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఆమె చేసే మందహాస లహరిలో పరమేశ్వరుడి మనస్సు పారవశ్యంతో మునకలు వేస్తుంది. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు 19 కుసుంభ సుమనోవాసా కుసుంభం = కుంకుమ పువ్వు. ఇది కాశ్మీర దేశంలో అధికంగా లభిస్తుంది. దేవతా పూజా ద్రవ్యంగానూ సుగంధ ద్రవ్య విశేషంగానూ మంగళ ద్రవ్యంగానూ దీనికి వినియోగం మెండు. ఎరుపును మించిన పనుపు వన్నెగా ఉండే ఈ పుష్పంలో నివసించటం శ్రీదేవికి మిక్కిలి ప్రీతి. విధూత మధుమాసారవింద మధురా ఆమె స్వరూప స్వభావాలు అరవిందంలోని మకరందం కంటే మధురమైనవి. ఆమె స్వభావ మధుర, మధుమతి, మనస్విని, కనుకనే ఆమె సర్వజనారాధ్య అయింది. 'ఆ తల్లిని ఆరాధించటంవల్ల మధురమైన సద్భావనా పథం ఏర్పడుతుంది. మధుర కవితాశక్తి అలవడుతుంది. సారసూనతతి భాసా ఆమె మహాపద్మాటవీ సంస్థ. బ్రహ్మాండోపరి భాగంలో మూడు లక్షల యోజనాల విస్తీర్ణంలో తాళదళ ప్రమాణంగల కేసరాలతో ప్రకాశించే గొప్ప పద్మవనంలో ఆమె నివాసం. ఆ పద్మ వనంలోని పూల కాంతులు ఆమె మీద ప్రసరిస్తాయి. దానితో ఆమె సుమనోజ్ఞంగా విరాజిల్లుతుంది. కరుణా దయను వర్షించే చల్లని తల్లి. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు లోకానికి క్షేమంకరమైనవి. దేవీకవచం ఇత్యేతా మాతరః సర్వాః ప్రోక్తా కారుణ్య విగ్రహాః అంటూ నవదుర్గలందరూ దేవతలంతా- కారుణ్యమూర్తులేనని పేర్కొన్నది. అరాళా కేశేషు అనే శ్లోకంలో ఆమె కరుణా విశేషాన్ని సౌందర్యలహరిలో ఆదిశంకరులు భావించారు. భగవతి శరీరం శంభుని కరుణావతారం. జగద్రక్షణ కోసం ఆమె అవతరించింది. - నాసామణి ప్రవరభాసా అమ్మవారి శ్రేష్ఠమైన ముక్కరలోని మణి కాంతులు మిక్కిలి ప్రకాశవంతమైనవి. ఆ ముక్కర నక్షత్ర కాంతులను సైతం నవ్వులపాలు చేస్తుంది. దాని కిరణాలు కల్యాణ కాంతులు. 'స్వచ్ఛమైన ముత్యంతో అలంకరించిన ముచ్చటైన ఆమె నాసికను తన ఇష్టసిద్ధి కోసం ఆది శంకరుడు అర్ధించాడు. ప్రతిఫలంగా కవిలోకంలో నాసా రూపంగా (శ్రేష్ఠుడుగా) భాసించాడు శివా శివం మంగళ మస్యాః అస్తితి శివా- శుభం గలది. శివస్య పత్నీతి శివా శివు శివా శక్తిః సమాఖ్యాతా, తత్ప్రదత్వాచ్ఛివా స్మృతా। శివకే శక్తి అని పేరు. ఆమె శక్తినిస్తుంది. అమంగళాన్ని తొలగిస్తు శివ. శివా శివులకు అభేదం కనుక ఆమెకు శివా అని పేరు. సకల స దేవీ అశ్వధాటి ఆమె మోక్షమనే బ్రహ్మ పదవిని స్వరూప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కనుక శివ. ఇక ఆమె సర్వమంగళ, సర్వ సల్లక్షణ సంపన్న కనుక శివ. శివ అంటే ముక్తి స్వరూపం. మోక్షే భద్రే సుఖే శివం అని అమరం లోని వివరణం. తస్మిం సజ్జనే భేదా భావాత్ అనే నారదభక్తి సూత్రాన్ని అనుసరించి ఆమెకూ ఆమె భక్తులకు భేదం లేదు. అందుచేత కవి కాళిదాసు తనకు కూడా శివా లక్షణాలు అన్నింటినీ కల్పించి శుభాన్ని కూర్చమని అర్థించాడు. తిమిర మాసాదయేత్ 20 దేవి అజ్ఞాన ధ్వాంత దీపిక, తమోపహ, జ్ఞానద. తన భక్తుల అజ్ఞా నాంధకారాన్ని పోగొట్టి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విజ్ఞాన తేజస్సును ప్రసరింప చేస్తుంది. భక్తుల హృదయాలను ఆర్ద్ర పరుస్తుంది. ఉపరతి ఉపేక్ష, ఇంద్రియాలను విషయాల నుండి మరల్చటం. భేద జ్ఞానంగల ఇతర దేవతోపాసనలు ఐహిక మాత్ర ఫలాన్నే ఇస్తాయి. అంటే అద్వైత భావంతో కూడిన కర్మాచరణం కేవలం జ్ఞాన సిద్ధినే కల్గిస్తుంది. కాని శివ పట్ల బుద్ధిని ప్రసరింపచేస్తే అజ్ఞానాన్ని పారద్రోలి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆమె ధ్యానంవల్ల భక్తుడు తన బుద్ధిని విషయ సుఖాలనుండి మళ్లించి నిస్సంగుడైతాడు. అందు చేత అన్యదేవతోపాసనా భావాన్ని మానిపించి తన అజ్ఞానాన్ని నశింప చేయమని అభ్యర్థన. విశేషాలు ఈ శ్లోకంలోని సుమహాసా, రాసా (కోలాహలం, ఆనందం) సూనతతి భాసా, నాసామణి ప్రవర భాసా వంటి శబ్దాలన్నీ శ్వేతవర్ణ సంకేతాలే. ఆ దేవి శుక్ల సంస్థిత - శుక్ల ధాతువులో జీవరూపంగా ఉంటుంది. ఆమె శుక్లవర్ణ, తెల్లగా ఉంటుంది. కోమలాంగి, తేజోవతి, సూర్యాగ్ని చంద్రులకు సైతం ఆమె తేజస్సే ఆధారం. ఆమె చంద్రమండల మధ్యస్థ, శుద్ధమానస, ఆమె మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఆమె శాంత. ఆమెలాగా నిర్మల మనస్కులైన భక్తులు దేవీ స్వరూపులైతారు. ఆ శివ జ్యోతిర్మూర్తిగా భాసించి భక్తుల అజ్ఞానాంధకారాన్ని తరిమి కొడుతుంది. ఇవి అన్నీ దేవీ గుణ సౌందర్య లక్షణాలే. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు న్యంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనా మయసి కిం కారణం హృదయ! పంకారి మే హి గిరిజారా 4శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతి మంకా నుపేత శశి సంకాశ వక్త్ర కమలాం ॥ 7 ప్రతిపదార్థం = హృదయ ! = ఓ హృదయమా!, ని+అంక+ఆకరే = న్యం కాకరే = అనేక నిందలకూ కళంకాలకూ నిలయ మైనదీ, కంకాళ = అస్థిపంజరాన్నీ, రక్త = రక్తాన్నీ, పుషి = పోషించేదీ, కంక+ఆది+పక్షి = కంకాది పక్షి = రాపులుగులు వంటి అనేక పక్షులకు, విషయే = ఆధారమైందీ, అయిన, వపుషి = శరీర విషయంలో, త్వం నీవు, కామనాం = కోరికను, అయసి = పొందుతున్నావు, కిం కారణం = కారణ మేమిటి ?, పంక+అరిం = పంకారం = పాపాలకు శత్రువైనదీ, శంకా-శిలా = అనుమానాలనే రాళ్లకు, నిశిత = కరుకైన, టంకాయమాన = కాశఉలుల వంటివైన, పద = పాదాల మీద, సంకాశమాన = బాగా ప్రకాశిస్తున్న, సుమనో = దేవతలనే, ఝంకారి = రొద చేస్తున్న, భృంగ తతిం = తమ్మెదల సమూహం కలదీ, అంక = కళంకంతో, అనుపేత = కూడుకొనని, శశిసంకాశ = చంద్రుడివంటి, వక్త్రకమలాం = ముఖ పద్మంకల, గిరిజాం = పార్వతీ దేవిని, ఏహి = పొందవలసింది. భావ ఓ హృదయమా! ఈ శరీరం రకరకాల రోగాలకూ కళంకాలకు నిలయం. అంతేకాదు ఇది జుగుప్సాకరమైన రక్త మాంసాలతో కూడిన ఎముకలగూడు మాత్రమే. చివరకు కాక ఘూకాలు పీక్కు తింటానికి మాత్రమే పనికివస్తుంది. అటువంటి పనికిమాలిన దేహం మీద నీకెందు కింత మోహం? ఆ దేవీ పాదపద్మాలు భవ బంధాలకు ప్రతి బంధకాలు. ఇహపర సుఖాలకు కాణాచులు. సంశయాలనే పాషాణాలను పగులగొట్టడంలో అవి పదునైన కాశఉలులే. దేవతలనే తుమ్మెదలు నిత్యం ఆమె పాదపద్మాలను ఆశ్రయించి తరిస్తాయి. చంద్రునిలాగా ఆమె ముఖశోభ మనోహరంగా వుంటుంది. కనుక ఆ గిరిజాదేవిని ధ్యానిస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, భవబంధాలు తొలగి పోతాయి. మోక్షం కలుగుతుంది. విశేష పద వ్యాఖ్య న్యంకాకరే వపుషి----వక్షి విషయే పూర్వ జన్మ కర్మల ఫలితంగా ప్రస్తుత జన్మ సిద్ధిస్తుంది. పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందటానికి ఈ దేహాన్ని నంగా మాత్రమే పోషించు కోవాలి. శరీర పోషణ మాత్రమే జీవిత పరమావధి కారాదు. ఎందుకంటే ప్రాణ త్యాగానంతరం ఈ దేహం పక్షులపాలు కావలసిందే! కాకుంటే కట్టెలపాలు. కానీ వెంటరాదు. దేనికీ పనికిరాదు. వెంటవచ్చేదీ పనికివచ్చేదీ పరమాత్మ సంబంధమైన జ్ఞానం మాత్రమే. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. అందువల్లనే ఈ దేహంమీద ఏ మాత్రం భ్రాంతి పనికిరాదు. 22 దేవీ అశ్వధాటి హృదయ దేవి మహాత్ములైన మునుల హృదయాలలో ఉంటుంది. ఆమెను హృదయంలోనే దర్శించి హృదయాయైనమః అని ధ్యానిస్తే హృదయం శోభావహ మైతుంది. ఆమె పట్ల ప్రీతి పెరుగుతుంది. ఆత్మ చైతన్యం కలుగుతుంది. ఆమె భావనామాత్ర సంతోష హృదయ. కనుక ఆమెను భావిస్తేనే చాలు హృదయం ఆనందం పొందుతుంది. పరమాత్మ ఉనికినీ స్వరూపాన్నీ దర్శన విధానాన్నీ దర్శనంవల్ల కలిగే ప్రయోజనాన్నీ అణోరణీయాన్ మహతో మహీయాన్ అని కఠోపనిషత్తు వివరించింది. పంకారి పంకం = పాపం. సంబంధంవల్ల విస్తృతమయ్యేది. దేవి మహాపాతక నాశిని. ఆమె సంసారవంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసార పంకంలో మునిగిపోయిన జనాన్ని ఉద్ధరించటంలో సమర్ధురాలు. ఈ విషయాన్నే కూర్మపురాణంలో కూడ గమనించవచ్చు. యే మనా గపి శర్వాణీం, స్మరన్తి శరణార్ధనః । దుస్తరాపార సంసార సాగరే న పతన్తి తే ॥ శంకా శిలా నిశిత ఆమె సంశయఘ్ని. దేహేంద్రియ సుఖాలు మిథ్యలని భక్తులకు బోధించి స్వాత్మ సాక్షాత్కారం కలిగిస్తుంది. ఆపై ఇహపర ప్రతిబంధకాలను తొలగిస్తుంది. భక్తులకు మోక్ష ప్రతిబంధకాలైన సంశయాలనే రాళ్లను పగుల గొట్టడంలో దృఢమైన ఉలులవంటివి ఆమె పాదాలు. కనుక ఆ పాదాలను ఆశ్రయించి సదా ధ్యానిస్తే తాపత్రయం శమిస్తుంది. పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. - ముండకోపనిషత్ భిద్యతే హృదయగ్రంథి, శ్చిద్యంతే సర్వ సంశయాః । క్షీయంతే చాస్య కర్మాణి, తస్మిన్ దృష్టి పరావరే ॥ పరమాత్మ సాక్షాత్కారం కలిగితే, అప్పటి వరకూ హృదయంలో ఉన్న అజ్ఞాన వాసన వీడిపోతుంది. సర్వ సందేహాలూ ఛేదింపబడతాయి. బ్రహ్మజ్ఞాని అవుతాడు. శుభాశుభకర్మలు క్షీణిస్తాయి. నిష్కల్మషు డైతాడు. పూర్ణజ్ఞాని అవుతాడు. శాంత చిత్తు డైతాడు. అందువల్ల ప్రతిఒక్కరికీ భగవతీ పదధ్యానం పరమావశ్యకం. అందుచేతనే దేవతలనే అళిబృందాలు ఆ దేవీ పదపద్మాల చెంత చేరి ఝంకారం చేస్తూ సేవనామృతాన్ని ఆస్వాదిస్తుంటాయి. తత్ఫలితంగా వారు స్వాత్మ సాక్షాత్కారం పొందుతారు. శశి సంకాశ ..... వక్త్ర కమలాం గిరిజాదేవీ ముఖ కమలం మచ్చ లేని చంద్రబింబం లాంటిది. కమలం రక్తవర్ణ మేళనం కలది. అది వికసించి శోభావహంగా ఉంటుంది. అలా ఆమె ముఖం షోడశ కళలతో నిండిన పూర్ణ చంద్రుడిలాగా ప్రకాశిస్తుంది. ఆమె రాకేందు ముఖి, చంద్రకళానిభ, ప్రసన్న వదన, నిష్కళంక. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు గిరిజా 23 గిరేర్జాతా గిరిజా = పార్వతి. మల్లెతీగ' అని అర్థాంతరం. గిరిజన్యాలైన గైరికాది ధాతువులనూ గిరిజా శబ్దం సూచిస్తుంది. గైరికాది ధాతువులలోని రాగరంజనం, మల్లెతీగలలోని నవలావణ్యం సౌకుమార్యం గిరిజా శబ్దంలో ధ్వనిస్తాయి. గిరిజాదేవిని ప్రార్ధిస్తే కవిత్వానికి ఔజ్జ్వల్యం, సౌకుమార్యం, లావణ్యం కలుగుతాయని ధ్వని. దానితో భక్తుడికి అమరత్వం సహృదయుడికి పరవశత్వం కలుగుతాయి. విశేషాలు దేవీ సౌందర్యవర్ణనం మాతృభావ పరిపూరితంగా, ఆపాదమస్తకంగా విలోమ విధానంలో సాగాలని ఈ శ్లోక రచనాక్రమం సూచిస్తుంది. ఇక భగవత్తత్త్వాన్ని బోధించని కవిత కవిత కాదు. అందువల్ల ఉత్తమ కవితా సిద్ధికి గిరిజాదేవీ కృపకావాలి. 24 దేవీ అశ్వధాటి జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా రంభా కరీంద్ర కర దంభాపహోరుగతి డింభానురంజిత పదా । శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా శం భాసురాభరణ గుంఫా సదా దిశతు శుంభాసుర ప్రహరణా ॥ 8 ప్రతిపదార్ధం జంభారి = జంభాసురుడిని సంహరించిన ఇంద్రుడి, కుంభి = ఏనుగైన ఐరావతం యొక్క, పృథు-కుంభ = మిక్కిలి గొప్పవైన కుంభ స్థలాల్ని, అపహాసి = అపహసిస్తున్న, కుచ = స్తనాల మీద, సంభావ్య = మిక్కిలిగా అందగించే, హార లతికా = ముత్యాలహారం కలదీ, రంభా = అరటి బోదెలయొక్క, కరీంద్ర కర = శ్రేష్ఠమైన ఏనుగు తొండం యొక్క, దంభ = గర్వాన్ని, అపహా = పోగొట్టే, ఊరు = తొడలు కలిగి, గతి = నడక చేత, డింభ = పిల్లలకు వలె, అనురంజిత = ఎర్రబడిన, పదా = పాదాలు కలదీ, శంభౌ= శివుని తోడి, ఉదార పరిరంభా = గాఢమైన ఆలింగనం వల్ల, అంకురత్ = మోసులెత్తుతున్న, పులక = గగుర్పాటు, దంభ = అధికమైన, అనురాగ = ప్రేమకు, పిశునా= సూచన అయినదీ, భాసుర = ప్రకాశిస్తున్న, ఆభరణ = సొమ్ముల, గుంఫా = కూర్పు గలదీ, శుంభాసుర = శుంభుడనే రాక్షసుడిని, ప్రహరణా = శిక్షించినదీ, అయిన పార్వతీదేవి, (నాకు), శం = శుభాన్ని, సదా = ఎల్లప్పుడు, దిశతు = ఇచ్చుగాక ! భావం దేవేంద్రుడి ఐరావతం యొక్క కుంభ స్థలాల్ని సైతం ఎకసక్కెం చేసే చక్కనైనది ఆమె కుచ సీమ. ఆ స్తన సీమ అందాన్ని మరీ అతిశయింప చేస్తుంది ఆమె మెడలోని మంచి ముత్యాల హారం. ఏనుగు తొండాల కంటే అరటి బోదెలకంటే ఉదాత్తమైనవి ఆమె ఊరువులు. ఎర్రగా పసిపాపల పాదాల లాగా ముచ్చట గొలుపుతాయి ఆమె పాదాలు. శంకరుడితోడి గాఢాలింగనంతో ఆమెకు కలిగిన పులకలు, అతడిపట్ల ఆమెకు గల అనురాగానికి సూచికలు . ఆ అందాల ధగధగలకు కారణం ఆమె ధరించిన ఆభరణాలు. శుభాంగి అయిన ఆ మహాదేవి నాకు ఎల్లప్పుడూ శుభాన్ని సమకూర్చుగాక! విశేష పద వ్యాఖ్య కుచ సంభావ్య హార లతికా హార = నూటఎనిమిది పేటలు గల ముత్యాల హారం-స్త్రీణాం ప్రియా లోక ఫలో హి వేషః తమతమ ప్రియులు చూచి సంతోషించటమే హారధారణకు పరమ ప్రయోజనం. దేవీ కంఠాభరణాలు ప్రధానంగా మూడు. అవి నవరత్న ఖచితమైన కంఠమాల, స్వర్ణ మయమైన చింతాకం, ముత్యాల హారం. వీటిని ధరించి ఆమె రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్వితగా వాసి కెక్కింది. ఇవి శివుడికి సంబంధించినవి. అతడికి ప్రీతికరమైనవి. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు కూడా. దేవి స్థూల ముక్తా ఫలోదార సుహార. ఆమె ముత్యాల హారాల కోసం ముచ్చట పడుతుంది. కనుకనే శివుడు గజాసురుడిని సంహరించి అతడి శిరస్సునుండి రాలి పడిన ముత్యాల మొత్తాలను ఏరి హారంగా కూర్చి పార్వతీ గళసీమ నలంకరించాడు (శ్లో॥ వహత్యంబ....... సౌందర్యలహరి) 25 మత్తేభాల కుంభ స్థలాలు ముత్యాల నిధులని కవి సమయం. ఇక ఐరావతం ఉన్నత కుంభ స్థలాలకూ తెల్లదనానికీ ప్రసిద్ధి. దాని కుంభ స్థలాల యొక్క నిధిత్వ పృథుత్వాలను సైతం అపహసిస్తాయి దేవీ కుచ కుంభాలు. ఆ స్తనాల చేత గౌరవింపబడుతుంది ఆమె ధరించిన ముత్యాల హారం. ఇక్కడ స్తనాలూ హారాలూ రెండూ పరస్పర సౌందర్య పోషకాలు. ఆ హారాల వల్ల ఆమెకు కలిగిన శోభ వాగతీత మయిందీ ఊహించుకో వలసింది మాత్రమే. రంభా కరీంద్ర ------ గతిః గిరిజాదేవి ఊరువులకున్న గుండ్రన వెచ్చన బరువు నునుపు అనే నాల్గు లక్షణాలూ అటు అరటి బోదెలకు గానీ ఇటు ఏనుగు తొండాలకుగానీ పూర్తిగా లేవు- రెండేసి మాత్రమే ఉన్నాయి. నునుపు గుండ్రన అరటి బోదెకు ఉన్నా దాని ఆకారం తల క్రిందులై శైత్యాన్ని వహిస్తుంది. ఇక వెచ్చన బరువు అనేవి కరి కరానికి ఉన్నా అది గరుకు దేలి ఉంటుంది. అరటి బోదెలోని చల్లదనం కరికరంలోని కరుకుదనం రెండూ అనుభవ యోగ్యమైన లక్షణాలు కావు. కనుక ఆ రెండింటిలో ఏదీ ఆమె ఊరువులతో సాటిరాదు. సల్లక్షణాలన్నీ సమష్టిగాగల పార్వతీదేవి సుందరతర వనిత. ఆ దేవి కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత. సౌభాగ్య మార్దవ లక్షణాలుగల ఆమె ఊరు సౌందర్యం శివుడికి అత్యానందాన్ని కలిగిస్తుంది. డింభాను రంజిత పదా సుకుమారి అయిన ఆమె పాదాలు పసిపిల్లల పాదాల లాగా ఎర్రగా వుంటాయి. ఇది మంగళప్రదమూ మనోహరమూ కూడా. పార్వతీ దేవి తనపాదాలను ఆశ్రయించిన బాలురవంటి తన భక్తుల బాధలను తొలగించే అనురాగ రంజని. ఆమె పాదాల పారాణి కాంతులు శ్రీ మహావిష్ణువు ధరించిన శిరోభూషణపు మణి కాంతులుగా శ్రీ ఆదిశంకరులు భావించారు.. శంభా వుదార ...... పిశునా ఉదార పరిరంభ = సర్వాంగీణ పరిష్వంగం. ఇది గాఢాను రాగ ప్రకటన విధానం. దేవి మహాదేవ రతౌత్సుక్య. శివుడి తోడి రతి క్రీడతో ఆమె ఆనందిస్తుంది. ఆమె రమణలంపట, కామకేళీ తరంగిత, శృంగారరస సంపూర్ణ. శివుడితోడి క్రీడా విశేష పరం పరగలది. ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులు ప్రణయానురాగం రాగ జీవులకు ఆదర్శ ప్రాయం. నిత్య శుచిమతం వారి అన్యోన్య దాంపత్యానికి ఆలంబనమై ఆమె శంభుమోహినిగా గణుతి కెక్కింది. భాసురాభరణ గుంఫా గుంఫా = కూర్పు, రచన. సంస్కృతంలో గుంఫ శబ్దమే కాని గుంభ శబ్దం లేదు. కానీ ఈ శ్లోకంలో గుంభ శబ్దం పాఠాంతరంగా వుంది. ఈ పాఠాంతరాన్ని తెలుగులో ఒక్క కవి మాత్రమే ప్రయోగించినట్లు సూర్య రాయాంధ్ర నిఘంటువు పేర్కొన్నది. దేవీ అశ్వధాటి ఆభరణాల అలంకరణ ఒక సౌందర్య కళ. ఇలా కళాదృష్టి లేని ఆభరణధారణ వృథా. ఆభరణాలు భర్తృ ఫలాభివృద్ధిదాలు కావాలి. అసలు ఆభరణ రచన మగని మనసును దోచుకోవటానికి దోహద పడాలి. అది ప్రకాశవంతంగానూ నయనానందకరంగానూ ఉండే మంగళా భరణాలైతే మరీ మంచిది. లోకంలో కొన్ని ఆభరణాలకు పూజార్హతే గాని ధారణార్హత లేదు. కానీ కామ కల్పోక్తమైన చతుష్షష్టి ఉపచారాలలోని మహాపతక చ్ఛన్న వీరాది ఆభరణాలను అమ్మవారు నఖశిఖ పర్యంతం కళాత్మకంగా అలంకరించు కొన్నది. ఇలా ఆమె సర్వా భరణ భూషితగా దివ్య భూషణ సందోహ రంజితగా వినుతి కెక్కింది. శం-సదా-ఆదిశతు-మే 26 శం = శుభం, శ్రేయస్సు, శాస్త్రం, కీర్తి, స్వర్గం, శివుడు, దేవపూజ, శక్తి, వృద్ధి, హృద్యం, శాంతం, సంతోషం, సుందరం మొదలైనవి. సత్+ఆదిశతు = అని విభజిస్తే సత్ సత్యే సాదౌ విద్యమానే ప్రశస్తే భ్యర్దిచ సత్ సత్యం, సాధువు, కలిగి ఉండటం, శ్రేష్ఠం మొదలైనవి. సత్ అనేది సద్రూపమైన పరమాత్మ. అది త్రికాలాబాధ్యమైన బ్రహ్మలక్షణం. సచ్చిదానంద నిత్య పరిపూర్ణ పాఖ్యం పంచలక్షణం బ్రహ్మ విద్యాత్ అని అద్వైతామృతో పనిషత్ వ్యాఖ్య. దీనిని బట్టి నత్తు చిత్తు ఆనందం నిత్యం పరిపూర్ణం అనే వాటితో పరబ్రహ్మం కీర్తింపబడుతుంది.నితాంత సచ్చిదానంద సంయుక్తంగా ఉంటుంది. కనుక ఈ గుణాలనే స్మరిస్తూ పరమాత్మను దర్శించాలి. అలా చేయటం వలన ఆ లక్షణాలు గల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.. ఆదిశతు - ఉపదిశతు - ఉపదేశించుగాక! పైన చెప్పిన పద్ధతిలో తనకు పరబ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించమని భక్తుని ఆకాంక్ష. శుంభాసుర ప్రహరణా శుంభ నిశుంభులు పరమ శివుడి కారుణ్యంతో మగవారివల్ల మరణం లేకుండా వరాన్ని పొంది దేవతలను హింసించసాగారు. అందుచేత వారిని సంహరించటానికి గౌరీ శరీరం నుండి అపురూప సౌందర్యవతిగా కౌశిక జన్మించింది. ఆమెను పరిణయ మాడాలని శుంభనిశుంభులు దూతలను పంపారు. కానీ ఆమె తనను జయించిన వారిని మాత్రమే వివాహమాడుతానని వారితో చెప్పి పంపించింది. ఆపై ఆమెను బలాత్కారంగా తీసుకొనిపోవటానికి వచ్చిన చండ ముండులనూ ధూమ్రలోచనుడినీ రక్తబీజుడినీ తక్కిన దనుజులందరినీ సంహరించింది. తర్వాత దేవి వారిద్దరినీ కూడా సంహరించింది. ఇది ధర్మ బద్ధం కాని కామానికి వ్యతిరేకంగా ఆమె చేసిన యుద్ధం. విశేషాలు ఇందులోని పార్వతీ దేవి శృంగారాధి దేవత. లోకంలో ప్రతి శృంగార మూర్తికి అనురాగం అలంకార ప్రీతి అధికంగా ఉంటాయి. అవి రెండూ పార్వతికి సహజ సంపదలే. కుచ సంభావ్య హారలతికా ప్రయోగం వల్ల అలంకారాలు సహజ సౌందర్యానికి శోభనిచ్చేవిగా ఉండాలని, డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు 27 తెలుస్తుంది. శంభాసుర గుంఫా అనే శబ్దాల ప్రయోగం వనితా కవితలకు అలంకార విషయంలో ఔచిత్యం అవసరమనే విషయాన్ని సూచిస్తుంది. శం శబ్ద ప్రయోగం వల్ల విశ్వ శ్రేయస్సు శాస్త్ర పాండిత్యం శుభ పరంపరలు కీర్తి కిరీటాలు స్వర్గ సౌఖ్యాలు మోక్ష సాధన వంటివి కావ్య ప్రయోజనాలు కావాలని తెలుస్తుంది. పిల్లవాడిని తల్లి పరిరక్షించిన విధంగా తనలోని చెడును పారద్రోలి శుభ పరంపరలను ప్రసాదించమని భక్తుడు కోరటం శుంభాసుర ప్రహరణా! సంబోధనలోని స్వారస్యం. దేవీ అశ్వధాటి శ్లో॥ దాక్షాయణీ దనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణా భిక్షాశినో నటన వీక్షా వినోదముఖి దక్షాధ్వర ప్రహరణా ॥ వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయ జన పక్షా విపక్ష విముఖీ యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్ష్మ్యావధాన కలనా ॥ 9 ప్రతిపదార్థం 28 దనుజశిక్షావిధౌ = రాక్షస సంహార విషయంలో, వికృతదీక్షా = అసాధారణమైన పట్టుదల గలదీ, మనోహర గుణా = సునసు కంపైనగుణ సంపదకలదీ, భిక్షాశినః = శివుడి, నటన వీక్షా = తాండవాన్ని తిలకించటంలో, వినోద ముఖీ = ఆనందించే ముఖం కలదీ, దక్షాధ్వర ప్రహరణా = దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసిందీ, దక్షా = సమర్ధురాలు, స్వకీయజన పక్షా = తనభక్తులకు అండగా నిలిచేదీ, విపక్ష విముఖీ = శత్రువులకు ప్రతికూల మైనదీ, యక్షేశ సేవిత = కుబేరుడి చేత సేవింప బడేది, నిరాక్షేప శక్తి = ఎదుర్కొనటానికి వీలు కాని శక్తి గలదీ, జయలక్ష్మీ = విజయలక్ష్మిని పొందటంలో, అవధాన = ఏకాగ్రత, కలనా = కలదీ, (లేదా, జయలక్ష్మ = విజయానికి గుర్తులైన, అవదాన = ప్రశస్తమైన, పూర్వచరిత్ర, కలనా = కలదీ) అయిన, దాక్షాయణీ = దక్షప్రజాపతి కూతురైన పార్వతి, మయి = నా పట్ల, వీక్షాం = దృష్టిని, విధేహి = ఉంచవలసింది. భావం శ్రీదేవికి గల విశేషమైన ఏకైక దీక్ష నిత్య రాక్షస సంహారమే! ఆమె అరి వీర భయంకరి. శివాపరాధం చేసిన వారిని ఎవరినీ ఆమె ససేమిరా క్షమించదు. చివరకు తన తండ్రి అయిన దక్షుడి యజ్ఞాన్ని సైతం ధ్వంసం చేసింది. గతంలో అనేక విజయ పరంపరలను సాధించిన సర్వ సమర్ధ. విజయ సాధనలో ఆమెకు ఏకాగ్రత మెండు. నిత్యం శివతాండవాన్ని తిలకిస్తూ సంతసిస్తుంది. ఉత్తమ గుణవతి. కుబేరుడు ఆమెను నిత్యం భక్తితో అర్చిస్తాడు. ఆమె భక్తుల పాలిటి కొంగు బంగారం. ఆ దాక్షాయణీదేవి నా పట్ల అనుగ్రహ దృష్టిని ప్రసాదించు గాక! విశేష పద వ్యాఖ్య దాక్షాయణి దక్షప్రజాపతి చేసిన ఉపాసనారీతికి మెచ్చి పార్వతి అతడికి కుమార్తెగా అవతరించింది. కనుక ఆమె దాక్షాయణి. దనుజ శిక్షా విధౌవికృత దీక్షా భండాసుర శుంభాసురు లనేకులను శస్త్ర ప్రత్యస్త్రాలతో నశింపచేసింది. భయంకరు లైన రాక్షసులను అలా సంహరించటం ఆమెకు దీక్ష. అదే విధంగా భక్తుడి లోని దనుజ లక్షణా లైన కామ క్రోధాదుల్ని నశింపచేయడానికి దీక్ష వహిస్తుంది. అలా చేసి భగవంతుడికీ భక్తుడికీ అభేదం కల్పిస్తుంది. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు 29 దనుజ శిక్షా విధౌవితత దీక్షా(పాఠాంతరం) వితత = కొనసాగించిన, ఆచరించిన సతు దీర్ఘకాల నైరంతర్యసత్కారాసేవితో దృఢ భూమిః అని పతంజలి యోగసూత్రం. దీర్ఘకాల పర్యంతం నిరంతరంగా సదాశయంతో దేవి శత్రుసంహార దీక్షనూ భక్త సంరక్షణ దీక్షనూ వహిస్తుంది. మనోహర గుణా ఆమె సత్వ రజ స్తమో గుణాలకు స్థాన భూతమైంది. వాటికి అతీత మైంది కూడా. ఆమె త్రిగుణాతీత. అలాగే ఆమె షాడ్గుణ్య పరిపూరిత. విష్ణు పురాణంలో పేర్కొన్న ఐశ్వర్య వీర్య యశః జ్ఞాన వైరాగ్యాలనే ఆరుగుణాలూ సంధి విగ్రహ యాన ఆసన ద్వైధీభావ సంశ్రయాలు అనే షడ్గుణాలూ ఆమె సొత్తు. ఆపై సత్వాది గుణాలను అతిక్రమించిన శాంత, శాంతమే ఆమెకు ప్రధానమైనా ఆమె నిర్గుణ శోభిత, గుణనిధి. మధుర స్వభావం గల మనస్విని. సంయమన శీల, నిరుపమ, ఉత్తమ గుణ శీలవతి. ఇలా సర్వగుణ సంపదలూ కలిగి ఉంటుంది. పరమశివుడి మనస్సును రంజింప చేస్తుంది. ఆపై తన మనోహరమైన లక్షణాలతో భక్తుల మనస్సులను, అహంకారాన్ని నశింపచేసి వారికి ముక్తిని ప్రసాదిస్తుంది. భిక్షాశినో నటన వీక్షా వినోద ముఖి దేవీ దృష్టులు నవ విధాలు. అవి ఉత్తమ స్త్రీలకు సహజమైనవే! ఈ దృష్టిభేదాలతో ఆమె సందర్భోచితంగా పలు ప్రయోజనాలు సాధించింది. రసభరితాలైన దేవీ లక్షణాలను ఆది శంకరుడు సౌందర్యలహరిలో వర్ణించిన తీరు మనోహరంగా ఉంది. సౌందర్యలహరి శివే శృంగారార్దా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతీ : హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జయినీ సభీషు స్మేరా తే మయి జనని దృష్టిః సకరుణా ॥ ఓ తల్లీ! నీ భర్త అయిన శివుని పట్ల అనురాగాన్నీ శత్రువుల పట్ల బీభత్సాన్నీ సపత్ని అయిన గంగపట్ల రౌద్రాన్నీ శివ మాహాత్మ్య కథా శ్రవణం పట్ల అద్భుతాన్ని శివుడి హారాలైన సర్పాలను చూచి భయానకాన్నీ పద్మాల సౌందర్యాన్ని జయించటంలో వీరాన్నీ చెలుల పట్ల పరిహాస భాషణంతో హాస్యాన్నీ ప్రదర్శించే నీ దృక్కులు నా పట్ల కరుణను ప్రదర్శించును గాక! ఇలా దేవీ దృక్కులను అష్టరసాత్మకంగా ఆదిశంకరులు అభివర్ణించారు. దృష్టులలోనే నాట్యం ప్రతిష్ఠితమైతుందనీ భావాలన్నింటినీ రసాలన్నింటినీ ప్రదర్శించే శక్తి నేత్ర దృష్టికి ఉన్నదనీ "భరత మహర్షి నాట్య శాస్త్రంలో అభివర్ణించాడు. దేవీ సాన్నిధ్యంలో ప్రతిరోజూ ప్రదోష సమయంలో ఆమె ముఖ సౌందర్య భిక్ష కోసం, భిక్షాశనుడు ఆదిభిక్షువు అయిన శివుడు చిదానందంతో తాండవం చేస్తాడు. నటేశ్వరిగా ఉండి ఆ తాండవాన్ని చిద్విలాసంగా చూస్తూ వినోదిస్తుంది పార్వతి. ఆమె మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షిణి. 30 దేవీ అశ్వధాటి భిక్షాళినో నటన వీక్షా వినోద ముఖి (పాఠాంతరం) భిక్షాళినః = అందమైన ఆమె ముఖ పద్మంలోని మకరంద భిక్ష కోసం వచ్చిన తుమ్మెదలు, నటన వీక్షావినోద ముఖీ = వాట్యాన్ని చూచినప్పుడు ఆమె ముఖం ఎంతో అందంగా ఉంటుంది. ఆమె ముఖాన్ని చూచి పద్మంగా భ్రాంతి చెంది తుమ్మెదలు వచ్చి చేరతాయి. వాటి అమాయకత్వానికీ, వాటి భ్రమణ రీతికీ ఆమె వినోదిస్తుంది. లోకవత్ లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాలలో చెప్పినట్లు ప్రపంచ సృష్టి పరమేశ్వర లీలా విలాసం. ఆ వినోదాన్ని తిలకిస్తుంది రసజ్ఞ అయిన ఆ దేవి. దక్షాధ్వర ప్రహరణా ఆమె దక్షయజ్ఞ వినాశిని. దక్షయజ్ఞం అహంకారానికి శివనిరాసనకూ ప్రతీక. దానిని ఆమె నాశనం చేసింది. ఆమె ఆరాధకులలో శివనింద ద్యోతక మైతే వారిని శిక్షిస్తుంది. సన్మార్గంలో పెడుతుంది. అందుకు దక్షుడే సాక్షి. స్వకీయ జన పక్షా ఆమె భక్త ప్రియ, భక్తి వశ్య. భక్తి చేత మాత్రమే స్వాధీన మైతుంది. భక్తులందరి పట్ల సమాన మైన ప్రేమను ప్రకటిస్తుంది. సకల సంపదలిచ్చి రక్షిస్తుంది. భక్త మానస హంసిక. వారికి సాయుజ్య ముక్తి నిస్తుంది. వారే ఆమెకు స్వకీయులు. వారిని సర్వవిధాలా సంరక్షిస్తుంది. విపక్ష విముఖీ తన భక్తులకు వ్యతిరేకులే ఆమెకు విపక్షులు-శత్రువులు. వారిలో శుంభ నిశుంభాది రాక్షసులు ముఖ్యులు. వారిని ఆమె సమూలంగా సంహరించింది. యక్షేశ సేవిత యక్షులకు అధిపతి, సంపదలిచ్చే పుణ్యజనేశ్వరుడు రాజరాజు, అతడే కుబేరుడు. పార్వతీదేవిని నిత్యం కుబేరుడు అర్చిస్తాడు. అందుచేత ఆమె రాజరాజార్చితగా ప్రసిద్ధి చెందింది. ఈ కారణం చేత సర్వసంపదలూ శక్తులూ ఆమె అధీనంలోనే ఉంటాయి. కనుకనే జనులందరి చేత ఆమె నిత్యం పూజలందుకుంటుంది. నిరాక్షేపశక్తి శ్రీవిద్య పంచదశీమంత్ర స్వరూపం. అందులోని నాలుగు బీజాలు గల శక్తి కూటాన్ని లలితాదేవి తన అధఃకాయంలో ధరించి ఉంటుంది. శ్రీచక్రంలోని అణిమాది భగమాలినీ పర్యంతమైన శక్తి సముదాయమూ బాలా శ్యామలా మొదలైన సర్వ శక్తులూ సర్వ మంత్రాలలోని శక్తిబీజాలూ అన్నీ ఆమె స్వరూపాలే! ఆమె సర్వశక్తిమయి. సర్వప్రాణులలోని జీవకళే ప్రకాశరూపమైన శక్తి. అజ్ఞానాన్ని పోగొట్టేదీ జ్ఞానమే ప్రధాన మైనదీ అయిన చిచ్ఛక్తి ఆమె. ఆ పై 'పరాశక్తి మహాశక్తి అన్నీ ఆమే! కనుకనే ఆమె శక్తిని అడ్డుకొనే శక్తి ఎవరికీ లేదు. జయలక్ష్మ్యావధానకలనా జయలక్ష్మి. + అవధాన + కలనా. అవధాన = నిశ్చలత్వం, ఏకాగ్రత. కలనా = ధరించటం, డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు కలిగి ఉండటం. ఆమె ఏకాగ్ర చిత్తంతో భక్తులకు విజయాన్నీ జ్ఞానాన్నీ ముక్తినీ కలిగిస్తుంది. ఆమె సర్వ శత్రు సంహారిణి. సర్వత్ర విజయాన్ని సాధించే విజయ. జయలక్ష్మి + అవధాన + కలనా. అవదానం = జరిగిన మంచి చరిత్ర. దీని వల్ల నరుడు పునీతు డౌతాడు. 31 అపదానం = కర్మవృత్తం, పూర్వమందైన పవిత్ర వ్యాపారం, మంచి నడవడి - మంచిపని. ఆ అద్భుత చారిత్ర. జయస్వరూపురాలు. భయంకరమైన రాక్షసులను సంహరించిన అనేక సంకేతాలు గలది. ఇలా సుప్రసిద్ధమైన వీరకృత్యాలకు సంబంధించినది ఆమె చరిత్ర. విశేషాలు కవికి కఠోరదీక్ష అవసరం. కవిత మనోహర గుణ కలిత కావాలి. భిక్షాళి లాగా కవి కవితా మకరంద మాధుర్యాన్ని పొందు పరచాలి. వినోదముఖి శబ్దం వల్ల కవిత ఆనంద ప్రదంగా వుండాలని సూచన. ఉత్తమ కవికి నిరాక్షేప శక్తి ఉంటుంది. అదే ప్రతిభ. దాని వల్ల కవిత నవనవోన్మేషశాలిని అవుతుంది. దేవి స్వకీయులైన భక్త కవుల పక్షాన నిలిచి వారికి జయలక్ష్మినీ ఏకాగ్రతనూ ప్రసాదించమని కవి అభ్యర్ధన. వినోదముఖీ శబ్దం వల్ల కవి జగద్వ్యాపారాన్ని రసహృదయంతో తిలకించాలే తప్ప, ఆ ప్రపంచ వ్యవహారంలోకి దిగరాదనీ ఊరక చూచి ఆనందించాలనీ భావం. పార్వతి దృష్టి లాగే కవిత కూడా వివిధ రసభరితం కావాలని వీక్షా శబ్ద స్వారస్యం . అటువంటి కవితా శక్తిని తనకు ప్రసాదించమని కాళిదాస కవి అభ్యర్ధన. అందుకు దక్షతనయ దక్షురాలని భావం. దేవీఅశ్వధాటి శ్లో॥ వందారు లోక వర సందాయినీ విమల కుందావదాత రదనా బృందారబృంద మణిబృం దారవింద మకరందాభిషిక్త చరణా । మందానిలా కలిత మందారదామభి రమందాభిరామ మకుటా మందాకినీ జవన భిందాన వాచ మరవిందాసనా దిశతు మే ॥ 10 ప్రతిపదార్థం 32 వందారు లోక = నమస్కరించే భక్త జనానికి, వరసందాయినీ = వరాల నిచ్చేదీ, విమల కుంద = నిర్మలమైన బొండు మల్లెల వంటి, అవదాత = తెల్లటి, రదనా = పలువరుస గలదీ, బృందార-బృంద = దేవతా సమూహపు, మణిబృంద = (కిరీటాలలోని) రత్న సమూహంతో ఉన్న, అరవింద = పద్మాలలోని, మకరంద = పూదేనెలతో, అభిషిక్త చరణా = అభిషేకించబడిన పాదాలు గలదీ, మందానిల = పిల్ల గాలుల చేత, ఆకలిత = చక్కగా కూర్చిన, మందార = మందార పూల, దామభిః = మాలికలతో, అమంద = మిక్కిలి, అభిరామ = మనోహరమైన, మకుటా = కిరీటం గలదీ, అయిన, అరవిందాసనా = పద్మం ఆసనంగా గలదీ అయిన జగన్మాత, మందాకినీ = ఆకాశ గంగానది యొక్క, జవన = వేగాన్ని, భిందాన = అతిగమించే, వాచం = వాక్కును, మే = నాకు, దిశతు = ఇచ్చు గాక! భావం ఆమె పద్మాసన. వందనం చేస్తే చాలు ఆ దేవి వరాలు కురిపిస్తుంది. మల్లె మొగ్గ ల్లాంటి చక్కనైన పలువరుసతో ఆమె మెరిసిపోతుంది. పద్మాలను అలంకరించుకున్న మణి కిరీటాలతో దేవతలు శిరసులు వంచి నమస్కరిస్తుంటే ఆ పద్మాలలో నుండి జాలువారే మకరంద ధారలతో ఆమెకు పాదాభిషేకం జరుగుతుంది. ఆమె ధరించిన మణి కిరీటాన్ని మందానిలుడు మందారాలతో ముంచెత్తి మరీ మరీ మనోజ్ఞంగా చేస్తాడు. పవిత్రమైన గంగా ప్రవాహ వేగాన్ని మించిన వాగ్ధాటిని ఆ జగన్మాత నాకు ప్రసాదించు గాక ! విశేష పద వ్యాఖ్య మందానిలాకలిత. .మకుటా మందానిలం = శైత్య మాంద్య మాధుర్యాలనే మూడు లక్షణాలు కలది. మందార = ఇంద్రుడి నందన వనంలోని దేవతావృక్షా లైదింటిలోనూ ఇది ఒకటి. పంచైతే దేవ తరవో, మందారః పారిజాతకః । సంతానః కల్పవృక్షశ్చ, పుంసివా హరిచందనం ॥ మందారం పారిజాతం సంతానం కల్పవృక్షం హరిచందనం పార్వతీదేవి మందార కుసుమ ప్రియగా పేరు గాంచింది. వీటి పూలు లోక ప్రసిద్ధాలు. ఆమె కురువింద మణి శ్రేణీ కనత్కోటీర మండిత - కురువింద శిలలు ఎర్రటి కాంతులతోనూ కామం అనురాగం వంటి సుగుణాలతోనూ శోభిస్తాయి. వాటిలో నుండి డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు పద్మరాగమణులు ఉద్భవిస్తాయి. ఆ మణులతో దేవీ మకుటం ప్రకాశిస్తుంది. వాయువు భక్తి ప్రపత్తులతో ఆ కిరీటానికి మందారాది దేవతా సుమాలను కూర్చి, అలంకరించి సువాసనలు సమకూర్చుతాడు. ఇలా మణిగణాలకు మందారాలు తోడై ఆ కిరీటం మనోహరంగా భాసిల్లుతుంది. పార్వతీ దేవి ధరించిన సువర్ణ కిరీటం ద్వాదశాదిత్యులనే మహామణులతో కూర్చబడిందనీ తలమిది నెలవంక రత్నఖచితమై అనేక రంగులతో ప్రకాశించే ఇంద్ర ధనుస్సును తలపిస్తుందనీ ఆదిశంకరులు భావించారు. 33 గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః । స నీడేయచ్ఛాయాచ్ఛురణ శబలం చంద్ర శకలం ధనుః శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ॥ సౌందర్యలహరి ఉషః కాలంలోని గగన ప్రకృతే దేవీ కిరీటం. కృష్ణ చతుర్దశి అమావాస్యల సంధిలో కలిగే ఉషఃకాల సంబంధమైనది ఈ చిత్రణం. కృష్ణచతుర్దశి భగవతీ ఉపాసనకు తగిన సమయం. కార్తిక కృష్ణ చతుర్దశి అయితే సాక్షాత్తు భగవతీ స్వరూపమే కదా!. కనుకనే దానికి రూప చతుర్దశి అని వ్యవహారం. అరవిందాసనా అరవిందం = కేసరాలను కలిగి ఉండేది. కేసరాలున్న పూలలోనే మకరందం ఉంటుంది. వాటికే పూజార్హత. దేవి అరవిందాసన, పద్మాసన. ధర్మమే పద్మం, పద్మ మూలం జ్ఞానం. కర్ణిక వైరాగ్యం. సాధకుడు ఈ ధర్మ జ్ఞాన వైరాగ్యాలను దీక్షతో భక్తి శ్రద్ధలతో అనుష్ఠించాలి. అలా చేస్తే ఆ దేవి తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తుంది. విశేషాలు మకరందాభిషిక్త చరణ అని కాళిదాసు భావించాడు. శంకరాచార్యులు మరికొంత ముందుకు వెళ్ళి దేవీ పాదోదకం పుట్టు మూగలను సైతం మహాకవితా పట్టభద్రుల్ని చేస్తుందని సౌందర్యలహరిలోని కదాకాలే మాతః అనే శ్లోకంలో పేర్కొన్నాడు. ఆ కవిత్వం సరస్వతీ తాంబూల రసం లాగా రంజకంగా కూడా ఉంటుందని జగద్గురువుల అభిభాషణం. కుంద నైర్మల్యం అరవింద మరంద మాధుర్యం మందారాల మకరందం మార్దవం సౌరభం, మందాకినీ వక్ర గమనంలోని సౌందర్యం పవిత్రత కవితలో ఉండాలని కవి భావన. గంగా స్రవంతి లాంటి కవిత తనకు కావాలని కవి కోరిక. కవిత పవిత్ర మైన దనీ వక్రత దాని అందక్కిస్తుందనీ సూచన. శ్రీనాథుడు హరచూడాహరిణాంక వక్రత అని వక్రతను హరవిలాస పీఠికలో సంభావించాడు. దేవీ అశ్వధాటి 3 శ్లో॥ యత్రాశయో లగతి తత్రాగజా వసతు కుత్రాపి నిస్తుల శుకా సుత్రామ కాల ముఖ సత్రాసకప్రకర సుత్రాణ కారి చరణా । ఛత్రానిలాతిరయ పత్రాభిరామ గుణ మిత్రామరీ సమ వధూః కు త్రాసహీన మణి చిత్రాకృతి స్ఫురిత పుత్రాది దాన నిపుణా ॥ 11 ప్రతిపదార్థం 34 సుత్రామ = ఇంద్రుడు, కాల = యముడు, ముఖ = మొదలైన, సత్రాసక = భయపడి ఉన్నవారి, ప్రకర = సమూహాన్ని, సుత్రాణకారి సమర్థంగా రక్షించే, చరణా = పాదాలు గలదీ, ఛత్ర = గొడుగు యొక్క, అనిల = గాలిచేత, అతిరయ = పెరిగిన వేగంగల, పత్ర = వాహనం గలదీ, అభిరామగుణ = మనోజ్ఞమైన లక్షణాలు గల, మిత్ర = చెలులైన, అమరీసమ = దేవతా స్త్రీలతో సమానమైన, వధూః = వనితలు గలదీ, కుత్రాస-హీన = నింద్యమైన భయంలేని, మణిచిత్రాకృతి = రత్నాల బొమ్మలవంటి, ఆకృతి = ఆకారంగల, స్ఫురిత = ప్రకాశించే, (కుత్రాస = చెడ్డదైన భయాన్ని, హన్ = ధ్వంసంచేసే, మణి = ఉత్తములైన, విచిత్రాకృతి = చిత్రమైన స్వరూపంతో, స్ఫురిత = ముద్దులొలికే) పుత్ర+ఆది = పుత్రాది = పుత్ర సంతానాన్నీ, ఇంకా ఇతర సంపదలను, దాన నిపుణా = ప్రసాదించటంలో సామర్ధ్యం గలదీ, అయిన, నిస్తుల = సాటిలేని, అందమైన, శుకా - చిలుకతోకూడిన, అగజ = పార్వతీదేవి, యత్ర = ఎచ్చటైతే, ఆశయః = ఆమె హృదయం, లగతి = గమైతున్నదో, తత్ర = అక్కడ, కుత్ర+అపి = కుత్రాపి = మరెక్కడైనా, వసతు = ఉండుగాక! భావం = గిరిజా పాదసేవ ఇంద్రాది దిక్పాలకు లందరి భయాందోళనలను ఇట్టే పోగొడుతుంది. వారి రక్షణ భారాన్ని సర్వాన్నీ సదా ఆమె వహిస్తుంది. ఆమె వహించిన గొడుగు వాయువేగం వల్ల ముందుకు తోస్తుంటే, ఆమె అధివసించిన రథవేగం అధికాధిక మైతుంది. ఆమెకు మనోహర మైన విలాసవతులూ దేవతా స్త్రీలతో సమానమైన వారూ ఐన చెలికత్తె లెందరో ఉన్నారు. నిర్భయులూ తేజశ్శాలురూ అయిన రత్నాలవంటి పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తుంది. మరెన్నో సంపదలను ప్రసాదిస్తుంది. చక్కని రాచిలుకను ధరించిన దేవీ రూపాన్ని ధ్యానించిన భక్తుల హృదయాలలో ఆమె అధివసించు గాక! విశేష పద వ్యాఖ్య యత్రాశయోలగతి తత్రాగజా భవతు ధ్యాన గమ్య, భక్తుడికి ధ్యానయోగం వల్ల దర్శన మిస్తుంది. మంత్ర భావన చేత భక్తుడి యొక్క ఆత్మ శక్తిమంత మైతుంది. భక్తి కలిగి దేవతారూపాన్ని ధ్యానించటమే చిత్తవృత్తి. అదే భావన. ఏ భక్తులు అగజా స్వరూప దర్శన ఆశయంతో ఇలా గాఢంగా భావిస్తారో వారి హృదయాలలో ఆమె సదా నివసిస్తుంది. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు నిస్తుల శుకా అందమైన చిలుక. చిలుక చెట్టు మీద ఉన్న ఫలాన్ని చూసిన వెంటనే దాన్ని అనుభవిస్తుంది. అదేవిధంగా జ్ఞానయోగి తురీయ స్వరూపమైన బ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకొన్న వెంటనే తత్స్వరూపుడై అవిద్యా విముక్తు డైతాడు. చిలుకతో కూడిన దేవిని ధ్యానిస్తే ఆమె తనభక్తులను బ్రహ్మతత్త్వ విదులను చేసి అవిద్యా విముక్తులను చేస్తుంది. కనుక ఆమె చేతిలోని చిలుక బ్రహ్మతత్త్వానికి సంకేతం. సుత్రామ కాల ముఖ ...... 35 ..... చరణా చండ ముండ భండ మహిషాసురాది రాక్షస బాధలకు తాళజాలని దేవతలూ యముడూ కూడా పలుసార్లు జగన్మాత పాదాల మీదపడి ప్రార్థించారు. ఆ పరదేవత దైత్యులను సంహరించి దేవతల భీతిని పోగొట్టి రక్షించింది. ఇలా ఆమె ఎప్పుడూ వారి రక్షణ యాత్రకు అంకితమై ఉంటుంది. ఆమె దైత్యహంత్రి, దేవకార్య సముద్యత, ఛత్రానిలాతిశయ పత్రా వాయువేగం ఆమె అధివసించిన రధం మీద ఉన్న వెల్ల గొడుగును ముందుకు నెట్టడం చేత రథవేగం పెరిగిం దనిభావం. దేవీ శ్వేతచ్ఛత్రసౌందర్యం తిలకింపదగింది. 'శరత్ప్రభవ చంద్రమ స్ఫురిత చంద్రికా సుందరం గళ త్పురతరంగిణీ లలిత మౌక్తికాడంబరం । గృహాణ నవకాంచన ప్రభవ దండ ఖండోజ్జ్వలం మహా త్రిపుర సుందరి ప్రకట మాతపత్రం మహత్ ॥ శ్రీశ్రీశ్రీ దుర్గామానసపూజ మహా త్రిపురసుందరికి సమర్పించిన దివ్య చ్ఛత్రం శరత్కాలపు వెన్నెలలాగా తెల్లనిదీ కాంతిమంతమైనదీ సుందరమైనది. ఆకాశగంగానదీ ప్రవాహం నుండి ప్రక్కకు జారిపడుతున్న నీటి బిందువుల్లాంటి ముచ్చటైన ముత్యాలతో ప్రకాశిస్తుంది. సువర్ణ దండంతో దేదీప్యమానమైన కాంతితో విరాజిల్లుతుంది. *************** పుత్రాది దాన నిపుణా దేవిని ఆరాధించటం వల్ల మణి మాణిక్యాల వంటి సంతానం కలుగుతుంది. కోరికలు ఫలిస్తాయి. వంధ్యానాం పుత్ర లాభాయ, నేను సాహస్ర మంత్రితం ! నవనీతం ప్రదద్యాత్తు, పుత్రలాభో భవే ద్రువమ్ ॥ లలితా సహస్రనామస్తోత్రం దేవీ సహస్రనామ పారాయణం చేసి నవనీతాన్ని అభిమంత్రించి ఇస్తే పంధ్యలకు సైతం తప్పక పుత్రప్రాప్తి కలుగుతుంది. n 36 దేవీ అశ్వధాటి కుత్రాస హన్మణి విచిత్రాకృతి స్ఫురిత పుత్రాదిదాన నిపుణా (పాఠాంతరం) స్ఫురిత ఒకతీరుముద్దు, మెఱుపు. చిత్రమైన జన్మలు, విచిత్రమైన స్వభావాలు, ముద్దులు మూటగట్టే అతి విచిత్రమైన ఆకారాలతో ప్రకాశించే షణ్ముఖ గజముఖు లిద్దరూ ఆ దేవికి ముద్దుబిడ్డలే. ఆ యిద్దరూ సద్యఃస్ఫురన్మూర్తులే. వారిలో ప్రత్యేకించి స్కందుడు అవక్రవిక్రమానికీ గజాననుడు అనంత విజ్ఞానానికీ ప్రతినిధులు. అలా వారిని తీర్చిదిద్దిన ఆ మాతృమూర్తి పార్వతీదేవి తనకు అత్యుత్తమ సంతానాన్నీ సర్వ సంపదలను ప్రసాదించాలని కవి అభ్యర్థన. విశేషాలు భక్తుడు తన మదిలో అగజా ధ్యానం చేసినట్లే, కవి తన హృదయంలో కవితామూర్తిని భావిస్తాడు. రచనా సమయంలో కవికి అదే భావయిత్రి. కారయిత్రికి ముందు గాఢ భావనలో కవి నిశ్చల తపస్సమాధి స్థితిని పొందుతాడు. ఆ స్థితిని పొందిన కవికి మాత్రమే కవితామతల్లి దర్శన మిస్తుంది. ఉత్తమ కవితా శక్తిని ప్రసాదిస్తుంది. కవి రచన సమాజానికి కేవలం దర్పణంలాగా మాత్రమేకాక మణిదర్పణంలాగా వెలుగొందాలి. కనుకనే దేవీ కృపగల కవి రసస్థితిని కలిగించే, అంటే తన్మయ స్థితిని గూర్చే ఉత్తమ కావ్యరచన చేస్తాడు. దానితోపాటు అందం ఆనందం అపూర్వత ఆదర్శం చైతన్యం అభ్యుదయం సత్యం శివం సుందరం వంటి లక్షణాలు కలదానినిగా తీర్చిదిద్ది సామాజిక ప్రయోజనాలను కూడా సాధిస్తాడు. అటువంటి కావ్యాలే కవికి ఉత్తమ సంతానాలు, అవే సర్వ సంపదలు. డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు శ్లో॥ 37 కూలాతిగామి భయ తూలావళిజ్వలనకీలా నిజస్తుతి విధా కోలాహలక్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ నభా । స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే శూలాయుధప్రణతి శీలా విభాతు హృది శైలాధి రాజ తనయా ॥ 12 ప్రతిపదార్థం కూల-అతిగామి = హద్దు మీరిన, మిక్కిలి, భయ-తూల-ఆవళి = భయమనే దూది రాసులకు, జ్వలన కీలా = అగ్నిశిఖ వంటిదైన, నిజస్తుతి విధా = తనయొక్క స్తోత్ర పద్ధతి గలదీ, కోలాహల = కష్టాల కలకతో, క్షపిత కాల = కాలం గడిపిన, అమరీ = దేవతా స్త్రీలకు, కుశలీ = క్షేమమనే, కీలాల = నీటిని, పోషణ = వృద్ధిపరచే, నభా = శ్రావణ మేఘం లాంటిది, కుచే-స్థూలా = స్తన విషయంలో భారం కలదీ, కచే-జలద నీలా = కురుల విషయంలో మేఘాలవలె నల్లనైనది, కదంబవిపినే = కడిమి చెట్లతోపులో, కలిత లీలా = విహారం కలదీ, శూలాయుధ = శూలాన్ని ఆయుధంగా ధరించే శివుడికి, ప్రణతిశీలా = నమస్కరించే మంచి నడవడి గలదీ అయిన, శైలాధి రాజతనయా = హిమవంతుడి కూతురైన పార్వతి, హృది = నా హృదయంలో, విభాతు = వెలుగొందు గాక! భావం శ్రీదేవీ స్తోత్ర విధాన మహిమ భక్తుల భయాలనే మిక్కిలి పెద్దవైన దూది రాసులను దహించే భయంకరమైన అగ్నిజ్వాల. దేవతా స్త్రీలకు శుభ పరంపరలనే వర్షాలను వృద్ధిపరచే శ్రావణ మేఘం. అంటే ఎప్పుడూ వారి యోగక్షేమాల బాధ్యతను తానే వహిస్తుంది. ఘనస్తనాలతో తెగబారెడు నల్లనికురులతో ఆమె శోభిస్తుంది. ఆమె నిత్యం కదంబవనంలో విహరిస్తుంది. పరమశివుడి వేషభాషలను విలాసంగా అనుకరిస్తుంది. సదాచార పరాయణ. నిత్యం పరమ శివుడికి పాదాభివందనం చేస్తుంది. ఆ పర్వత రాజతనయ పార్వతీదేవి నా హృదయంలో నిలిచి సదా ప్రకాశించును గాక! విశేష పద వ్యాఖ్య కూలాతి గామి .....నిజస్తుతి విధా పార్వతీదేవి స్తుతిప్రియ, స్తోత్రార్హమైన సద్గుణరాశి. ఆమె సర్వాపద్వినివారిణి, భక్తుల లన్నింటినీ నివారిస్తుంది. భయాల నన్నింటినీ పోగొడుతుంది. తన భక్తుల యొక్క ఆధివ్యాధులూ భవబంధాలూ జరపమృత్యువులూ కళంకాలూ భయాలు అనే ప్రత్తి కొండలను దహించే భయంకరమైన అగ్నిజ్వాల. ఆమెకు సంబంధించిన స్తుతివిధాన మహిమ ౦టిది. ఆమె వహ్నిమండల వాసిని. లోకంలో ఉన్న అగ్నిమండలం లోని దాహకశక్తి ఆమె స్వరూపమే. ఇందులో అర్చిష్మతీ అగ్నికళలుఅంతర్నిహితంగా ఉన్నాయి. ఆమెకు ఉన్న భయనివారకశక్తి అత్యద్భుతమైనది. 38 దేవీ అశ్వధాటి కోలాహల క్షపిత పోషణ నభా సభః = మేఘై ర్నభా తీతి నభః మేఘాలచేత ప్రకాశించనిది. న భ ఖం శ్రావణే నభః - ఆకాశం, శ్రావణమాసం. కడగండ్ల కలకతో కాలం గడుపుతున్న దేవతా స్త్రీలకు ఆ దేవి శుభ పరంపరలను వర్షించే శ్రావణమేఘం. స్త్రీల పట్ల ఆమె కత్యంత ప్రీతి.. మన్మథపత్ని పట్లగల ప్రేమచేత ఆమెకు రతిప్రియగా పేరువచ్చింది. ఆమె హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. ముక్కంటి కంటి మంటవల్ల బూడిదైనాడు మన్మధుడు. అతడిని బ్రతికించ మని దేవతలూ పతి భిక్షపెట్టమని రతిదేవి ఆ పరాశక్తిని ప్రార్థించారు. అప్పుడామె మన్మథుడిని పునర్జీవితుడిని చేసి రతిదేవికి వైధవ్యదోషం అంటకుండా చేసింది. ఈ మన్మథ పునరుజ్జీవనానికి దేవీ కటాక్షమే సంజీవన మూలిక. కనుక ఆ దేవిని ఉపాసించే స్త్రీలు నిత్య సుమంగళు లైతారు. ఆమె పులోమ జార్చిత, పులోమ మహర్షి పుత్రిక శచీదేవి, ఇంద్రుడి భార్య. నహుషుడు స్వర్గాన్ని పాలించిన రోజుల్లో అతడు దేవేంద్రుడిని పరదేశాలకు పారిపోయేట్లు చేశాడు. అప్పుడు బృహస్పతి శచీదేవికి త్రిపుర సుందరీ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆమె ఆ దేవిని అర్చించింది. ఆ దేవీ అనుగ్రహంతో తన భర్తనూ తమ రాజ్యాన్నీ తిరిగి పొందగలిగింది. అగస్త్యుడి భార్య లోపాముద్ర. ఆమె జగదంబికను అర్చించి అభేద భావాన్ని పొందింది. దానితో దేవి లోపాముద్రార్చితగా వాసికెక్కింది. ఇలా దేవతా స్త్రీలకు సుఖ పరంపరలను కల్పించి వారిని ఉన్నతలుగా చేయటం ఉమాదేవికి అభీష్టం. త్రిలోక సౌభాగ్య కరీం, భుక్తి ముక్తి ప్రదా ముమాం ॥ ఆరాధ్య సుభగాం నారీం, కిం సౌభాగ్యం న విందతి ॥ పద్మపురాణం ఇలా భగవతి శచీ ముఖ్యామర వధూ సేవితగా పతివ్రతాంగనాభీష్ట ఫలదాయినిగా సువాసిన్యర్చన ప్రీతగా వినుతి కెక్కింది. నీ చే నీల మేఘాలను చూచిన నెమళ్లు ప్రణయానంద భావోద్వేగంతో నాట్యంచేస్తాయి. అలాగే ఆమె అందమైన నల్లని కబరీ భరాన్ని చూచి ఆనందంతో ఈశుడు నటేశుడై తాడు. కలిత లీలా కదంబ విపినే శృంగార వనమైన కదంబ వనంలో విలాసంగా ఆమె విహరిస్తుంది. అంటే ప్రపంచ రూపక్రీడలో కదంబవనంలో విహరిస్తుంది. ఆమె లీలావినోదిని. విశేషాలు ఈ శ్లోకం అంతటినీ కాళిదాసు దేవతా స్త్రీలకే పరిమితం చేయటం విశేషం. ప్రత్యేకించి మనకిది ధ్యాన శ్లోకం వంటిది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః । యత్రైషాస్తు న పూజ్యంతే, సర్వాస్తత్రాఫలాః క్రియాః ॥ మనుస్మృతి డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు స్త్రీల క్షేమాన్ని సుఖాన్ని కాంక్షించటం మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. వారు శక్తి స్వరూపలని విశ్వాసం. స్త్రీలు రతిదేవిలాగా నిత్య సుమంగళులు కావాలి. పులోమజలాగా భర్తృ పురోభివృద్ధిని కోరాలి. లోపాముద్రలాగా దేవీ పదోన్నతలు కావాలి. వారు అంతటి ఉన్నతికి ఎదగాలంటే పార్వతిలాగా పతిభక్తి సంపన్నలు కావాలి. అందుకు ఆమెను స్థూలకుచగా నీలకచగా పతి ప్రణతి శీలగా ఎంచి ధ్యానించాలి. అలా ధ్యానిస్తే వారి హృదయాలలో ఆమె నివసిస్తుంది. శూలాయుధుడు దుష్ట శిక్షణకు సన్నద్ధుడైనట్లే కవి కూడా నిత్యం తన కవితలతో సమాజంలోని దుష్టశక్తుల మీద విజృంభించాలి. అది అతని బాధ్యత. కవితా ప్రయోజనమైన శివేతర క్షతి అంటే అశుభ నివారణ, సమాజపరంగా చాలా ముఖ్యం. కవి ధార్మిక సౌందర్యాన్ని తన ఆదర్శకాప్యంలో చిత్రించాలి. అలా చేసేదే ఉత్తమ కవిత. అటువంటి కవితలవల్ల ప్రజలు చైతన్య వంతులైతారు. విభాతు శబ్ద స్వారస్యం ఇదే! 39 40 దేవీ అశ్వధాటి శ్లో॥ ఇన కీరమణిబద్ధా భవే హృదయబద్ధా వతీవ రసికా సస్ధావతీ భువన సర్ధారణే ప్యమృత సిద్ధా వుదార నిలయా । గన్దానుభావ ముహురస్ధలి పీత కచబస్ధా సమర్పయతు మే శం ధామభాను మపి రున్దాన మాశు పద సస్ధాన మప్యనుగతా॥ 13 ప్రతిపదార్థం ఇంధాన = ముచ్చటైన, కీర = చిలుక, మణిబంధా = ముంజేతి మీద ఉన్నదీ, హృదయబంధౌ = ప్రేమ పాత్రుడైన, భవే = శివుడిపట్ల, అతివ = మిక్కిలి, రసికా = ప్రేమానురాగాలు కలదీ, అమృతసింధౌ = అమృత సముద్రంలో, ఉదారనిలయా - అపి = ఉత్తమనివాసం ఉన్నప్పటికీ, భువన = (భక్త) లోకం యొక్క, సంధారణే చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేయటంలో, సంధావతీ = సన్నిహిత సంబంధం కలదీ, గంధ = సుగంధ పరిమళాల, అనుభావ = ప్రభావంవల్ల, ముహుః = మాటిమాటికీ, అంధ = కళ్లు మూతలుపడిన, అళి = తుమ్మెదలవల్ల, పీత = పచ్చబడిన, కచబంధా = గొప్ప కొప్పుగలదీ, ధామః = తేజఃప్రభావం చేత, భానుం - అపి = సూర్యుణ్ణి కూడ, రుంధానం = అడ్డగించేదీ, ఆశుపద = ఆశుకవితను, సంధానం - అపి = ప్రసాదించటంలో కూడ, అనుగతా = తగిన పార్వతి, శం = శుభాన్నీ, సామర్థ్యాన్ని, (లేదా, భానుం - అపి = సూర్యుణ్ణి కూడ, రుంధానం = అడ్డగించే, పద సంధానం = పదగమనాన్ని, అనుగతా = కలిగియున్న పార్వతీదేవి, మే = నాకు, ఆశు = త్వరగా, శం - అపి = శుభాన్ని కూడా) మే = నాకు, సమర్పయతు = అనుగ్రహించునుగాక! భావం విశేష పద వ్యాఖ్య ఇంధానకీర మణిబంధా = రసజ్ఞ అయిన పార్వతీదేవి అందాల రాచిలుకను తన ముంచేతి మీద ధరించి ముచ్చటలు చెబుతుంది. తన హృదయ బంధువైన పరమేశ్వరుడిపట్ల ఆమెకు అత్యంతానురాగం. తాను నివసించేది అమృత సరస్సులోనే అయినా, అక్కడ సర్వ సుఖాలతో మునిగితేలుతున్నా భక్తరక్షణే ఆమెకు పరమధ్యేయం. భక్తుల చిత్రాలను పరమేశ్వరుని పట్ల లగ్నం చేస్తుంది. పచ్చటి పుప్పొళ్లు తమ శరీరాలకు అంటుకొన్న తుమ్మెదల గుంపులు వచ్చి వాలటంచేత, సహజ సువాసనలు వెదజల్లే ఆమె కేశపాశం పచ్చగా మారి ప్రకాశిస్తుంది. సూర్యమండల తేజస్సును సైతం అధఃకరిస్తాయి ఆమె పాదకాంతులు. ఆమెకు గల ఆశుకవితా శక్తి అమోఘం. దానిని ఆమె నాకు అనుగ్రహించి శుభాన్ని కలిగించుగాక ! తిరగటం చిలుకల పలుకులు కమనీయం, వాటి రూపం రమణీయం. చిలుకలు మృదుమధుర మనోజ్ఞభాషా ప్రతిరూపాలు. శృంగారోద్దీపక కారకాలు. ప్రియంభావుకలైన చిలుకల కొలుకులు డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు తమ ముంజేతుల మీద చిలుకలను నిలిపి వాటిచేత మృదు మధురంగా మాటాడించటం ఒక విలాసకళ. వాటితో వినోదించటం రసజ్ఞ లక్షణం. కీరపాణి అయిన దేవిని మృదుమధుర కవితా ప్రదాయినిగా భావించాడు కాళిదాసు. 41 భవే హృదయ బంధౌ భవుడు భవానికి హృదయ బంధువు. అతడు ఆమెకు హృదయబంధం. జగద్రూపకుడైన శివుడికి ఆమె ప్రాణనాడీ స్వరూపిణి. ఇలా పార్వతీ పరమేశ్వరులు ప్రణయైకజీవులు. పార్వతిలాగా ప్రతి స్త్రీ తన భర్తకు హృదయబంధం కాగలగాలి. అలాగే ప్రతి పతీ పరమశివుడిలాగా తన భార్యకు హృదయబంధువు కావాలి. అప్పుడే వారిది అరమరికలు లేని ఆదర్శ దాంపత్యం అవుతుంది. అతీవరసికా పార్వతీదేవి రసజ్ఞ. శృంగార రస సంపూర్ణ, శృంగార రసాధి దేవత. రసేంద్రియ స్వరూపిణి. రసమయ జీవన ప్రదాత్రి. భర్తపట్ల ఆమెకుగల అనురాగం అతివలందరికి ఆదర్శం. రసహృదయలు మాత్రమే వల్లభులకు ప్రాణబంధువులైతారు. వారి ప్రాణగ్రంథు లైతారు. భగ వత్స్వరూపం ఎప్పుడూ రసస్వరూపమే కదా! సంధావతీ భువన సంధారణే దేవి తన భక్తుల తాప త్రయాలనూ దోషాలనూ రాగ ద్వేషాలనూ అజ్ఞానాన్నీ తొలగించి వారికి ఐహిక ఆముష్మిక సుఖాలను కలిగిస్తుంది. ఆమె భక్త రక్షణ తత్పర. దుష్టులైన రాక్షసుల బారి నుండి భక్తులైన దేవతలను పలుమార్లు కాపాడింది. అది తన విధిగా భావిస్తుంది భవాని. అమృతసింధా వుదార నిలయా శ్లో॥ ఆమె సుధాసాగర మధ్యస్థ - సర్వ సౌఖ్యాలకు నిలయమైన అమృత సముద్రంలో నివసిస్తుంది. ఆమె నివాసాన్ని గూర్చి ఆదిశంకరులు అభివర్ణించారు. సుధాసింధోర్మధ్యే సుర విటపివాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే । శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీమ్ ॥ సౌందర్యలహరి అమృత సముద్రంలో కల్పవృక్షాలతో చుట్టుకొన్న మణిద్వీపం ఒకటి ఉంది. అందులో కదంబ వనాలతో విలసిల్లే చింతామణి గృహం ఉంది. ఆ లోపల బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులనే నాలుగు కోళ్ల మంచంమీద ఉన్న సదాశివుడనే పరుపుమీద ఆమెనివాసం. అక్కడ ఆమె జ్ఞానానంద స్వరూపిణిగా ఉంటుంది. గంధానుభావ ముహు రద్దాలి పీత కచబంధా పార్వతీదేవి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఆమె శిరోజాలు పలు రకాల పూలతో పరిమళిస్తూ ప్రకాశిస్తాయి. ఆ పూలమీద వాలిన తుమ్మెదలు మకరందాన్ని చిత్తుగా దేవీ అశ్వధాటి ఆస్వాదిస్తూ మత్తుగా పడి ఉంటాయి. అప్పుడు వాటి పాదాల కంటుకొన్న పూల పుప్పొళ్లు సోకి పార్వతీదేవి శిరోజాలు పీతవర్ణంగా మారిపోతాయి. సహజంగా పచ్చని శరీరకాంతితో ఆమె పీతవర్ణగా ప్రకాశిస్తుంది.ఇప్పుడు పీతకచగా కూడ మారింది. ఈ పీతవర్ణం ఆమె సర్వ వ్యాపకత్వానికి సూచనం. 42 ధామ భాను మపి రుంధానం భా తీతి భాను ప్రకాశించేవాడు సూర్యుడు. దేవి భానుమండల మధ్యస్థ సూర్యమండల మధ్యభాగంలో ఉంటుంది. ఆ సూర్యమండలం సాక్షాత్తు బ్రహ్మ స్వరూపం. అది చంద్రాగ్ని సమ్మేళన స్వరూపం. అటువంటి సూర్యమండలం ఆమె నివాసం. అంటే అందులోకి ప్రవేశించగల శక్తి ఆమెకుంది. అంతేకాదు ఆమె ఉద్యద్భాను సహస్రాభ ఉదయిస్తున్న వేయి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది. తేజోవతి. ఆమె తేజస్సు ముందు సూర్యమండలం కూడ వెలవెల బోతుంది. ఆమె జ్ఞానవిగ్రహ, జ్ఞాన దాయిని, విజ్ఞానఘనరూపిణి. సూర్యుణ్ణి మించిన ప్రతిభా పాండిత్యాలను చైతన్యాన్నిగూడ ఆమె తన భక్తులకు ప్రసాదిస్తుంది. ఆశుపదసంధాన మప్యనుగతా ఆమె వాగధీశ్వరి, కళాలాప, కవిత్వ పటుత్వ మహత్వ శక్తి ప్రదాత్రి. ఆశుపద కవితా ప్రాప్తికి భక్తులు ఆమెను సేవిస్తారు. ఆమె తేజోవంతమైన తన పద సంచారంతో సూర్య మండలాన్ని సైతం అడ్డగిస్తుంది. దాన్ని నిస్తేజం చేస్తుంది. సూర్య చంద్రులకు స్వయం ప్రకాశక శక్తి లేదు. కానీ దేవీపాదాల నుండి వెలువడే కొద్దిపాటి కాంతికిరణాలతోనే వారు తేజోమూర్తులై లోకాలను ప్రకాశింపచేస్తారు. అదీ ఆమె అనుజ్ఞతోనే. విజ్ఞాననిధి అయిన సూర్యుణ్ణి నోరెత్తనివ్వని (వాక్హాంభనం కలిగించే వేగవంతమైన మాటలు కలది అని అర్థాంతరం. విశేషాలు ఇంధానకీరహృదయబంధు అతీవరసిక అమృతసింధు శబ్దాలు, కవిత మనోహరంగా హృదయావర్ణకంగా ధర్మశృంగార ప్రధానంగా ఆపాత మధురంగా ఉండాలని సూచిస్తాయి. ముహురంధాళి శబ్దం సహృదయ ఆనంద లక్షణాన్నీ పీతశబ్దం దేవీ సర్వ వ్యాపకత్వాన్నీ శృంగారాధిపత్యాన్నీ కచ శబ్దం అజ్ఞాన నిర్మూలనలో ఆమెకు గల శక్తినీ తెలియ చేస్తున్నాయి. ప్రతి మంత్రానికీ ఒక అధిష్ఠాన దేవత - ధ్యానదేవత - ఉంటుంది. ఆ ధ్యానదేవతకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ శ్లోకంలోని ధ్యానదేవత విజ్ఞానదాయిని. ఆశుకవితా ప్రదాయిని. ఆదిశంకరుడు కవితా ధారకోసం ప్రార్ధించిన సారస్వతమూర్తి కూడ తత్తుల్యమైనదే! శరజ్జ్యోత్స్నా శుభ్రం శశియుత జటాజూట మకుటాం వర త్రాస త్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం । సకృన్నత్వా న త్వా కథమివ సతాం సన్నిదధతే మధు క్షీర ద్రాక్షామధురిమ ధురీణాః ఫణితయః ॥ - సౌందర్యలహరి డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు శరత్కాలంలోని చంద్రుడిలాగా తెల్లగా ఉండి మనోహరమైనదీ జడచుట్టలో నెలవంక గలదీ నాలుగు చేతులలోనూ వరుసగా వరముద్ర అభయముద్ర స్ఫటికమాల పుస్తకం ఉన్న ఆమెను ధ్యానిస్తే మధు క్షీర ద్రాక్షాపాక సదృశమైన కవితారీతి పుట్టుకొని వస్తుంది. అదేరీతిగా కాళిదాసకృతమైన ఈ దేవీ అశ్వధాటిని పఠించడంవల్ల భక్తులకు గంగాఝరీ సదృశమైన ఆశు కవితాధార అలవడుతుంది. 43 జన్మస్థలం తల్లిదండ్రులు ఉద్యోగ డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు జ పరిశోధన ముద్రిత గ్రంథాలు DEVI ASWADHATI (Kalidasa ) అముద్రిత గ్రంథం Commentary by Dr. M. BHANU PRASADA RAO : ది. 6-8-1950 : నరసరావుపేట : అనంతలక్ష్మి, శేషాచలం : రీడర్, తెలుగు విభాగం ఎస్.ఎస్. &ఎన్. కళాశాల, నరసరావుపేట. : ఎం.ఫిల్. శృంగార రసవాహినిభోగినీ దండకము పిహెచ్.డి. పోతన భాగవతం-శృంగారం : 1. పోతన భాగవతం-శృంగారం 2. దేవీ అశ్వధాటి (వ్యాఖ్య) శృంగార తిలకం (వ్యాఖ్య)